శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Raju
Last Updated :హైదరాబాద్ , శనివారం, 20 మే 2017 (09:48 IST)

విజయానికి సంబంధించిన ఎల్లల్ని ఛేదించి పారేసిన బాహుబలి-2.. మరో 30 ఏళ్లు చెదరని రికార్డు సొంతం

ప్రపంచవ్యాప్తంగా బాహుబలి సాగిస్తున్న సంచలనాత్మక విజయం కానీ, చైనాలో దంగల్ సృష్టిస్తున్న నమ్మశక్యం కాని విజయం కానీ భారతీయ సినిమాలకు ఒక్కసారిగా విదేశీ గడ్డపై కూడా ఊహించని వాణిజ్య అవకాశాలను సృష్టించి చూపు

ప్రపంచవ్యాప్తంగా బాహుబలి సాగిస్తున్న సంచలనాత్మక విజయం కానీ, చైనాలో దంగల్ సృష్టిస్తున్న నమ్మశక్యం కాని విజయం కానీ భారతీయ సినిమాలకు ఒక్కసారిగా విదేశీ గడ్డపై కూడా ఊహించని వాణిజ్య అవకాశాలను సృష్టించి చూపుతున్నాయి. ప్రత్యేకించి ఎస్ఎస్ రాజమౌళి తాజాగా తీసి విడుదల చేసిన బాహుబలి సినిమా సాగిస్తున్న మహాద్భుత విజయం మొత్తం భారతీయ చిత్రపరిశ్రమపైనే విశిష్ట ప్రభావం చూపనుంది. మూడు వారాల క్రితం విడుదలైన బాహుబలి 2 ప్రతి రోజూ ఏదో ఒక రికార్డును బద్దలు కొడుతూ సంచలనాలను సృష్టిస్తూనే ఉంది.


పదిరోజుల్లోపే కనీవినీ ఎరుగని విధంగా వెయ్యి కోట్లు సాధించిన బాహుబలి 20రోజుల్లోపు రూ. 1500 కోట్ల మార్క్‌ను ఛేదించి హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు, అవతార్ ఆవిష్కర్త జేమ్స్ కేమరాన్‌నే బిత్తరపోయేలా చేసింది. అవతార్‌ కోసం నేను రూ. 2,500 కోట్లు ఖర్చుపెట్టి పదివేల కోట్లు ఆర్జస్తే కేవలం 250 కోట్లు ఖర్చుపెట్టి తీసిన బాహుబలి-2 మూడు వారాలకే 1500 కోట్ల రూపాయలు సంపాదించిందా అంటూ కేమెరాన్ ఆశ్చర్య పోయినట్లు సమాచారం.
 
ఒక్క విషయాన్ని మాత్రం దేశీయ, విదేశీ చిత్ర విమర్శకులు, విశ్లేషకులు ముక్త కంఠంతో చెబుతున్నారు. గత అయిదారు దశాబ్దాల సినీ రంగ చరిత్రలో జనాలను ఇంతగా థియేటర్లవైపు తరిమిన, తరుముతోన్న సినిమా బాహుబలి-2 మాత్రమేనని సినిమా చరిత్రలో ఏ సినిమాకూ దక్కని అపూర్వ గౌరవం బాహుబలి-2కి దక్కిందిని ట్రేడ్ ఎనలిస్టులు చెబుతున్నారు. 2015లో బాహుబలి ది బిగినింగ్ సినిమా సాధించిన సంచలనం రెండో భాగంలోనూ కొనసాగుతుందని ఊహించాం కాని ఇంత అద్వితీయ విజయాన్ని రెండో భాగం సాధించగలదని కల్లో కూడా తాము ఊహించలేదని ట్రేడ్ ఎనలిస్టులు చెబుతున్నారు.
 
అందుకే మొదటి రోజే బాహుబలి-2 సినిమా చూసి విషం గక్కిన బాలీవుడ్ స్వయం ప్రకటిత చిత్ర విమర్శకుడు కమాల్ పది రోజుల్లోపే సినిమా వెయ్యి కోట్లను సాధించడం చూసి నివ్వెరపోయాడు. చిత్రదర్శకుడు రాజమౌళికి మన:పూర్వకంగా క్షమాపణలు చెప్పాడు. బాహుబలి2 సినిమా తనకు నచ్చలేదు కానీ జనం మెచ్చుతున్నారు. అందుకే బాహుబలి-2 ఇప్పుడు ఉద్యమంలాగా మారింది. ఇది సాధిస్తున్న రికార్డులు మరో ముప్పై ఏళ్లవరకు  ఎవరూ ఛేదించలేరు అని కమాల్ ప్రకటించాడు. 
 
కమాల్ ప్రకటన అలా ఉంచండి. బాహుబలి-2 సృష్టించిన రెండు గొప్ప ట్రెండ్‌ల గురించి మాట్లాడుకోవాలి. ముంబైలో నిర్మించిన హిందీ చిత్రాలు మాత్రమే జాతీయ సినిమా అని, దేశంలోని వివిధ ప్రాంతాల్లో తీస్తున్న సినిమాలు ప్రాంతీయ సినిమాలు అని భారతీయ సినిమాపై మన దేశంలోనూ, ప్రపంచంలో కూడా బలంగా పాతుకుపోయిన భావనను బాహుబలి-2 తోసిపారేసింది. భారతీయ సినిమారంగం చుట్టూ ఏర్పడిపోయిన ఈ చట్రాన్ని బాహుబలి సినిమా సవాలు చేసింది.
 
మరొక విషయం ఏమిటంటే.. తెలుగు, తమిళ భాషల్లో నిర్మించబడి,  మలయాళం, హిందీలో డబ్ చేయబడి, తర్వాత జర్మన్, ఫ్రెంచ్, జపనీస్, ఇంగ్లీష్ భాషల్లోకి కూడా డబ్ చేయబడిన బాహుబలి రెండు భాగాలు వాటి సాంప్రదాయిక మార్కెట్లకు అవతల ఎక్కడికో వెళ్లిపోయి ప్రపంచంలోనే సంచలన వార్తగా మారిపోయాయి. ప్రత్యేకించి బాహుబలి 1 మొదటి భాగం తెలుగుకు మాత్రమే పరిమితమైన అపరిచిత నటీనటులను ఒక్కసారిగా జాతీయ వేదికపై నిలిపేలా చేసింది. ఇది అతి గొప్ప స్టెప్ మరి. ఒక ప్రాంతీయ చిత్ర పరిశ్రమకు చెందిన నటీనటులు ఇవ్వాళ దేశవ్యాప్తంగా ప్రతి ఇంటిలోనూ పరిచయం చేసిపడేసింది. దేశంలో ఇంతవరకూ వచ్చిన ఏ సినిమా కూడా ఇంత ప్రభావాన్ని కలిగించలేదు. 
 
ఇక బాహుబలి రెండోభాగం సినిమా విజయానికి సంబంధించి ఒక ట్రెండ్‌నే సృష్టించింది. హిందీలో రూపొందించని, బాలీవుడ్ స్టార్లు నటించిన ఒక సినిమా జాతీయ వ్యాప్త ప్రేక్షకులను సంపాదించుకుంటుందని ఊహల్లో కూడా లేని ఆలోచనను ఒక్కరోజులో వాస్తవం చేసిపడేసింది. విదేశీ మార్కెట్లలోఇంతవరకు ప్రవేశించని కొత్త ఏరియాలను బాహుబలి-2 ఇండియా మొత్తానికి చూపింది. 
 
సరిగ్గా దీనికి కొనసాగింపుగానే అమీర్ ఖాన్ నటించిన దంగల్ సినిమా చైనాను సునామీలా తాకింది. భారతదేశంలో అది సాధించిన లైఫ్ టైమ్ వసూళ్లను చైనా భాషలోని దంగల్ కేవలం పది రోజుల్లో అధిగమించి ఇప్పటికి 500 కోట్ల రూపాయలను వసూలు చేసి అందరినీ నోరు తెరిచేలా చేసింది. చైనా సమాజపు అసమానతలను, గ్రామీణ ప్రాంతాల దుర్బర పరిస్థితిని తమ కళ్లకు కట్టినట్లు భారతీయ సినిమా చూపించడంతో చైనా ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఆ సినిమా చూసి భారతీయుల్లాగా చైనా ప్రేక్షకులు కూడా థియేటర్లల విలపిస్తున్నారనంటేనే భారత చిత్ర పరిశ్రమ క్వాలిటీని దంగల్ చైనా సాక్షిగా నిరూపించింది. 
 
ఇంత అద్భుత విజయాలను బారతీయ సినిమాలు సాధించవచ్చని అటు ప్రపంచ వ్యాప్తంగా బాహుబలి-2, ఇటు చైనాలో దంగల్ నిరూపించాయి కానీ ఇప్పుడు చిక్కలా ఏమిటంటే ఇవి అనుకోని విజయాలుగా ఉండిపోతాయా లేక చెరగని ట్రెండ్ సెట్టర్ లాగా ఉండిపోతాయా అనేదే. బాలీవుడ్‌తో సహా భారతీయ చిత్ర పరిశ్రమ మొత్తంగా ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది.