శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By DV
Last Updated : శుక్రవారం, 12 ఫిబ్రవరి 2016 (20:47 IST)

'గరం' అనుకున్నంతగా లేదు: శివాజీనే ఆది అనుసరించాడా..?

నటీనటులు : ఆది, ఆదాశర్మ, కబీర్‌, దుహన్‌ సింగ్‌, తనికెళ్ళ భరణి, సీనియర్‌ నరేష్‌, చైతన్యకృష్ణ తదితరులు.
సంగీతం : అగస్త్య, నిర్మాత : పి. సురేఖ, దర్శకత్వం : మదన్‌
 
'ఆ నలుగురు', 'పెళ్ళయిన కొత్తలో', 'ప్రవరాఖ్యుడు' వంటి భిన్నమైన కోణాలతో సినిమాలను తీసిన దర్శకుడు మదన్‌.. తొలిసారిగా కమర్షియల్‌ ఫార్మెట్‌లో తీసిన సినిమా 'గరం'. పేరులోనే గరంగరంగా ఉంటుంది కథానాయకుడు పాత్ర. 'ప్రేమ కావాలి', 'లవ్లీ' వంటి పాత్రల్లో ఇమిడిపోయిన ఆది.. మాస్‌ ఇమేజ్‌ కోసం 'రఫ్‌' చేసి భంగపడ్డాడు. కానీ గ్యాప్‌ తీసుకుని మళ్ళీ అదే పనిచేశాడు. దానికి కాస్త వినోదం జోడించాలని ట్రై చేశాడు. అది ఎలా ఉందో చూద్దాం.
 
కథ :
బలరాం (తనికెళ్ళ భరణి) కొడుకు వరాలబాబు (ఆది). హైస్కూల్‌ నుంచి విద్యలో పూర్‌. పక్కింటి మూర్తి (నరేష్‌) కొడుకు రవి (చైతన్య కృష్ణ) చదువులో చురుకు. ప్రతిసారీ వాడిని చూసి నేర్చుకో.. అంటూ ఇంట్లోనూ బయట వరాలబాబుకు పోరు. దీంతో రవి అంటే శత్రువులా చూస్తాడు. పెద్దయ్యాక రవికి హైదరాబాద్‌లో ఉద్యోగం వచ్చిందని వెళ్ళిపోతాడు. వీడి పీడ విరగడైందని వరాలబాబు ఊరిలోనే ఫ్రెండ్స్‌తో గడిపేస్తుంటాడు. కానీ తప్పని పరిస్థితుల్లో తను కూడా హైదరాబాద్‌కు ఉద్యోగం కోసం వెళతాడు. అక్కడ సమీర (ఆదాశర్మ)ని తొలిచూపులోనే ప్రేమించేస్తాడు. అదే టైంలో సమీర కోసం ఓ గ్యాంగ్‌ సిటీలో తిరుగుతుంది. వరాలబాబు రవి కోసం వెతుకుతుంటాడు. ఇలా ఎందుకు వెతుకుతున్నారు? ఆ తర్వాత ఏమైంది? అనేది సినిమా. 
 
పెర్‌ఫార్మెన్స్‌:
ఆది లవర్‌బాయ్‌ నుంచి ఒక్కసారిగా మాస్‌ తరహా పాత్ర పోషించాడు. దానికితోడు ఎమోషన్స్‌ పండించే ప్రయత్నం చేశాడు. డైలాగ్స్‌ బాగానే చెప్పాడు. ఇక డాన్సులు, స్టంట్స్‌ చాలా బాగా చేశాడు. ఆదాశర్మ అందాలను ప్రదర్శిస్తూ.. కొద్దిగా నటన కూడా ప్రదర్శించింది. కబీర్‌ దుహన్‌ సింగ్‌ నెగటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రలో మెప్పించాడు. నాజర్‌, తనికెళ్ళ భరణి, సీనియర్‌ నరేష్‌ పాత్రలు బాగానే వున్నాయి. షకలక శంకర్‌ ఆదికి స్నేహితుడుగా ఫుల్‌లెంగ్త్‌ క్యారెక్టర్‌ చేసి కడుపుబ్బ నవ్విస్తాడు. మధు కూడా అంతే. 
 
సాంకేతిక విభాగం :
సురేందర్‌ రెడ్డి సినిమాటోగ్రఫీ బాగుంది. కనులవిందుగా చూపించే ప్రయత్నం చేశాడు. పాటల్లో అది స్పష్టంగా కన్పిస్తుంది. అగస్త్య నేపథ్య సంగీతం బాగుంది. పాటలు బాగానే ఉన్నా ఎలా పడితే అలా వచ్చి ఇబ్బంది పెడతాయి. కార్తీక్‌ శ్రీనివాస్‌ ఎడిటింగ్‌ అంత బాగోలేదు. మెయిన్‌గా సెకండాఫ్‌ అయితే మరీ సాగదీసినట్టు ఉంటుంది. ఆర్ట్‌ వర్క్‌ బాగుంది. కథ, మాటలు 'సీతమ్మ అందాలు రామయ్య చిత్రాలు' డైరెక్టర్‌ శ్రీనివాస్‌ గవిరెడ్డి అందించాడు. కథ చాలా పాతదే, ఆ కథలో చేసిన మార్పులు కూడా కొత్తగా లేవు. డైలాగ్స్‌ మాత్రం బాగున్నాయి. కొన్ని పంచ్‌ డైలాగ్స్‌ బాగున్నాయి. మదన్‌ తను బ్రాండ్‌ నుంచి కొత్త ప్రయోగం చేశాడు. మొదటిభాగం బోర్‌గా అనిపిస్తుంది. సురేఖ.పి సాయికుమార్‌ నిర్మాణ విలువలు బాగున్నాయి.
 
విశ్లేషణ:
'గరం' పేరులోనే కమర్షియల్‌ సినిమా అని తెలిసిపోతుంది. అయితే హీరో పాత్ర మాస్‌ అవ్వడం వలన కథంతా తనే మోయాల్సివచ్చింది. అది సెకండాఫ్‌లో భారంగా అనిపిస్తుంది. ఇమేజ్‌తో సంబంధం లేకుండా మదన్‌.. ఆదిని ఎంచుకోవడం కష్టమైనపనే. మొదటిభాగం ఎంటర్‌టైన్‌మెంట్‌ కోసం సాగదీశాడు. సెండాఫ్‌లోనే కథంతా. ఈ భాగమే సినిమాకు కీలకం. ఇంటర్వెల్‌ ట్విస్ట్‌, క్లైమాక్స్‌ సీన్స్‌ సినిమాకి కీలకం. ఆ రెండు సీన్స్‌ బాగా ఎలివేట్‌ అయ్యాయి. అసలు ఈ కథను రాసుకోవడమే సెకండాఫ్‌లోనే పాయింట్‌. దేశంలో అర్హతకు సరైన ఉపాధి లేకుండా యువత బాధపడుతుంటే ఎన్‌ఆర్‌ఐగా వచ్చిన నాజర్‌ అందరి బాగు కోసం చేసిన ప్రయత్నం బెడిసికొడుతుంది. సరిగ్గా ఈ పాయింట్‌ రజనీ 'శివాజీ' లోనిదే. 
 
కానీ దాన్ని డీల్‌ చేసే విధానం వేరుగా ఇంట్రెస్ట్‌గా ఉంటుంది. ఇందులో నాజర్‌ చేయాల్సిన మంచి పనులకు తోటివారే మోసం చేసి చంపేస్తాడు. ఆమె కూతురే సమీరా.. ఆమెను కాపాడే ప్రయత్నం ఆది ఎలా చేశాడనేది కథ. దీన్ని చెప్పడానికి రకరకాలుగా కథలు అల్లి.. మొదటిభాగాన్ని నడిపాడు దర్శకుడు. కానీ చెప్పేవిధానం సరిగ్గాలేక.. బోర్‌ అనిపిస్తుంది. ఒక 30 నిమిషాల తర్వాత సినిమా బాగా రొటీన్‌ అయిపోతుంది. ఏదో జరిగిన సీన్లే మళ్ళీ మళ్ళీ చూస్తున్నాం అనే ఫీలింగ్‌‌లో ఉంటాం. ఎంటర్‌టైన్‌మెంట్‌ కోసం 'పికె' తరహాలో అమీర్‌ పాత్రను బ్రహ్మానందంతో కామెడీ చేయించాలని ట్రై చేసిన ఎపిసోడ్‌ ముగింపు పరమ చెత్తగా ఉంది. అప్పటివరకు సరదాగా తీసిన సీన్లు.. ముగింపుతో తేలిపోయాయి. తనో పిచ్చాసుపత్రి నుంచి వచ్చిన వ్యక్తిగా ట్రీట్‌చేయడం ప్రధాన లోపం. అలాగే జయప్రకాశ్‌ రెడ్డి, పృథ్వీ‌రాజ్‌‌లతో చేయించిన కామెడీ కూడా సరిగ్గా పేలలేదు.
 
సెకండాఫ్‌‌లోనే అసలు కథలోకి వెళ్తాడు, కానీ సెకండాఫ్‌ మొదలయ్యాక మెయిన్‌ ప్లాట్‌‌ని కాస్త పక్క ట్రాక్‌ పట్టిస్తూ సైడ్‌‌ట్రాక్స్‌ మీదకి వెళ్ళారు. ఫైనల్‌‌గా సెకండాఫ్‌ చివరికి వచ్చాక అసలు కథలోకి తీసుకెళ్ళి చకచకా ఫినిష్‌ చేస్తాడు. మదన్‌ ఇప్పటి వరకూ క్లాస్‌ సినిమాలే చేయడంతో మాస్‌ చిత్రాల్ని డీల్‌ చేయడం కష్టమైపోయింది. మొదటి నుంచి కథ విషయంలో పాలుపంచుకున్న తన స్నేహితుడు నాగరాజు హఠాన్మరణం.. మదన్‌ను కలచివేసింది. అందుకే సినిమా కూడా యేడాదిపైగా పట్టింది. ప్రధాన విలన్‌ ఏం చేస్తాడో కథలో చెప్పాడు. కాసేపు మటన్‌ అమ్ముతాడు. ఇంకో షాట్‌లో హోటల్‌ బాస్‌గానూ కన్పిస్తాడు. ఇలా కన్‌ఫ్యూజ్‌గా సాగిన సినిమాకు ముగింపు ఇంకాస్త బాగా తీస్తే అందరికీ నచ్చేది. ఇది ఏవరేజ్‌ చిత్రం మాత్రమే.
 
రేటింగ్‌: 2.5/5