శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: గురువారం, 30 జులై 2015 (16:36 IST)

పాకిస్థానీయుల గుండెల్ని పిండేస్తున్న సల్మాన్ 'భాయిజాన్...' ఏడుస్తున్నారు...

భజరంగీ భాయ్‌జాన్ చిత్రం రికార్డులను సృష్టించేందుకు ఉరకలెత్తుతోంది. నిజంగా కథకుడు పాత్రలకు ప్రాణం పోస్తే ఎలా ఉంటుందో అలా ఉంది భజరంగీ భాయ్‌జాన్. ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ నటన మామూలుగా లేదు. ఇప్పటివరకూ అతడు చేసిన సినిమాలు ఒక ఎత్తు. ఇది అతడికి ఒక శిఖరం లాంటిదని చెప్పొచ్చు. ఇకపోతే సల్మాన్ చిత్రాన్ని చూసేందుకు పాకిస్తాన్ ప్రజలు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. దీనికి కారణాలు చాలానే ఉన్నాయి. ఈ చిత్రం ఎత్తైన మంచు శిఖరాల మధ్య మొదలవుతుంది. 
 
పాకిస్తాన్‌లోని సుల్తాన్‌పూర్ గ్రామంలోని ఆజాద్ కాశ్మీర్ ప్రాంతం అది. అక్కడ ఓ ముస్లిం కుటుంబం ఉత్కంఠభరితంగా సాగే భారత్ -పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్‌ను తిలకిస్తుంటుంది. ఆ మ్యాచిని పాకిస్తాన్ క్రికెట్ టీమ్ గెలుచుకుంటుంది. అది ఆ కుటుంబానికి ఎంతో సంతోషాన్నిస్తుంది. ఆ కుటుంబంలో మాటలు రాని షాహిదా అనే ఓ చిన్నారికి మరీ సంతోషాన్నిస్తుంది. కొన్నాళ్లకు షాహిదాకు మాటలు రావాలని ఆమెను వెంటబెట్టుకుని ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ అలూలియా దర్గాకి బయల్దేరుతుంది ఆమె తల్లి. '
 
అలా అక్కడికి చేరుకున్న క్రమంలో అనుకోని పరిస్థితుల్లో షాహిదా తప్పిపోయిన షాహిదా చివరికి కురుక్షేత్ర చేరుతుంది. అక్కడ భజరంగీ(సల్మాన్‌ఖాన్) అలియాస్ శ్రీ హనుమాన్ పవన్‌ కుమార్ చతుర్వేది తమ భజన బృందంతో ఆడుతూ పాడుతూ ఉంటాడు. ఆ చిన్నారి అతడి దగ్గరికి చేరడంతో ఆమెకు ‘మున్నీ’ అని ముద్దుగా పేరు పెట్టుకుంటాడు. ఆమెను ఎలాగైనా ఆమె తల్లిదండ్రుల వద్దకు చేర్చాలని పవన్ ప్రయత్నం చేస్తాడు. 
 
హిందూత్వం అంటే ప్రాణం పెట్టే ఓ వ్యక్తి దాయాదులైన ముస్లింల పాపను ఎన్నో కష్టనష్టాలకోర్చి గమ్యాన్ని చేర్చటమనే ఇతివృత్తంతో తెరకెక్కిన ఈ చిత్రంలో హృదయాలను హత్తుకునే సన్నివేశాలు చాలానే ఉన్నాయి. ఈ చిత్రానికి పాకిస్తానీయులు బ్రహ్మరథం పడుతున్నారు. చిత్రం చూశాక కళ్ల వెంట నీళ్లు పెట్టుకుంటున్నారు. మాటలు రాని ఓ చిన్నారిని తల్లి ఒడిలోకి ఎలా చేర్చాడన్న ఇంటరెస్టింగ్ కథకి స్క్రీన్‌ప్లే ప్రాణం పోయడంతో ఈ చిత్రాన్ని ప్రతి ఒక్కరూ చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.