మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By PNR
Last Updated : ఆదివారం, 26 ఏప్రియల్ 2015 (10:23 IST)

నీతూ అగర్వాల్ అరెస్టు... రాత్రికి రాత్రి కర్నూలుకు తరలింపు!

ఎర్ర చందనం కేసులో సినీ నటి నీతూ అగర్వాల్‌ను కర్నూలు జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. ఆమెను శనివారం రాత్రి హైదరాబాదు పోలీసులు అదుపులోకి తీసుకుని రాత్రికి రాత్రే కర్నూలు జిల్లా రుద్రవరం పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఆదివార ఉదయం ఆమెను మీడియా ముందు ప్రవేశ పెట్టనున్నారు. 
 
కర్నూలు జిల్లా చాగలమర్రి ఎంపీపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత మస్తాన్ వలీతో ఆమె సహజీవనం చేస్తున్న విషయం తెలిసిందే. అతనిని నీతు మూడో పెళ్లి చేసుకున్నట్లుగా కూడా ఊహాగానాలు వినిపించాయి. ఎర్ర చందనం అక్రమ రవాణాలో మస్తాన్ వలీకి ఈమె సహకరించారని ఆరోపణలు ఉన్నాయి. 13వ తేదీ నుండి నీతు కోసం పోలీసులు గాలిస్తున్నారు. 
 
మూడు రాష్ట్రాల్లో పోలీసులు ఆమె కోసం వేట సాగించగా, హైదరాబాదులోనే ఆమె ఆచూకీ తెలుసుకుని అరెస్టు చేశారు. ఆ తర్వాత రాత్రికిరాత్రే ఆమెను కర్నూలుకు తరలించారు. ఎర్రచందనం స్మగ్లర్, వైసీపీ నేత మస్తాన్ వలిని పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె బ్యాంకు ఖాతా నుంచి స్మగ్లర్లకు పెద్ద ఎత్తున డబ్బు సరఫరా అయినట్టు పోలీసుల విచారణలో తేలింది. ఈ విషయాన్ని నిర్ధారించుకున్న కర్నూలు జిల్లా పోలీసులు రుద్రవరం పోలీస్ స్టేషన్‌లో నీతూపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన విషయం తెల్సిందే. 
 
అయితే, కేసు నమోదు చేసిన విషయాన్ని తెలుసుకున్న ఆమె అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆమె ఆచూకీ కోసం పోలీసులు మహారాష్ట్ర (ముంబై), కర్ణాటక (బెంగుళూరు), తెలంగాణ (హైదరాబాద్) రాష్ట్రాల్లో ముమ్మరంగా గాలించారు. చివకు హైదరాబాద్‌లో ఉన్నట్టు గుర్తించి అరెస్టు చేశారు.