గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: బుధవారం, 30 జులై 2014 (14:27 IST)

మా కొత్త సినిమా వేలం వేస్తున్నామహో.... రాంగోపాల్ వర్మ

అవును, నేను- రాంగోపాల్ వర్మ, మంచు విష్ణు కలిసి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పుడున్న డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్‌కి విప్లవాత్మకంగా ఓ కొత్త పద్ధతిలో మోహన్ బాబు కార్పొరేషన్ నిర్మించిన యాక్షన్, క్రైమ్ థ్రిల్లర్‌ని వేలం వేయబోతున్నాము. ఈ సినిమా ట్రైలర్‌ని ఈ రోజు జూలై 30న సాయంత్రం 6 గంటలకి యుట్యూబ్‌లో విడుదల చేయబోతున్నాము. 
 
ఈ సినిమాలో తారాగణం విష్ణు మంచు, తేజస్వి, రేవతి, కోట శ్రీనివాసరావ్, బ్రహ్మానందం,మధు షాలిని, సుప్రీత్, శ్రావణ్ తదితరులున్నారు. ఇక వేలం విషయానికొస్తే, ఆనవాయితీగా ఫిల్మ్ ఇండస్ట్రీ డిస్ట్రిబ్యూషన్ బిజినెస్‌లో నిర్మాత సినిమా ట్రైలర్‌ని సీడెడ్, వెస్ట్, ఈస్ట్, నైజాం, మొదలగు  డిస్ట్రిబ్యూషన్ ఏరియాలకి సంబంధించిన బయర్స్‌కి చూపించి తన రేటు చెప్పుతాడు. ఆ ట్రైలర్ చూసి వాళ్ళ దృష్టిలో ఆ సినిమా ఎలా ఉంటుందోనన్న అవగాహనతోనో, ఆ సినిమాలోని నటీనటులు, డైరెక్టర్, ప్రొడ్యూసర్ ట్రాక్ రికార్డ్‌ల మూలానో, ఆ సినిమాని చూడబోయే ప్రేక్షకుల అవగాహన మీద అంచనాతోనో ప్రొడ్యూసర్‌కి వాళ్ళ రేటు చెపుతారు. ఆ రేటు నచ్చకపోతే ప్రొడ్యూసర్ తన తాహతు బట్టి ఆ సినిమాని తనే రిలీజ్ చేసుకుంటాడు.
 
సినిమా అనేది ఈ రోజుల్లో ఒక కమర్షియల్ ప్రోడక్ట్... అలా అయినప్పుడు దాన్ని అతి ఎక్కువ మందికి అమ్మాలనే ముఖ్య ఉద్దేశ్యంలో నుంచి పుట్టుకొచ్చినదే నా ఈ వేలం పద్దతి డిస్ట్రిబ్యూషన్. కాకపోతే ఏ కమర్షియల్ ప్రోడక్ట్ లోనైనా మనం ఖచ్చితమైన లక్షణాలు చెప్పవచ్చు గానీ సినిమా అనే కమర్షియల్ ప్రోడక్ట్ లోని లక్షణాలు ఒక మనిషి సున్నితత్వం, బావోద్వేగాల మీద ఆధారపడుతుంది. అంతేకాకుండా ఆ సున్నితత్వాలు, ఆ భావోద్వేగాలు మనిషి, మనిషికీ మారిపోతూ ఉంటాయి. ప్రతి వ్యక్తిలోనూ వేర్వేరుగా ఉంటాయి.
 
నేను తీసిన సినిమాల్లో కొన్ని విజయం సాదించాయి కొన్ని సాదించలేదు. ఎప్పటికీ కొత్త కథా శైలితో చాలా ప్రత్యేకంగా ఉండాలనే ఉద్దేశ్యంతో నిర్మించే నా సినిమా, ఎలా ప్రేక్షకులకి నచ్చుతుందో ఊహించడం నాకైనా, మరెవరికైనా అసాద్యం. కానీ రెండుగంటల పాటు సినిమా చూసే ప్రేక్షకుడిని మెప్పించే నిజమైన ఉద్దేశ్యమే లేకపోతే నేను గానీ లేదా మరే ఇతర డైరెక్టర్ అయినా ఎందుకు ఆరు నెలలు నుంచి సంవత్సరం వరకూ కష్టపడుతాడు. నా సినిమాల్లో కెల్లా అతి పెద్ద బడ్జెట్ సినిమా “దౌడ్" లో పెద్ద నటీనటులు సంజయ్ దత్, ఊర్మిళ, “రంగీల” తరువాత ఎ. ఆర్. రెహమాన్ ఉన్నా సరే ఆ సినిమా ఆడలేదు. దాని తర్వాత వెంటనే చాలా తక్కువ బడ్జెట్లో అసలు ప్రొడక్షన్ విలువలు లేకుండా చెమట ముఖాలతో కనబడే నటీనటులతో తీసిన “సత్య” చాలా పెద్ద హిట్ అయ్యింది. నాగురించి పక్కన పెట్టితే, చాలాసార్లు తక్కువ బడ్జెట్ సినిమాలు “ప్రేమ కథా చిత్రమ్” లాంటివి చేసే కలెక్షన్లు కన్నా పెద్ద పెద్ద స్టార్లు నటించిన సినిమాల కలెక్షన్లు చాలా తక్కువ రావడం మనం ఎన్నోసార్లు చూసాం.
 
దీనిబట్టి నేను మళ్ళీ నిర్థారించేదేంటంటే, ఒక ప్రేక్షకుడికి ఏ సినిమా ఎందుకు ఎంత నచ్చుతుందో వాటి కారణాలని ఊహించలేమని. ఏ సినిమా అయినా ఏ రేంజ్‌లో సక్సెస్ అవుతుందో మనం ఊహించలేమనే ఆలోచనా వ్యవస్థ నుంచి వచ్చిన నా వినూత్న ఆలోచన ఏమిటంటే, ప్రేక్షకులకి ఏదైతే నచ్చుతుందో నాకు తెలుసు అని అనుకునే ఆ ఇద్దరు, ముగ్గురు బయర్స్ సినిమాని విలువ కట్టే కన్నా మా ఈ “టెన్షన్” సినిమా వ్యాపారంలో ఆంధ్రప్రదేశ్,  తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న ప్రతీ ఒక్క వ్యక్తికి ఈ సినిమా విలువ కట్టి దీని బిజినెస్‌లో పాల్గొనటానికి అవకాశమివ్వాలని.
 
ఉదాహరణకి పాలకొల్లులో ఈ సినిమా ఏ రేంజ్‌లో ఆడుతుందో ఎక్కడో భీమవరంలోనో, ఇంకెక్కడో కూర్చుని ఉన్న వెస్ట్ గోదావరి బయర్ నిర్ణయించడం కంటే పాలకొల్లులోనే ఉండే నివాసి డైరెక్ట్‌గా తనే ఆ రేటుని నిర్ణయించవచ్చు. ఎందుకంటే తను అక్కడ లోకల్‌గా ఉండే వ్యక్తి కాబట్టి ఆ ఏరియా గురించి, అక్కడి ప్రేక్షకుల గురించి తనకే బాగా తెలుస్తుంది. అదే నిజం రాజమండ్రి, కరీంనగర్, ఒంగోలు, అనకాపల్లి, ఇంకా మిగతా వందల సెంటర్లకి వర్తిస్తుంది....
 
మా ఈ  సినిమాని గుంటూరులో ఉన్న ఒకరో, ముగ్గురు, నలుగురు స్టూడెంట్సో కలిసి డబ్బులు వేసుకొని కొనవచ్చు... లేదా వైజాగ్‌లో ఉన్న కిట్టి పార్టీలో నిర్ణయం తీసుకుని కొంతమంది స్త్రీలు కలిసి కొనుక్కోవచ్చు... లేదా హైదరాబాద్‌లో ఐటి కంపెనీలో పనిచేసే ఇద్దరు ఫ్రెండ్స్ లేదా విజయవాడలో కొంతమంది ఆటో డ్రైవర్లు కలిసి కొనుక్కోవచ్చు. ఇలా ఎవరైనా సరే ఎక్కడ నుంచైనా సరే ఈ సినిమాని కొనుక్కోవచ్చు. ఇంకా చెప్పాలంటే ఎవరైనా సరే ఈ సినిమా  బిజినెస్ లోకి రావచ్చు.
 
ఆగష్టు 1 న ఉదయం 9 గంటలకి మొదలవ్వబోయే filmauction.in వెబ్సైట్‌లో ఈ సినిమాకి సంబంధించి అన్ని కమర్షియల్ వివరాలు, ట్రైలర్‌తో పాటు ప్రతీ సెంటర్ యొక్క రేటు, అలాగే ప్రొడక్షన్ హౌస్‌కి, కొనాలనుకునే వాళ్లకి మధ్య కమ్యూనికేషన్ విధానం పొందుపరచడం జరుగుతుంది. వేలంపాట పాడే పద్ధతిలోనే ప్రతీసెంటర్‌కి ఒక బేస్ రేట్ ఉంటుంది. ఎక్కువ పాట పాడే వారిని కనుగొనటానికి, online కౌంటర్‌లో ప్రకటించిన తేది నుండి 7 రోజుల గడువు ఇవ్వడం జరుగుతుంది. అనగా ఆగష్టు 1 వ తేది ఉదయం 9 గంటలకి online పాట మొదలుపెడితే ఆగష్టు 7వ తేది సాయంత్రం 6 గంటల వరకు వేలం పాట పాడుకునే అవకాశం ఉంటుంది. ఈ గడువులో ఎవరైతే ఎక్కువకి పాడుకుంటారో వారి పేరు ఆ సెంటర్‌కి buyerగా ప్రకటించబడుతుంది. దీనికి  సంబంధించిన మరిన్ని వివరాలు వెబ్‌సైట్‌లో లభించబడతాయి.
 
వేలం గెలిచిన వారికి ఎప్పటికీ వారి సొంతం చెయ్యబడ్డ సెంటర్‌లో సినిమా రిలీజ్ చేసుకునే హక్కు ఉంటుంది. ఉదాహరణకి, ఒక సెంటర్‌కి మా పాట 50 రుపాయిలు అయినప్పుడు, దానిని అందరికన్నా ఎక్కువగా 70 రుపాయిలకి ఎవరైనా కొన్నారనుకొండి, ఒకవేళ ఆ సినిమా అన్ని ఖర్చులు పోనూ కేవలం 60 లేదా 50 రూపాయిలు మాత్రమే కలెక్ట్ చేస్తే ఆ కొనుగోలుదారుడుకి 10 లేదా 20 రూపాయిలు నష్టం వస్తుంది. కానీ ఒకవేళ 90 లేదా 100  లేదా 120 రూపాయిలు కలెక్ట్ చేస్తే ఆ మిగిలిన 20 లేదా 30 లేదా 50 రూపాయిల లాభం అతనిదే అవుతుంది. సినిమా నిర్మాతలే సినిమా థియేటర్లు బుక్ చేసి, డిజిటల్ ప్రింట్లు వేయించి, అన్ని సెంటర్లలో ప్రచారం చేసి సినిమాను రిలీజ్ చేస్తారు. రిలీజ్ చేసిన థియేటర్ల నుండి వచ్చే డబ్బుని పారదర్శక పద్ధతిలో వాళ్ళ బ్యాంకు అకౌంట్లో డిపాజిట్ చేస్తారు.  
 
ఇక్కడ గమనించవలసిన అతి ముఖ్యమైన అంశం ఏమిటంటే ఇక్కడ బయర్ రిస్క్ కన్నా డైరెక్టర్, ప్రొడ్యూసర్ పెట్టే కాలం, శ్రమ, ఖర్చు ఎన్నో రెట్లు ఎక్కువ రిస్క్. కాబట్టి మంచి నాణ్యతతో కూడిన సినిమాని నిర్మించటానికి మేము మా శాయశక్తులా ప్రయత్నం చేస్తాము. మీకు దీనికి సంబంధించి మరే ఇతర ప్రశ్నలు ఉన్నా filmauction.in ఐ.డి.కి మెయిల్ చేస్తే మేము సమాధానమిస్తాము.
 
మీరు గుర్తించుకోవల్సిన కొన్ని ముఖ్యమైన పాయింట్లేమిటంటే రిలీజ్ డేట్ కానీ, పబ్లిసిటీ చేసే విధానం కానీ, ఏ థియేటర్లు, ఎన్ని థియేటర్లలో రిలీజ్ చెయ్యాలన్న నిర్ణయాలు కానీ కేవలం ప్రొడ్యూసర్ విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది. దానికి కారణమేమిటంటే రెండు రాష్ట్రాలకి సంబంధించి ఒక overall view point లో సినిమాని పరిరక్షించే బాధ్యత తన మీదుంటుంది కాబట్టి--- ధన్యవాదాలతో , మీ రాంగోపాల్ వర్మ