శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By DV
Last Modified: సోమవారం, 5 అక్టోబరు 2015 (14:40 IST)

నంది అవార్డులు ఏడిద చిత్రాలతో రావడం మర్చిపోలేను... చిరంజీవి

సీనియర్ నిర్మాత ఏడిద నాగేశ్వరరావు నిన్న మరణించిన విషయం తెలిసిందే. నేడు ఉదయం ఆయన మృతదేహాన్ని హైదరాబాద్, ఫిలింనగర్ లోని ఆయన నివాసంలో ఆయన సన్నిహితులు, స్నేహితుల సందర్శనార్ధం ఆయన భౌతికదేహాన్ని ఉంచారు. ఆయనకు నివాళులు అర్పించిన అనంతరం ప్రముఖ నటుడు చిరంజీవి స్పందిస్తూ... ''ఏడిద నాగేశ్వర రావు గారు మాకు కుటుంబ సభ్యులతో సమానం.

నా పెళ్లి కంటే ముందు నుంచి అల్లు వారి కుటుంబంతో నాగేశ్వర్‌ రావు గారికి మంచి సంబంధ బంధావ్యాలు ఉండేవి. "తాయారమ్మ, బంగారయ్య" అనే సినిమాలో అతిథి పాత్ర పోషించిన నేను ఆ తర్వాత ఆయన నిర్మించిన "ఆపద్భాందవుడు, స్వయంకృషి" సినిమాల్లో నటించడం, సదరు సినిమాల ద్వారా నంది అవార్డులను గెలుచుకోవడం ఎప్పటికి మరచిపోలేను.
 
కమర్షియల్‌ సినిమాలను కాకుండా సాంస్కృతి, సాహిత్యాలకు విలువనిస్తూ మంచి చిత్రాలను నిర్మించిన గొప్ప నిర్మాత ఏడిద నాగేశ్వర్‌ రావు గారు. ఆయన నిర్మించిన సినిమాలే ఆయనకు గొప్ప కిర్తీనిచ్చాయి. అటువంటి గొప్ప వ్యక్తి నా నిర్మాత కావడం నా అదృష్టం" అన్నారు. చిరంజీవితో పాటు అల్లు అర్జున్‌, అల్లు అరవింద్‌ కూడా దివంగత ఏడిద నాగేశ్వర్‌ రావు గారి భౌతికకాయన్ని సందర్శించారు.
 
సినిమాటోగ్రఫీ మినిస్టర్‌ తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ మాట్లాడుతూ... "సినిమా ఇండ్రస్టీకి ఏడిద నాగేశ్వర్‌ రావు గారి మరణం తీరని లోటు. తెలుగులో సందేశాత్మక చిత్రాలను నిర్మించిన మొట్ట మొదట నిర్మాత ఆయన. నాగేశ్వర్ రావు గారు నిర్మించిన "శంకరాభరణం, స్వాతిముత్యం" చిత్రాలు తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ స్థాయికి తెలియజేశాయి. ఈ కుటుంబానికి ఆ దేవుడు అండగా నిలుస్తాడని ఆశిస్తున్నాను. అలాగే ప్రభుత్వం తరపు నుంచి వీలైనంత మేరకు సహాయ పడతానని తెలియజేస్తున్నాను" అన్నారు.
 
ప్రముఖ గాయని జానకి మాట్లాడుతూ... "ఏడిద నాగేశ్వర్‌ రావు గారు నాకు ఎప్పటి నుంచో పరిచయం. ఆయన ప్రతి సినిమాలో పాటలు పాడాను. ముఖ్యంగా ఆయన నిర్మించిన "సితార" సినిమాలోని "వెన్నెల్లో గోదారి" పాట నాకు నేషనల్‌ అవార్డును తీసుకు వచ్చింది. ఆయన మంచి నిర్మాతే కాదు మంచి వ్యక్తి కూడా. ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులతోనూ సన్నిహితంగా మెలిగే అవకాశం లభించడం నా అదృష్టం" అన్నారు.
 
ప్రముఖ నటుడు-కమెడియన్‌ అలీ మాట్లాడుతూ... "సీతాకోకచిలుక" సినిమాలోని క్యారెక్టర్‌ కోసం ఏడిద నాగేశ్వర్‌ రావు గారు స్వయంగా నన్ను సిఫారసు చేయడంతో పాటు షూటింగ్‌ జరుగుతునన్ని రోజులూ నన్ను సొంత బిడ్డలా చూసుకున్నారు. మొన్నీమధ్య జరిగిన చిరంజీవి 60వ జన్మదిన వేడుకలకు కూడా నాగేశ్వర్‌ రావు గారు వచ్చారు. నేడు ఆయన మన మధ్య లేకపోవడం ఎంతో బాధకరం అన్నారు.
 
ప్రముఖ నటులు రంగనాధ్‌ మాట్లాడుతూ... "నాకు చాలా సన్నిహితుడైన వ్యక్తిని కోల్పోయాను. ఒక నిర్మాతగా కంటే నటుడిగా ఏడిద నాగేశ్వర్‌ రావు గారు నాకు పరిచయం ఎక్కువ. సావిత్రి గారు దర్శకత్వం వహించిన "వింత సంసారం" అనే సినిమాలో నేను, ఏడిద నాగేశ్వర్‌ రావు గారు కలిసి నటించాం. ఆ తర్వాత ఆయన నిర్మాతగా మారి రూపొందించిన "తాయారమ్మ బంగారయ్య" సినిమాలో నేను కధానాయకుడిగా నటించాను. భవిష్యత్తులో ఇలాంటి సినిమాలు కాని నిర్మాతలు కానీ రాకపోవచ్చు" అన్నారు.