శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శనివారం, 10 అక్టోబరు 2015 (15:36 IST)

కోడూరి శ్రీశైల శ్రీ రాజమౌళి... బాహుబలిగా ఎలా అవతరించాడు.. బర్త్ డే స్పెషల్!

బాహుబలి మేకర్ రాజమౌళికి నేడు (అక్టోబర్ 10) పుట్టిన రోజు. టాలీవుడ్ దర్శకుడైన రాజమౌళి.. తెలుగు సినీ కథారచియిత కె.వి. విజయేంద్ర ప్రసాద్ కుమారుడు. ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణికి సోదరుడు. రాజమౌళి పూర్తిపేరు కోడూరి శ్రీశైల శ్రీ రాజమౌళి. రాఘవేంద్ర రావు శిష్యుడైన రాజమౌళి జూనియర్ ఎన్టీఆర్ స్టూడెంట్ నెం.1 చిత్రం ద్వారా సినీరంగ ప్రవేశం చేశాడు. 
 
సినిమా రంగానికి ముందు టీవీ ధారావాహికలకు పనిచేశాడు. ఎన్.టి.ఆర్‌తో సినిమా తీయడంతో రాజమౌళి దశ తిరిగింది. జూనియర్‌తో జక్కన్న తీసిన మూడు సినిమాలు అఖండ విజయాన్ని సాధించాయి. స్టూడెంట్ నెం.1, సింహాద్రీ, యమదొంగ రాజమౌళికి మంచి పేరు సంపాదించి పెట్టాయి. ఇలా నితిన్‌తో సై, రవితేజతో విక్రమార్కుడు, ప్రభాస్‌తో ఛత్రపతి తీసిన రాజమౌళి హిట్‌లపై హిట్‌లు లభించాయి. 
 
ఈ క్రమంలో మెగాస్టార్ కుమారుడు చెర్రీతో చేసిన మగధీర సినిమా భారీ కలెక్షన్స్ సాధించింది. ఆపై మర్యాద రామన్న, రాజన్న సినిమాలు మోస్తరుగా పర్వాలేదనిపించినా ఈగతో రాజమౌళికి ప్రపంచ వ్యాప్తంగా పేరొచ్చేసింది. ఈగతో పాటు ఈ ఏడాది విడుదలైన బాహుబలితో తెలుగు సినీ పరిశ్రమకు ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపును సంపాదించిపెట్టాడు.
 
ఇంతకీ రాజమౌళికి జక్కన్న అనే పేరు ఎలా వచ్చింది?
టాలీవుడ్ సినిమా ఖ్యాతిని బాహుబలి, ఈగ సినిమాలతో ప్రపంచ వ్యాప్తంగా మార్మోగిస్తున్న దర్శకధీరుడు రాజమౌళికి జక్కన్న అనే పేరు ఎలా వచ్చిందంటే.. ప్రముఖ యాంకర్ సుమ కనకాల భర్త రాజీవ్ కనకాల ఆ పేరు పెట్టారని స్వయంగా రాజమౌళి ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. రాజమౌళి డైరక్ట్ చేసిన శాంతినివాసం సీరియల్‌లో రాజీవ్ హీరోగా నటించారు. రాజమౌళి సీరియల్/ సినిమా ఏది తీసినా ఓ శిల్పంలా చెక్కుతాడని అందుకే రాజీవ్ ముద్దుగా ఆ పేరు పెట్టాడని తెలిసింది. 
 
ఇక ఆపై జక్కన్న పేరును జూనియర్ ఎన్టీఆర్ బాగా ప్రాచుర్యంలోకి తెచ్చినట్లు కూడా రాజమౌళి చెప్పారు. ఇక రాజమౌళి ఖాతాలో జాతీయ పురస్కారాలు, నంది పురస్కారాలు, దక్షిణ భారత ఫిలింఫేర్ అవార్డు, సినీ మా అవార్డులు, స్టార్ వరల్డ్ ఇండియా అవార్డులు ఉన్నాయి. 
 
ఇకపోతే.. జక్కన్న ప్రస్తుతం బాహుబలి 2 మేకింగ్‌లో బిజీ బిజీగా ఉన్నాడు. ఈ సినిమాకు తర్వాత మహాభారతాన్ని తెరకెక్కించే దిశగా రాజమౌళి సర్వం సిద్ధం చేసుకుంటున్నట్లు ఆయనే పలు సందర్భాల్లో వెల్లడించారు. ఎనీ వే రాజమౌళి పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన పట్టిందల్లా బంగారం కావాలని మనమూ ఆశిస్తూ పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పేద్దాం.. హ్యాపీ బర్త్ డే రాజమౌళి గారూ..!