గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : గురువారం, 27 ఆగస్టు 2015 (14:09 IST)

సైజ్ జీరో: అనుష్కను పెంచేనా.. దించేనా? ఫ్యాన్స్‌లో భయం భయం!?

జీరో సైజు సినిమా అనుష్కకు మంచి పేరు తెచ్చి పెడుతుందా..? లేకుంటే బోల్తా కొట్టిస్తుందా? అనే దానిపై ప్రస్తుతం టాలీవుడ్‌లో జోరుగా చర్చ సాగుతోంది. బాహుబలి, రుద్రమదేవి సినిమాలతో మంచి ఊపుమీదున్న అనుష్కకు జీరో సైజ్ మంచి పేరు సాధించిపెడుతుందా? లేకుంటే లడ్డూబాబూలా జరిగిపోతుందోనన్న భయంతో అనుష్క ఫ్యాన్స్ ఉన్నారు. 
 
జీరో సైజ్ ప్రమోషన్‌లో భాగంగా ‘‘అందం అనేది సైజులో ఉండదు. మనల్ని మనం అంగీకరించడంలోనే అందమంతా దాగుంది’’ అనే  క్యాప్షన్ చూపిస్తూ పోజిచ్చింది అనుష్క. ఐతే ఈ క్యాప్షన్ చూస్తుంటే సైజ్ జీరో సినిమాకు సంబంధించి చాలా సందేహాలు మొదలవుతున్నాయి. బాహ్య సౌందర్యం కన్నా ఆత్మ సౌందర్యం మిన్న అనే కాన్సెప్టులు టాలీవుడ్‌కి కొత్తేమీ కాదు. 
 
రెండేళ్ల కిందటే అల్లరి నరేష్ ‘లడ్డూ బాబు’తో ఇలాంటి పాఠమే చెప్పాలని చూసి బోల్తా కొట్టాడు. ‘సైజ్ జీరో’ వినోదాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా అని చెబుతున్నారు కానీ.. ‘లడ్డూబాబు’ కూడా అలాంటి ప్రయత్నమే అన్న సంగతిని మరిచిపోకూడదని సినీ పండితులు అంటున్నారు. దీనికంటే ముందు వినాయకుడు కితకితలు సినిమాలు కూడా ఇలాంటి కాన్సెప్ట్‌తోనే తెరకెక్కాయి. అవి రెండూ ప్రేక్షకులకు మంచి వినోదాన్నందించాయి.
 
అయితే అనుష్కను భారీ అవతారంలో ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారోననే అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. వరుసగా లావు పోస్టర్లు విడుదల చేస్తుంటే జనాల నుంచి ఇలాంటి ఫీడ్ బ్యాకే వచ్చినట్లుంది.. తాజాగా అనుష్క మామూలుగా కనిపిస్తున్న పోస్టర్లు సైతం రిలీజ్ చేయడంతో ఆమె ఫ్యాన్స్ ఊపిరిపీల్చుకుంటున్నారు. 
 
ఇక ‘సైజ్ జీరో’ కథ విషయానికొస్తే.. అది రాసింది ప్రకాష్ కోవెలమూడి కాదు. ఆయన భార్య బాలీవుడ్ సినిమాలకు స్క్రిప్ట్ కన్సల్టంట్‌గా పని చేసిన పూనమ్ థిల్లాన్. బహుశా ఆ అమ్మాయికి తెలుగు సినిమాల గురించి అవగాహన లేదేమో. ప్రకాష్ కూడా తెలుగు సినిమాల్ని పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించడు. అందుకే గుడ్డిగా తమ కథతో ముందుకెళ్లిపోతున్నారేమో. మరి ఎలాంటి ఫలితం ఎలా ఉంటుందో తెలియాలంటే సినిమా రిలీజ్ వరకు వేచి చూడాల్సిందే.