శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By chitra
Last Updated : శుక్రవారం, 27 మే 2016 (12:33 IST)

రానా మణికట్టుకు గాయం... బ్యాండేజ్ కట్టుతో ట్వీట్

తెలుగు పరిశ్రమలో రికార్డులను బద్దలు కొట్టి కాసుల వర్షం కురిపించిన "బాహుబలి''కి సీక్వెల్‌గా వస్తున్న చిత్రం ‘బాహుబలి 2’. ప్రభాస్, అనుష్క, తమన్నా, రానా, రమ్యకృష్ణ, నాజర్ తదితరులు ఈ సినిమాలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతోంది. హిందీలో "ఘాజీ'' సినిమా షూటింగ్‌లో బిజీబిజీగా గడిపిన రాణా ప్రస్తుతం ''బాహుబలి 2''లో పాల్గొంటున్నాడు. ''బాహుబలి''లో విలన్‌గా గుర్తింపు పొందిన రానా, ''బాహుబలి -2''లో కూడా మరింత రెచ్చిపోనున్నట్లు టాలీవుడ్ వర్గాల విశ్వసనీయ సమాచారం. 
 
కాగా ఈ కండలవీరుడి శరీరాకృతికి చాలా మంది దాసోహమైన విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం మళ్లీ కసరత్తులు మొదలు పెట్టాడు. షూటింగ్‌లో పాల్గొన్న భల్లాల దేవుడికి గాయాలయ్యాయి. అతని మణికట్టుకు దెబ్బ తగిలింది. ఈ విషయాన్ని రానా స్వయంగా తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు. ''గాయపడ్డ నా మణికట్టుకు బ్యాండేజ్ వేశాం. త్వరలోనే కోలుకుని పూర్తి స్థాయిలో శిక్షణ తీసుకుంటాను'' అని ఆ ట్వీట్‌లో పేర్కొన్నాడు. 
 
ఇందుకుసంబంధించిన ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో రానా పోస్ట్ చేశాడు. తెలుగు పరిశ్రమలో ''బాహుబలి'' చిత్రం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ''బాహుబలి-2''పై కూడా ప్రపంచ స్థాయిలో భారీ అంచనాలు నెలకొన్నాయి. 2017 వేసవి నాటికి ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.