శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: శుక్రవారం, 24 అక్టోబరు 2014 (19:23 IST)

దిల్ రాజు ఎందుకు రాలేదు... రాళ్ళు రువ్విన ఆందోళనకారులు

శుక్రవారంనాడు రామకృష్ణ గౌడ్‌కు మద్దతు తెలపడానికి వచ్చిన కొందరు ఫిలింఛాంబర్‌పై రాళ్లు విసరడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆ సమయంలో పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు. దాడి చేసిన వ్యక్తుల్ని అరెస్ట్‌ చేయాలని కొందరు డిమాండ్‌ చేస్తున్నారు.
 
కాగా, వారం రోజులుగా నిరాహాదీక్ష చేస్తున్న తెలంగాణ ఫిల్మ్‌ అండ్‌ టీవీ ప్రొడ్యూసర్స్‌ గిల్డ్‌ అధ్యక్షుడు పి. రామకృష్ణగౌడ్‌ శుక్రవారం విరమించుకున్నారు. తెలంగాణ రాష్ట్ర రవాణా మంత్రి మహేందర్‌రెడ్డి, భువనగిరి, మెదక్‌ ఎంపిలు నర్సయ్యగౌడ్‌, కొత్త ప్రభాకర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ అధికార ప్రతినిధి మధుసూదనాచారి ఆయనకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు.
 
ఈ సందర్భంగా మంత్రి మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ... చిన్న నిర్మాతలను ఇబ్బందిపెట్టడం ఆంధ్ర సినిమా పెద్దలకు మంచిదికాదు. ఈ దీక్షా శిబిరానికి తెలంగాణకు చెందిన నిర్మాత దిల్‌రాజు రాకపోవడం బాధాకరం. సినిమా ఇండస్ట్రీ అభివృద్ధి కోసం కెసిఆర్‌ రెండు వేల ఎకరాలు ప్రకటించారు. మిగతా అన్ని రంగాలవలే సినిమా రంగం కూడా తెలంగాణ, ఆంధ్ర పరిశ్రమలుగా విడిపోవాల్సిన అవసరం వుంది. ఈ విషయంలో తెలంగాణకు చెందిన నిర్మాతలు, సాంకేతిక నిపుణులు, కళాకారులు ఏకం కావాలి. థియేటర్ల లీజు వల్ల నిర్మాతలు అనుభవిస్తున్న కష్టాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తున్నాం' అన్నారు.
 
రామకృష్ణ గౌడ్‌ మాట్లాడుతూ... పదిహేనేళ్ళ క్రితం లీజు విధానాన్ని తీసుకొచ్చి పరిశ్రమను నాశనం చేశారు. తమను లీజుదారులు బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారని థియేటర్ల యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్కువ ధరకు లీజు తీసుకుని నిర్మాతల వద్ద ఎక్కువ అద్దెలు వసూలు చేస్తున్నారు. సర్వీస్‌ టాక్స్‌ ఎగ్గొడుతూ ప్రభుత్వాన్ని దగా చేస్తున్నారని' ఆరోపించారు.