శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : సోమవారం, 2 ఏప్రియల్ 2018 (10:53 IST)

సింహాద్రి అప్పన్న ఆలయంలో దొంగగా మారిన నితిన్... ఉంగరం చోరీ చేశాడట....

ప్రముఖ సినీ నటుడు నితిన్‌పై విశాఖపట్టణంలోని సింహాద్రి అప్పన్న ఆలయ అర్చకులు తీవ్రమైన అభియోగం మోపారు. దైవ దర్శనానికి వచ్చిన హీరో నితిన్ స్వామివారి ఉంగరాన్ని చోరీ చేశారంటూ వారు ఆరోపించారు.

ప్రముఖ సినీ నటుడు నితిన్‌పై విశాఖపట్టణంలోని సింహాద్రి అప్పన్న ఆలయ అర్చకులు తీవ్రమైన అభియోగం మోపారు. దైవ దర్శనానికి వచ్చిన హీరో నితిన్ స్వామివారి ఉంగరాన్ని చోరీ చేశారంటూ వారు ఆరోపించారు. అంతేనా, హీరో అని కూడా చూడకుండా నితిన్‌ను తాళ్ళతో బంధించారు. దీంతో అక్కడున్న భక్తులంతా బిత్తరపోయారు. 
 
హీరో నితిన్ తాజా చిత్రం 'ఛల్ మోహన రంగ' సినిమా విడుదలకానుంది. ఈ నేపథ్యంలో సింహాద్రీశుని ఆశీర్వాదం తీసుకునేందుకు హీరో నితిన్ సింహాచలం వచ్చాడు. ఆలయంలో నితిన్‌ను తాళ్లతో బంధించిన ఆలయ అలంకారి కరి సీతారామాచర్యాలు నేరుగా స్థానాచార్యుడు టి.పి.రాజగోపాల్ వద్దకు తీసుకెళ్లారు. 
 
ఆయన నితిన్‌తో 'ఏమండీ.. చాలా సినిమాల్లో హీరోగా నటించి పేరు తెచ్చుకున్నారు.. పైగా బాగా స్థితిమంతులు. అలాటి మీరు స్వామి వారి ఉంగరాన్ని చోరీ చేశారంటే నమ్మశక్యం కాకుండా ఉంది. మర్యాదగా ఇచ్చేయండి.' అంటూ దొంగతనం మోపారు.
 
దీంతో బిత్తరపోయిన నితిన్... 'నేను తియ్యలేదండి కావాలంటే చెక్‌ చేసుకోండి' అంటూ సమాధానమిచ్చాడు. దీంతో మళ్లీ ఆయన 'శనివారం రాత్రి స్వామివారి ఉంగరం పోయింది. చోరులెవరో కనిపెట్టే పనిలో ఉన్నాం. మాకు ఉంగరం దొరికే వరకు మీరు బందీలుగా ఉండాల్సిందే' అంటూ స్థానాచార్యుడు హుకుం జారీ చేశారు. 
 
దీంతో నితిన్ అలాగే ఉండిపోయారు. ఆ తరువాత మరికొంత మందిని కరి సీతారామాచార్యులు బంధించి తేవడం, రాజగోపాల్ ప్రశ్నించడం జరిగింది. ఈ తతంగాన్ని అక్కడే ఉన్నవారంతా నవ్వుతూ వీక్షించారు. అయితే దొంగతనం మోపబడిన పలువురు భక్తులు మాత్రం కన్నీటి పర్యంతమయ్యారు. 
 
దీంతో ఆలయాధికారులు వారిని ఓదార్చుతూ, సింహగిరి వరాహ లక్ష్మీనృసింహస్వామివారి వార్షిక కల్యాణోత్సవాల్లో భాగంగా చివరి రోజు వినోదోత్సవంలో భాగంగా నిర్వర్తించిన కార్యక్రమమని, అయ్యవారి ఉంగరం దొరికిందని చెప్పారు. దీంతో అంతవరకు దొంగతనం మోపబడి, ఏడ్చిన భక్తులంతా నవ్వుకున్నారు. 
 
కాగా, అప్పన్న కళ్యాణోత్సవంలో ఆరో రోజు వేడుకల్లో భాగంగా, ఆదివారం రాత్రి దొంగలదోపు ఉత్సవం నిర్వహిస్తారు. ఇందులో ఉభయ దేవేరులతో విహారయాత్రకు వెళ్లిన స్వామివారి ఉంగరం కనిపించకపోవడంతో... ఉంగరం ఉంటేనే రావాలని అమ్మవారు షరతు విధించి, అలుగుతుంది. దీంతో స్వామి మర్నాడు ఉదయం ఉంగరాన్ని వెతుక్కునే పనిలో పడతారు. తన తరపు దూతగా వైదికుల్లో ఒకరిని నియోగించి, భక్తులను తాళ్లతో బంధించి తీసుకొచ్చి ప్రశ్నింపజేస్తారు. ఇందులో భాగంగానే నితిన్ పలువురు భక్తులు దొంగలుగా మారారు.