శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: శనివారం, 22 నవంబరు 2014 (20:50 IST)

నాలుగు భాషల్లో చంద్రమహేష్ 'రెడ్ అలర్ట్' షూటింగ్ పూర్తి

సరిగ్గా పదిహేనేళ్ల క్రితం 'ప్రేయసి రావె' చిత్రంతో దర్శకునిగా కెరీర్ ఆరంభించిన చంద్రమహేష్ ఆ తర్వాత అయోధ్య రామయ్య, హనుమంతు, జోరుగా హుషారుగా.... తదితర చిత్రాలకు దర్శకత్వం వహించారు. తాజాగా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో ఏకకాలంలో ఆయన దర్శకత్వం వహించిన చిత్రం 'రెడ్ అలర్ట్'. 
 
ఇటీవలి కాలంలో ఏకకాలంలో నాలుగు భాషల్లో రూపొందిన చిత్రం ఇదే కావడం విశేషం. పి.యస్.త్రిలోక్ రెడ్డి సమర్పణలో సినీ నిలయ క్రియేషన్స్, ఎల్ ఎల్ పి పతాకంపై చంద్రమహేష్ దర్శకత్వంలో పి.వి.శ్రీరాంరెడ్డి నిర్మించిన ఈ చిత్రం షూటింగ్, అనువాద కార్యక్రమాలు పూర్తయ్యాయి. రేపట్నుంచి (23.11.) రీ-రికార్డింగ్ కార్యక్రమాలు ప్రారంభిస్తారు. డిసెంబర్ ద్వితీయార్ధంలో పాటలను, జనవరిలో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు.
 
ఈ సందర్భంగా చంద్రమహేష్ మాట్లాడుతూ - ''గణేష్ నిమజ్జనం చూడటానికి ఓ విలేజ్ నుంచి వచ్చిన నలుగురు కుర్రాళ్లు ఎలాంటి ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేసారు. ఆ ఇబ్బందుల నుంచి వారు ఎలా బయటపడ్డారు అనే అంశంతో ఈ చిత్రం ఉంటుంది. యాక్షన్ తో పాటు థ్రిల్లింగ్ అంశాలు, కామెడీ మిక్స్ అయిన చిత్రం ఇది. ఈ నాలుగు భాషలకు చెందిన నటీనటులు ఇందులో నటించారు. ఈ చిత్రానికి పి.వి.శ్రీరాంరెడ్డి గారు నిర్మాత కావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఆయన ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా కథకు అవసరమైన బడ్జెట్ ని సినిమా కోసం కేటాయించారు'' అని చెప్పారు.
 
నిర్మాత పి.వి.శ్రీరాంరెడ్డి మాట్లాడుతూ - ''ఫైనాన్షియల్ గా బాగా సెటిల్ అయిన తర్వాత చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టాలనుకున్నాను. గత యేడాది చాలా కథలు విన్నాను. చంద్రమహేష్ గారు చెప్పిన కథ నచ్చడంతో ఈ సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాను. చంద్రమహేష్ గారు ఈ చిత్రాన్ని రెండు భాషల్లో చేద్దామన్నారు. కానీ ఈ కథ నాలుగు భాషలకు బాగుంటుందని చెప్పి తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి నిర్మించాం. నాలుగు భాషల్లో విడుదల చేసిన తర్వాత, హిందీలో కూడా చేయాలనుకుంటున్నాం'' అని తెలిపారు.
 
హీరో మహదేవ్ మాట్లాడుతూ - ''ఈ కథ విని చాలా ఎగ్జయిట్ అయ్యాను. చాలా మంచి కాన్సెఫ్ట్. ఈ చిత్రంలో చాలామంది సీనియర్ ఆర్టిస్ట్ లతో కలిసి నటించాను. అందరి సహకారం వల్ల చక్కగా నటించగలిగాను. మంచి సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు కృతజ్ఞతలు'' అని చెప్పారు.
 
సంగీత దర్శకుడు రవివర్మ మాట్లాడుతూ - ''ఈ సినిమా ద్వారా నాలుగు భాషల్లోనూ సంగీత దర్శకుడిగా పరిచయం అవుతున్నాను. మంచి సినిమాకి సంగీతం అందించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను'' అన్నారు.
 
అంజనా మీనన్, సుమన్, కె.భాగ్యరాజా, అలీ, పోసాని కృష్ణమురళీ, వినోద్ కుమార్, రవిప్రకాష్, అనితా చౌదరి, మధుమిత తదితరులు నటించిన ఈ చిత్రానికి కథ, మాటలు - శ్రీరామ్ చౌదరి, సంగీతం - రవివర్మ, కెమెరా - కళ్యాణ్ సమి, ఎడిటింగ్ - గౌతంరాజు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత - జైపాల్ రెడ్డి, కో-ప్రొడ్యూసర్ - శ్రీమతి పిన్నింటి శ్రీరాంసత్యరెడ్డి, నిర్మాత - పి.వి.శ్రీరాంరెడ్డి, స్ర్కీన్ ప్లే, దర్శకత్వం -  చంద్రమహేష్.