శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By PNR
Last Updated : మంగళవారం, 22 జులై 2014 (10:25 IST)

రుద్రమదేవి నగలు మాయంపై ఎన్నో అనుమానాలు.. ప్రశ్నలు!

రుద్రమదేవి సినిమా కోసం తెచ్చిన కేజీన్నర బరువైన బంగారు ఆభరణాలు పోయాయని ఆ సినిమా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రామ్‌గోపాల్ చేసిన ఫిర్యాదుపై పోలీసులు విచారణను వేగిరం చేశారు. ఇంతవరకు నగల చోరికి సంబంధించిన ఒక్క ఆధారం కూడా దొరకకపోయినప్పటికీ ఎన్నో అనుమానాలు అయితే పోలీసులకు కలుగుతున్నాయి. 
 
అసలు సినిమా షూటింగ్ కోసం బంగారు ఆభరణాలు వాడాలని ఎందుకు అనుకున్నారు?  బంగారు ఆభరణాలు, గిల్టు ఆభరణాలు కలిపి ఒకే చోటు.. ఒకే బ్యాగులో ఎందుకు వుంచారు? నిజంగానే పోయిన ఆభరణాలలో బంగారు ఆభరణాలు వున్నాయని ఆధారాలేమిటి? పోయిన ఆభరణాలలో బంగారు ఆభరణాలెన్ని? గిల్టు ఆభరణాలెన్ని? విలువైన ఆభరణాలు ఉన్నాయని తెలిసినా వాటిని అంత అజాగ్రత్తగా ఎందుకు ఉంచారు? ఈ నగలను భద్రపరిచిన మేకప్ ఏసీ వ్యాను డ్రైవర్ ఆ సమయంలో ఎక్కడకు వెళ్లారు వంటి ఎన్నో ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. 
 
అయితే, రుద్రమదేవి సినిమా షూటింగ్‌లో నగలు మాయంపై మిస్టరీ వీడలేదు. కేజీన్నర బంగారు ఆభరణాలు పోయాయని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రామ్‌గోపాల్ పోలీసులకు ఫిర్యాదు చేసి రెండు రోజులవుతున్నా ఇప్పటి వరకు చిన్నపాటి ఆధారాన్ని కూడా పోలీసులు సంపాదించలేక పోయారు. పోయిన నగల్లో అసలు బంగారం ఎంత? రోల్డ్‌గోల్డ్ ఎంత అన్న విషయం సరఫరా చేసిన వారికే తెలియదని చెప్పడంతో ఈ నగల మాయంపై సరికొత్త అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. అంత విలువైన నగలకు సెక్యూరిటీ లేకుండా ఎలా ఉంచారు? వ్యానులో ఉన్న నగలు ఎలా మాయమయ్యాయనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోయిన నగల్లో అత్యంత విలువైన రాళ్లు పొదిగినవి ఉన్నట్టు సమాచారం. 
 
కాగా, అనుష్క ప్రధాన పాత్రధారిగా ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వంలో రుద్రమదేవి సినిమా నిర్మితమవుతున్న విషయం తెల్సిందే. చిత్రంలో పాత్రకు తగ్గట్టుగా అనుష్క ధరించే నగలను చెన్నైలోని ఆంజనేయ శెట్టి అండ్ సన్స్ నగల దుకాణం సరఫరా చేసింది. షూటింగ్ జరిగే రోజు సంస్థ సిబ్బంది చెన్నై నుంచి నగలను తీసుకొస్తున్నారు. షూటింగ్ ముగిసిన వెంటనే వాటిని తిరిగి తీసుకువెళ్లిపోతున్నారు. ఇలా ఆరు షెడ్యూల్స్‌లో జరిగింది. 
 
అయితే, ఈ నెల 19వ తేదీన గోపన్‌పల్లెలోని రామానాయుడుకు చెందిన స్థలంలో చిత్రం ఏడో షెడ్యూల్  ప్రారంభం కావాల్సి ఉంది. అదేరోజు ఉదయం 8 గంటలకు చెన్నై నుంచి విమానంలో రెండు ప్లాస్టింగ్ బాక్స్‌లున్న బ్యాగ్‌లో నగలను ఆ కంపెనీకి చెందిన ఉద్యోగి ఎస్. రవిసుబ్రమణ్యం షూటింగ్ స్పాట్‌కు తీసుకొచ్చాడు. ఈ బ్యాగ్‌ను ఏసీ మేకప్‌వ్యాన్ డ్రైవర్ సీటు వెనకాల పెట్టి సమీపంలో విశ్రాంతి తీసుకున్నాడు.
 
భోజన విరామం తర్వాత అనుష్కకు నగలు ధరింపజేసేందుకు బ్యాగ్ తెరిచారు. అందులో ఉన్న నగలు ఉన్న రెండు ప్లాస్టిక్ బాక్స్‌లు కనిపించలేదు. దీంతో సినిమా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రామ్‌గోపాల్ గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుమారు కిలోన్నర బంగారు ఆభరణాలు మాయమయ్యాయని, వాటిలో వడ్డాణం, చెవి కమ్మలు (రెండు జతలు), గాజులు ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు.
 
అయితే, మాయమైన నగల్లో అసలు బంగారం ఎంత ఉందనే విషయం ఇప్పటి వరకు తెలియలేదు. ఇదేవిషయంపై నగలు పంపిన సంస్థకు చెందిన మార్కెటింగ్ అధికారి సుజిత్‌ను పోలీసులు ప్రశ్నించగా, ఆయన బిక్కమొహం వేశారు. దీంతో ముంబై నుంచి జ్యువెలరీ ఎగ్జిబిషన్‌లో ఉన్న బద్రీని పోలీసులు పిలిపిస్తున్నారు. అంతేకాకుండా, నగలు ఎవరు దొంగలించారనేది ప్రశ్నార్థకంగా మారింది. నగల బ్యాగ్‌ను వ్యాన్‌లో పెట్టిన రవి కాపలా ఉండకుండా ఎక్కడికి వెళ్లాడనేది అనుమానాలకు తావిస్తోంది. దీంతో రవిపై కూడా పోలీసులు దృష్టిసారించారు.