శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : బుధవారం, 15 మార్చి 2017 (16:15 IST)

జయసుధ - నితిన్ కపూర్‌ల మధ్య ప్రేమ ఎలా చిగురించింది?

తెలుగు చిత్ర పరిశ్రమలో సహజనటిగా గుర్తింపు పొందిన హీరోయిన్ జయసుధ. ఈమె గురించి తెలియని ప్రేక్షకులు ఉండరు. సావిత్రిని తలపించే పాత్రలకు జయసుధ పెట్టింది పేరు. అలాగే, జయసుధ భర్త నితిన్‌ కపూర్. బాలీవుడ్ నటుడ

తెలుగు చిత్ర పరిశ్రమలో సహజనటిగా గుర్తింపు పొందిన హీరోయిన్ జయసుధ. ఈమె గురించి తెలియని ప్రేక్షకులు ఉండరు. సావిత్రిని తలపించే పాత్రలకు జయసుధ పెట్టింది పేరు. అలాగే, జయసుధ భర్త నితిన్‌ కపూర్. బాలీవుడ్ నటుడు జితేంద్ర కజిన్. ఈయన సినీ నిర్మాత. అసిస్టెంట్ దర్శకుడిగా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి.. నిర్మాతగా ఎదిగారు. జయసుధ - నితిన్‌లు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే, వీరిద్దరి మధ్య ప్రేమ ఎలా చిగురించిందో ఓసారి పరిశీలిస్తే... 
 
జయసుధ తల్లి ఓ చిన్న నటి. తండ్రికి మాత్రం సినిమాలతో ఏమాత్రం సంబంధం లేదు. జయసుధకు నటి విజయనిర్మల మేనత్త వరుస. జయసుధ తండ్రిని ఒప్పించి సినిమాల్లోకి ఆమెను తీసుకువచ్చారు. అప్పటి జయసుధ పేరు సుజాత. తొలిసారిగా 'పండంటికాపురం' చిత్రంలో జమున కుమార్తెగా సుజాత నటించింది. ఆ తర్వాత కె.బాలచందర్ ఆమె ప్రతిభను గుర్తించి తమిళంలో అవకాశమిచ్చారు. అప్పటికే సుజాత పేరుతో ఒక నటి ఉండటంతో ఆమె పేరును జయసుధగా బాలచందర్ మార్చారు. 
 
ఇక.. వ్యక్తిగతంగా జయసుధ వివాహం ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు బంధువైన రాజేంద్రప్రసాద్‌తో జరిగింది. అయితే ఆ వివాహం విచ్ఛిన్నమైంది. విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత క్రమంలో పంజాబీ ఫిల్మ్ ప్రొడ్యూసర్ అయిన నితిన్ కపూర్‌తో జయసుధ ప్రేమలో పడ్డారు. జయసుధకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. నితిన్ కపూర్‌కూ అంతే. క్రికెట్ పట్ల ఉన్న అభిమానమే ఈ ఇద్దరినీ దగ్గరకు చేర్చింది. 1985లో నితిన్ కపూర్‌, జయసుధల పెళ్ళి జరిగింది. 
 
ఆ తర్వాత జయసుధ క్రైస్తవ మతాన్ని స్వీకరించారు. కానీ, పేరు మాత్రం మార్చుకోలేదు. జయసుధకు దేవుడంటే చాలా నమ్మకం. ముఖ్యంగా ఏసుక్రీస్తు మహిమల పట్ల ఎంతో ఆరాధన. 1985లో బ్యాంకాక్‌లో ఆమె ఊహించని విధంగా నీటిప్రవాహంలో కొట్టుకుపోయారు. అయితే జీసస్ అనుగ్రహం వల్లే తాను బతికి బయటపడ్డానని ఇప్పటికీ చెపుతుంటారు. అలాగే, నితిన్ కపూర్‌కు కూడా దేవుడంటే అమితమైన విశ్వాసం. భక్తి. బహుశా ఇద్దరి అభిప్రాయాలు ఒకేలా ఉండటం కూడా వారి వివాహానికి దారితీసిందని అనుకోవచ్చు.
 
ఈ క్రమంలో దర్శకరత్న దాసరి నారాయణరావు తెలుగు, తమిళ చిత్రాలను హిందీలోకి రీమేక్ చేస్తుండేవారు. ఆ చిత్రాల్లో ఎక్కువగా జితేంద్ర హీరోగా నటించేవారు. నితిన్ కపూర్ జితేంద్ర కజిన్. సినిమాల విషయంలో దాసరి నారాయణరావుకు సహకరించాలని నితిన్‌కు జితేంద్ర చెప్పేవారు. దీంతో నితిన్ మద్రాస్ వచ్చి అద్దె ఇంట్లో ఉంటూ వచ్చారు. ఈయన ఇంటిపక్కనే జయసుధ ఇల్లు కూడా. ఆ క్రమంలో ఈ జయసుధ, నితిన్ మధ్య ప్రేమ చిగురించింది. వీరిద్దరి మనసులు, అభిరుచులు కలవడంతో రెండేళ్ల ప్రేమ... పెళ్లిపీటల వరకు వచ్చింది. ఇలా వారిద్దరు ఒక్కటయ్యారు. 
 
ఆ తర్వాత నితిన్ కపూర్ నిర్మతగా మారారు. పలు బాలీవుడ్‌తో పాటు.. తెలుగు చిత్రాలను కూడా తీశారు. తన కుమారుడు శ్రేయాన్‌తో 'బస్తీ' చిత్రం చివరగా తీశారు. అయితే, ఈ చిత్రం భారీ నష్టాలను మిగిల్చింది. దీంతో నితిన్ కపూర్ ఆర్థిక కష్టాల్లో చిక్కుకున్నారు. ఈ క్రమంలో ఆయన తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనైనట్టు సమాచారం. ఈ ఒత్తిడిని నుంచి జయించేందుకు ఓ మానసిక వైద్య నిపుణుడి వద్ద కూడా చికిత్స చేసుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలో ఆయన మంగళవారం ముంబైలో ఆరు అంతస్తుల భవనం నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు.