మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By IVR
Last Modified: సోమవారం, 21 జులై 2014 (19:24 IST)

సినీ పరిశ్రమ హైదరాబాద్‌ను కబ్జా చేసింది... తెలంగాణ మంత్రి మహేందర్‌ రెడ్డి

''సినీ పరిశ్రమ హైదరాబాద్‌లో స్థిరపడానికి చెన్నారెడ్డి సహకారంఅందించారు. లబ్దిపొందిన తెలుగు సినీ పరిశ్రమకు చెందినవారు తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. రంగారెడ్డివాసిగా అక్కడి భూములు ఎన్నో సినీ వాళ్ళు కబ్జా చేశారు'' తెలంగాణ రవాణాశాఖ మంత్రి మహేంద్రరెడ్డి అన్నారు. 
 
సోమవారంనాడు ఫిలింఛాంబర్‌లో తెలంగాణ ప్రెస్‌అకాడమీ ఛైర్మన్‌గా ఎంపికైన అల్లం నారాయణకు తెలంగాణ ఫిలిం ప్రొడ్యూసర్స్‌ గిల్డ్‌ సన్మానం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా అల్లం నారాయణను పలువురు ప్రముఖులు సత్కరించి... అల్లం నారాయణ చేసిన సేవలను ప్రశంసించారు. 
 
ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ.... అల్లం నారాయణకు జర్నలిస్టుల కష్టసుఖాలు తెలుసు. సరైన వ్యక్తి ఛైర్మన్‌గా ఎంపిక కావడం హర్షణీయం. అదేవిధంగా తెలుగులో సినిమాలు తీస్తూ ఇక్కడి ఫలాలు అనుభవిస్తూ ఇక్కడివారిని విమర్శించడం తగదని సూచించారు. రంగారెడ్డి జిల్లాలోనే సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు వైఎస్‌ఆర్‌ అండగా నిలిచి భూములు తీసుకున్నారు. అదేవిధంగా సినిమా సమస్యలు కూడా చాలా ఉన్నాయనీ, వాటన్నంటిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువస్తామని పేర్కొన్నారు.
 
అల్లం నారాయణ స్పందిస్తూ.... జర్నలిజంలో ఉన్నప్పుడే పాశం యాదగిరితో కలిసి ప్రతి పల్లెకూ వెళ్ళి స్పూర్తి రగిల్చాం. ముఖ్యంగా సినిమాల్లో తెలంగాణ భాష పట్ల చూపిస్తున్న వివక్ష కూడా ఉద్యమానికి కారణమైంది. దుష్ట, వెకిలి పాత్రలతో తెలంగాణ సంస్కృతిని అపహాస్యం చేశారు. వేణుమాధవ్‌ వంటి నటుడ్ని హీరోలు కొట్టడం వంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి. అదేవిధంగా రాయలసీమ, ఉత్తరాంధ్ర భాషలను కూడా వెకిలిగా వాడారు. అందుకే తెలంగాణ ఆత్మను ఆవిష్కరించే సినిమాలు రావాలి' అని పేర్కొన్నారు.
 
దర్శకుడు ఎన్‌. శంకర్‌ మాట్లాడుతూ... కెసిఆర్‌ హయాంలో తెలంగాణ సినీ పరిశ్రమకు స్వర్ణయుగం రాబోతుందనీ, ఇక్కడ పరిశ్రమలో గ్రూపులున్నాయని వార్తలు వస్తున్నాయనీ, అవేవీ లేవనీ, అంతా కలసికట్టుగా ఉన్నారని పేర్కొన్నారు. 
 
వారిని తరిమి కొట్టాలి : యాదగిరి
టిఎన్‌ఎన్‌ ఛానల్‌ అధినేత పాశం యాదగిరి మాట్లాడుతూ... తెలంగాణలో చెరువులు భూములు కబ్జా చేసిన సినిమావాళ్ళను తరిమి కొట్టాలని పిలుపు ఇచ్చారు. కెసిఆర్‌ వారిపై ఓ కన్నేసినట్లు చెప్పారు.