గురువారం, 28 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: బుధవారం, 17 డిశెంబరు 2014 (21:52 IST)

ప్రారంభమైన 'వధుకట్నం'...

కిరణ్‌, పద్మజ ప్రధాన పాత్రల్లో గ్రీన్‌ కాస్‌ థియోసోఫికల్‌, రూరల్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ సోసైటి సమర్పణలో షబాబు ఫిలింస్‌ పతాకంపై గొట్టిముక్కల భార్గవ దర్శకత్వంలో షేక్‌ బాబు సాహెబ్‌ నిర్మిస్తున్న విభిన్న చిత్రం 'వధుకట్నం'. ఈ చిత్రం ప్రారంభోత్సవం ఇటీవలే అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి అజ్మల్‌ క్లాప్‌నివ్వగా, బ్రహ్మయ్యనాయుడు కెమెరా స్విచ్చాన్‌ చేశారు. ప్రముఖ దర్శకురాలు జయ బి. గౌరవ దర్శకత్వం చేశారు.
 
చిత్ర దర్శకుడు మాట్లాడుతూ... గతంలో 'మానవసేవ' అనే షార్ట్‌ ఫిలిమ్‌ తీశాను. దాన్ని చూసి మా నిర్మాత అవకాశం ఇచ్చారు. లేడీ డిస్క్రిమినేషన్‌ కాన్సెప్ట్‌తో సినిమా రూపొందుతోంది. ప్రస్తుతం సమాజంలో వందకు తొంభై మంది మహిళలు మాత్రమే ఉన్నారు. అలాంటిది వందకు పది మంది మహిళలు మాత్రమే ఉంటే ఏం జరుగుతుందనే విషయాన్ని ఎంటర్‌టైన్‌మెంట్‌గా అందరూ ఆలోచించే విధంగా ఈ చిత్రంలో చూపిస్తున్నాం. 
 
స్త్రీని గౌరవించకపోవడంవల్ల భవిష్యత్‌ తరం ఎలాంటి ఇబ్బందులకు గురి కాబోతోందనే కాన్సెప్ట్‌తో రూపొందే సినిమా ఇది. ఇంత మంచి అవకాశం నాకు ఇచ్చిన నిర్మాతకు నా ధన్యవాదాలు. ఈ చిత్రానికి సంబంధించిన మరో విశేషం ఏమిటంటే 'వధుకట్నం' టైటిల్‌ సాంగ్‌ను మా నిర్మాత షేక్‌ బాబు సాహెబ్‌గారే రాశారు. జనవరిలో రికార్డింగ్‌ స్టార్ట్‌ అవుతుంది. ఆ పాటను ఆయనే పాడతారు. 
 
షేక్‌ బాబు సాహెబ్‌ మాట్లాడుతూ... ఆడవారి సంఖ్య రోజురోజుకీ తగ్గిపోతోంది. అందుకే ఆడవారి పట్ల వివక్ష అనేది వుండకూడదు. అలా చేస్తే భవిష్యత్తులో మగవాళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యే అవకాశాలు తగ్గిపోతాయి. మా డైరెక్టర్‌ చేసిన షార్ట్‌ ఫిలిం చూసిన తర్వాతే ఈ సినిమా చేసే అవకాశం ఇచ్చాను. ఈ సినిమాలో ఎంటర్‌టైన్‌మెంట్‌తోపాటు మంచి మెసేజ్‌ కూడా వుంటుంది. ఫిబ్రవరిలో ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభమవుతుంది. జనవరిలో ఈ చిత్రం పాటల రికార్డింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అన్నారు.
 
కెమెరామెన్‌ యస్‌.డి.జాన్‌ తెలుపుతూ... స్త్రీలపై జరిగే అఘాయిత్యాలు, అమానుషాల వల్ల సమాజం చాలా సమస్యలను ఎదుర్కొవాల్సి వస్తుంది. అలాంటి సమస్యలపై దర్శకుడు భార్గవగారు చాలా మంచి సినిమా తీస్తున్నారు. హీరో కిరణ్‌ ఎం.జె., హీరోయిన్‌ పద్మజ ఈ సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు ధన్యవాదాలు తెలిపారు. కార్తీక్‌, కరీం, వరప్రసాద్‌, నాగలక్ష్మి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ: షేక్‌ బాబు సాహెబ్‌, సంగీతం: నాని, ఆర్ట్‌: నాయుడు, నిర్మాత: షేక్‌ బాబు సాహెబ్‌, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: గొట్టిముక్కల భార్గవ.