బుధవారం, 17 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By DV
Last Updated : మంగళవారం, 24 మే 2016 (10:13 IST)

నాలుగు భాషల్లో 'క్యాంపస్-అంపశయ్య'

‘అమ్మా నీకు వంద‌నం', 'ప్రణయ వీధుల్లో' చిత్రాల ద్వారా తనలో డిఫరెంట్ ఫిలిం మేకర్ ఉన్నాడని నిరూపించుకున్నారు ప్రభాకర్ జైని. విభిన్న చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ప్రభాకర్ జైని తాజాగా 'క్యాంపస్ అంపశయ్య' పేరుతో ఓ చిత్రం చేసిన విషయం తెలిసిందే. ఇందులో ప్రభాకర్ జైని కూడా ప్రధాన పాత్ర చేశారు. శ్యామ్ కుమార్‌, పావ‌ని హీరో హీరోయిన్ గా నటించారు. 
 
జైనీ క్రియేష‌న్స్‌, ఓం న‌మో భ‌గ‌వ‌తే వాసుదేవాయ ఫిలింస్ పతాకంపై విజయలక్ష్మి జైని ఈ చిత్రాన్ని నిర్మించారు. 1969లో న‌వీన్ రాసిన 'అంపశయ్య' నవల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఆ తర్వాత నవీన్ ఇంటి పేరు 'అంపశయ్య' అయిపోయింది. 
 
ఈ చిత్రవిశేషాలను ప్రభాకర్ జైని తెలియజేస్తూ - ''ఈ కథలో చక్కటి ఆత్మ ఉంది. విలువలున్నాయి. మానసిక సంఘర్షణలున్నాయి. తెలుగులో మాత్రమే కాదు.. తమిళ, మలయాళ, హిందీ భాషల్లో కూడా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నాం. అన్ని భాషలవాళ్లకీ సూట్ అయ్యే కథ ఇది. అందుకే ఇతర భాషల్లో రిలీజ్ చేయబోతున్నాం. 'అంపశయ్య' నవల అందరికీ నచ్చింది. 
 
ఈ నవలను అందరికీ నచ్చే విధంగా తెరరూపం ఇవ్వడం జరిగింది. ఓ గ్రామం నుంచి ఉస్మానియా యూనివర్శిటీకి చదువుకోవడానికి వచ్చిన ఓ యువకుడి జీవితంలో ఉదయం నుంచి రాత్రి వరకూ జరిగే సంఘటనలతో ఈ సినిమా ఉంటుంది. కథానుగుణంగా ఉస్మానియా క్యాంపస్ లో కీలక సన్నివేశాలు తీశాం. ఈ క్యాంపస్ లో షూటింగ్ జరుపుకున్న తొలి చిత్రం ఇదే. 1970ల నాటి వాతావరణాన్ని కళ్లకు కట్టినట్లుగా చిత్రీకరించాం. అన్ని వర్గాల వారికీ నచ్చే చిత్రం అవుతుంది. జూన్ లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం'' అని చెప్పారు.