శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By dv
Last Updated : ఆదివారం, 29 జనవరి 2017 (09:17 IST)

నేను మళ్లీ నటించడానికి జయసుధ స్పూర్తి... మెగాస్టార్ చిరంజీవి వ్యాఖ్య

నిర్మాతకు నిలువెత్తు నిదర్శనం.. దిల్‌రాజు, శర్వానంద్ నా బిడ్డలాంటివాడు... మెగాస్టార్‌ చిరంజీవి

శర్వానంద్‌, అనుపమ పరమేశ్వరన్‌ హీరో హీరోయిన్లుగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై సతీష్‌ వేగేశ్న దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మించిన చిత్రం 'శతమానం భవతి'. సంక్రాంతి సందర్భంగా జనవరి 14న విడుదలైన ఈ చిత్రం సక్సెస్‌మీట్‌ శుక్రవారం హైదరాబాద్‌లో జరిగింది. 
 
ఈ కార్యక్రమంలో నిర్మాత దిల్‌రాజు తనతో తొలి చిత్రం దిల్‌ను డైరెక్ట్‌ చేసిన వినాయక్‌కు ముఖ్య అతిథిగా పాల్గొన్న మెగాస్టార్‌ చిరంజీవి చేతుల మీదుగా సన్మానం చేయించారు. అలాగే దిల్‌రాజు తల్లిదండ్రులను వేదికపై సన్మానించారు. ఈ కార్యక్రమంలో అహోబిల రామాను జీయ్యర్‌ స్వామి, దేవనాథ రామానుజ స్వామి, చిత్ర నిర్మాతలు దిల్‌రాజు, శిరీష్‌, ప్రకాష్‌రాజ్‌, జయసుధ, డా.రవీందర్‌రెడ్డి, తనికెళ్ళభరణి, సిజ్జు, మిక్కి జె.మేయర్‌, ఇంద్రజ, సమీర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా అహోబిల జీయ్యర్‌ స్వామి మాట్లాడుతూ - టైటిల్‌ వింటేనే వేదనాదంను విన్నట్టే ఉంది. ఎక్కడో అమెరికాలో దూరంగా ఉంటున్నా, కనీసం తల్లిదండ్రుల కోసం డాలర్స్‌నైనా పంపిస్తున్నారు. కానీ ఇక్కడే ఉంటూ తల్లిదండ్రులను పట్టించుకోనివారు ఉన్నారు. ఎక్కడో అమెరికాలో ఉండేవారికి కాదు, ఇక్కడుండి తల్లిదండ్రులను వృద్ధాశ్రమాల్లో చేర్చేవారికి కనువిప్పు కలిగించాలని చేసిన సినిమా ఇది. పుట్టిన వ్యక్తి తన ఊరు పట్ల, తల్లిదండ్రుల పట్ల ఎలా ఉండాలో చెప్పిన చిత్రమిది'' అన్నారు. 
 
శర్వానంద్‌కు 'శతమానం భవతి' సక్సెస్‌.. నా బిడ్డకు దక్కిన సక్సెస్‌గా భావిస్తున్నాను 
 
మెగాస్టార్‌ చిరంజీవి మాట్లాడుతూ - ''దిల్‌రాజుకు దిల్‌ అనే పేరుని ఏ ముహుర్తాన ఆయన పేరు ముందు చేర్చారో కానీ అదే తన ఇంటి పేరు, వంటి పేరు అయిపోయి ఆయన వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది. దిల్‌ అనే పేరులో ఉన్నట్టే దిల్‌రాజు దమ్మున్న, ఆరోగ్యకరమైన, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌ను, అందరూ ఆలోచించే సినిమాలు తీస్తున్నాడు. ఒక సినిమాకు దర్శక నిర్మాతలు తల్లిదండ్రులతో సమానం. కానీ ఈరోజుల్లో నిర్మాతలంటే క్యాషియర్‌తో సమానమైపోతున్నాడు. అటువంటి ఈరోజుల్లో కథను నమ్మి, అందుకు తగిన విధంగా ఆర్టిస్టులను, టెక్నిషియన్స్‌ను ఎంపిక చేసుకుని ముందుడి నడిపిస్తున్న దిల్‌రాజు నిర్మాతకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నాడు. 
 
అందుకనే ఈ తరం హీరోలందరూ దిల్‌రాజు బ్యానర్‌లో సినిమా చేయడానికి ఎంతో ఆసక్తిని కనపరుస్తుంటారు. మా రాంచరణ్‌ కూడా దిల్‌రాజుగారి బ్యానర్‌లో చేయాలని అనుకుంటూ ఉంటాడు. తను సినిమా ప్రారంభం నుండి ప్రతి విషయంలో ఎంతో కేర్‌ తీసుకుంటాడు. సినిమా సక్సెస్‌ కావడానికి తపన పడుతూ ఉంటాడు. అలాగే దిల్‌రాజు సెంటిమెంట్స్‌ ఉన్న వ్యక్తి. రాజు దిల్‌కు రెండు వైపులా పదునుంది. ఒకవైపు అగ్రెసివ్‌గా ముందుకెళ్ళగలడు. అలాగే మంచి హృదయంతో మంచి సినిమాలు చేస్తున్నాడు. అందుకే తన తొలి సినిమాకు అన్నీ విభాగాల్లో సపోర్ట్‌ చేసిన దిల్‌రాజు తన మూలాలను మరచిపోలేదు.
 
వినాయక్‌ ఎక్కడా ఆధిపత్యాన్ని కనపరచకుండా తనకు కావాల్సిన వర్క్‌ను రాబట్టుకుంటూ ఉంటారు. అందుకే అప్పట్లో నిర్మాతలైన దిల్‌రాజుకు కావాల్సినంత ఫ్రీడమ్‌ ఇచ్చారు. అప్పటి దిల్‌ నుండి నేటి ఖైదీ నంబర్‌ 150 వరకు వినాయక్‌ ప్రవర్తనలో ఏ మార్పు లేదు. శతమానం భవతి సినిమా ఓ మంచి వెజిటేరియన్‌ భోజనం చేసినట్టు ఉంది. సాధారణంగా మనం ప్రొఫెషన్‌ దృష్ట్యా మన తల్లిదండ్రులు, ఫ్యామిలీ గురించి పెద్దగా పట్టించుకోం. అటువంటి వారికి ఇదొక హెచ్చరికలాంటి సినిమా. ఇలాంటి సినిమా చాలా మందికి మోటివేట్‌ సినిమా. నా ఖైదీ నంబర్‌ 150 ప్రీ రిలీజ్‌ వేడుక రోజున ఈ సినిమా సక్సెస్‌ కావాలని మనస్ఫూర్తిగా వేడుకున్నాను. నేను కోరుకున్నట్లే సినిమా అద్భుతంగా ఆడుతుంది. 
 
యూనిట్‌కు అభినందనలు. చూడాలని ఉంది సినిమా టైంలోనే ప్రకాష్‌రాజ్‌ సామాన్యుడు కాదు అని చెప్పాను. తన ప్రతిభకు ఎల్లలు లేవు. ఏ పాత్రనైనా చెడుగుడు అడగల నటుడు. అతిశయోక్తి అనుకోకపోతే..రంగారావుగారి తర్వాత నేటి తరంలో అంత గొప్ప పత్రిభా పాటవాలున్న నటుడు ప్రకాష్‌రాజ్‌ అని నా మనసులో అనుకుంటూ ఉంటాను. అనిపిస్తూ ఉంటుంది. ప్రకాష్‌రాజ్‌ సమకాలీన నటులమని మనం గర్వంగా చెప్పుకునేంత గొప్ప నటుడు ప్రకాష్‌రాజ్‌. అలాగే జయసుధగారు ద్రవం వంటి వ్యక్తి. ఏ పాత్ర ఇచ్చినా ఆ పాత్రలో ఒదిగిపోతారు. ఆమెను చూసినప్పుడు రాజకీయాల్లో వున్నప్పటికీ నటనకు స్వస్తి చెప్పకుండా చేస్తూనే వచ్చారు. ఆమె స్పూర్తితోనే తిరిగి మళ్లీ తెరపైకి వచ్చాను. ఇక చాలా మందిని ఎడ్యుకేట్‌ చేసే హెచ్చరిక లాంటి సినిమాను డైరెక్ట్‌ చేసిన సతీష్‌ను అభినందిస్తున్నాను. మిక్కిజె.మేయర్‌, సమీర్‌రెడ్డి, తనికెళ్ళభరణి సహా అందరికీ అభినందనలు. 
 
శర్వానంద్‌ మా ఇంట్లోనే మా చరణ్‌తో పాటు పెరిగాడు. చరణ్‌కు తను మంచి స్నేహితుడు. చాలా సౌమ్యుడు. తను హీరో మెటీరియల్‌ అయినా తనకి సినిమాలంటే ఆసక్తి ఉందో లేదో అనుకునేవాడిని. తనకు సినిమాలపై ఆసక్తి ఉందని నాకు చెప్పింది మా చరణే. ముందు శర్వా కెమెరా ఫేస్‌ చేసింది నాతోనే.. అయితే అది సినిమాలో కాదు, తను థమ్స్‌ అప్‌ యాడ్‌లో నాతో పాటు కలిసి నటించాడు. అలాగే తర్వాత తను ఐదో తారీఖు అనే సినిమా చేస్తున్నప్పుడు కూడా నన్ను కలిసి నా ఆశీర్వాదం తీసుకున్నాడు. చాలా హెల్దీ రొమాంటిక్‌ క్యారెక్టర్‌ను శతమానం భవతిలో చేశాడు. తనకు దక్కిన ఈ విజయం నా బిడ్డకు దక్కిన విజయంగా భావిస్తున్నాను. ఈ సక్సెస్‌ను అన్నకు లక్ష్మణుడిలా వెనుక ఉన్న శిరీష్‌ను కూడా ఈ సందర్భంగా అభినందిస్తున్నాను'' అన్నారు.