శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Raju
Last Updated :హైదరాబాద్ , సోమవారం, 17 జులై 2017 (06:49 IST)

ఆకట్టుకున్న జూ. ఎన్టీఆర్.. వైవిధ్యత కరువైన బిగ్ బాస్.. ఇకపై రాణించేనా?

కొద్దినెలలుగా ఊరిస్తున్న బిగ్ బాస్ తెలుగు వెర్షన్ ఆదివారం ఆట్టహాసంగా ప్రారంభమైంది. అంతర్జాతీయంగా ప్రసిద్ది పొందిన బిగ్ బాస్ తెలుగులో రావడం ఇదే మొదటిసారి కావడంతో సర్వత్రా ఆసక్తి ఏర్పడింది. బిగ్ బాస్ టె

కొద్దినెలలుగా ఊరిస్తున్న బిగ్ బాస్ తెలుగు వెర్షన్ ఆదివారం ఆట్టహాసంగా ప్రారంభమైంది. అంతర్జాతీయంగా ప్రసిద్ది పొందిన బిగ్ బాస్ తెలుగులో రావడం ఇదే మొదటిసారి కావడంతో సర్వత్రా ఆసక్తి ఏర్పడింది. బిగ్ బాస్ టెలివిజన్ హోస్ట్‌గా జూనియర్ ఎన్టీఆర్ ఎనర్జిటిక్‌గా కనిపించారు. ప్రారంభం కార్యక్రమంలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా తనే మెరిపించాడు. వచ్చీరావడంతోటే అదిరే డాన్స్‌ ఫెర్ఫామెన్స్ ఇచ్చేశాడు. అంతేకాదు బిగ్ బాస్ షో ఎలా ఉండబోతుందో పార్టిసిపెంట్స్ ఉండబోయే ఇంటిలో తిరుగుతూ ప్రేక్షకులకు షో వివరాలను తెలియజేశారు.అయితే ఇకనుంచి మొదలయ్యే ప్రతి ఎపిసోడ్‌లో కనిపించేది ఎన్టీఆర్ కాదు. ఈ కార్యక్రమంలో కనిపించే పోటీదారులే ఈ షో గెలుపోటములకు మూలకారకులు కానున్నారు. 
 
కానీ ఆదివారం ప్రారంభించిన తొలి కార్యక్రమంలో కనిపించిన 14మంది పోటీదారులను చూస్తే ఈ కార్యక్రమం అంత ఆసక్తికరంగా సాగుతుందా అనే సందేహాలు వస్తున్నాయి. బిగ్ బాస్ ప్రోగ్రాంకున్న ప్రతిష్టను చూస్తే తొలి సీజన్‌లో పాపులర్ సెలబ్రిటీలు ఉంటారని జనం ఆశించారు. తానీ తొలిసీజన్‌కు ప్రకటించిన పోటీదారులను చూసి అందరూ పెదివి విరస్తున్నారు. 
 
ఈ పోటీలో పాల్గొంటున్న వారిలో తొలుత ఎలిమినేట్ అయ్యేవారెవరో ముందుగానే ఊహించడానికి అవకాశం ఇచ్చేలా ఏమంత ప్రాధాన్యత, పలుకుబడి లేని వారిని పోటీదారులుగా ఎంపిక చేశారు. ప్రముఖ సెలబ్రిటీలు లేదా వివాదాస్పద వ్యక్తులు పోటీదారులుగా వచ్చి ఉంటే అది ప్రారంభం నుంచే మంచి ఆసక్తిని రేకెత్తించి ఉండేది. కాని పోటీలో ఎంపికైన వారిలో ఏ ఒక్కరూ అంత సెలబ్రిటీలు కాకపోవడంతో నేటినుంచి వీరెలా వ్యవహరిస్తారన్నదే ప్రశ్నార్థకంలా ఉంది.
 
పైగా పోటీలో పాల్గొంటున్నవారు మొత్తంగా చిత్రపరిశ్రమకు, వినోదరంగానికి చెందిన వారే. వివిధ రంగాలకు చెందిన వైవిధ్యత వీరిలో కనిపించడం లేదు. కానీ తమిళ బిగ్ బాస్ కార్యక్రమంతో పోలిస్తే తెలుగు బిగ్ బాస్‌కి మంచి స్పందన వచ్చినట్లే. టీఆర్పీ రేటింగ్ కూడా ప్రోత్సాహకంగానే ఉంది. కానీ అసలు కార్యక్రమం మొదలైన తర్వాత ప్రేక్షకులు పోటీదారులను ఎలా రిసీవ్ చేసుకుంటారనేదే అసలు సమస్య.
 
హిందీలో ప్రాచుర్యం పొందిన ‘బిగ్‌బాస్‌’ షోను తెలుగులో రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. దీనికి ఎన్టీఆర్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ఆదివారం  ఈ షో పరిచయ కార్యక్రమం పూర్తయింది. అయితే ‘బిగ్‌బాస్‌’ షూట్‌ కోసం ఎన్టీఆర్‌ చాలా అంకితభావంతో నిర్విరామంగా పనిచేస్తున్నారట. తిండి, విశ్రాంతి పక్కనపెట్టి.. దాదాపు ఎనిమిది గంటలపాటు షూటింగ్‌లో పాల్గొన్నారని చిత్ర వర్గాల సమాచారం. షూట్‌ పూర్తయ్యే వరకూ ఆయన అదే ఎనర్జీతో ఉండటం విశేషమని చెబుతున్నారు.

బిగ్ బాస్ షోలో పాల్గొనే పోటీదారుల  జాబితా
1.అర్చన 2.సమీర్, 3.ముమైత్ ఖాన్ 4.ప్రిన్స్ 5.సింగర్ మధుప్రియ 6.బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు 7.జ్యోతి 8.సింగర్ కల్పన 9.మహేష్ కత్తి 10. కత్తి కార్తీక 11. శివ బాలాజీ 12.ఆదర్శ్ 13.హరి తేజ 14. ధనరాజ్ 

బిగ్ బాస్ షోలో షరతులు..
బిగ్ బాస్ హౌస్‌లో 70 రోజులు ఉండాలి.
బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నన్నాళ్లు తప్పని సరిగా మైక్ పెట్టుకోవాల్సిందే.
ప్రతి సెలబ్రిటీ తప్పని సరిగా తెలుగులో మాట్లాడాలి.
ప్రతి రోజు లైట్స్ ఆఫ్ చేయకుండా పడుకోరాదు.
ఈ నిబంధనలను అతిక్రమిస్తే ‘బిగ్ బాస్’ శిక్ష తప్పదు