శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Mohan
Last Modified: మంగళవారం, 21 ఆగస్టు 2018 (23:12 IST)

"చిరంజీవి"గా వెలుగొందుతున్న మెగాస్టార్... హేపీ బర్త్ డే...

తెలుగు వెండితెరకు చిరంజీవిగా పరిచయమైన శివశంకర వరప్రసాద్ అంచెలంచెలుగా ఎదిగి సుప్రీమ్ స్టార్ అయ్యాడు, అనతి కాలంలోనే మెగాస్టార్ అయ్యాడు. ఆగస్ట్ 22, 1955లో పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో కొణిదెల వెంకట్రావు, అంజనాదేవి దంపతులకు జన్మించారు. తండ్రి వృత్తి

తెలుగు వెండితెరకు చిరంజీవిగా పరిచయమైన శివశంకర వరప్రసాద్ అంచెలంచెలుగా ఎదిగి సుప్రీమ్ స్టార్ అయ్యాడు, అనతి కాలంలోనే మెగాస్టార్ అయ్యాడు. ఆగస్ట్ 22, 1955లో పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో కొణిదెల వెంకట్రావు, అంజనాదేవి దంపతులకు జన్మించారు. తండ్రి వృత్తిరిత్యా కానిస్టేబుల్ అయినందున పాఠశాల విద్యను వివిధ ప్రాంతాల్లో పూర్తి చేసారు. ఇంటర్మీడియెట్‌ను ఒంగోలులోని సి.ఎస్.ఆర్ కాలేజీలో అలాగే నర్సాపూర్‌లోని వైఎన్ కాలేజీలో డిగ్రీ వరకు చదివారు. ఆ తర్వాత నటనపై మక్కువతో 1976లో మద్రాసు వచ్చి మద్రాస్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో యాక్టింగ్ స్కిల్స్‌లో డిప్లొమో పట్టా పొందారు.
 
పునాది రాళ్లు సినిమాతో అతని సినీ జీవితం ప్రారంభమైంది. కానీ ప్రాణం ఖరీదు సినిమా ముందుగా రిలీజైంది. విలన్ పాత్రలను సైతం కాదనకుండా నటిస్తూ, అలాగే మల్టీస్టారర్ చిత్రాలలో కూడా నటించాడు. 1983లో కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఖైదీ సినిమా తనను నటుడిగా ఒక మెట్టు పైకి ఎక్కించింది, ఆ సినిమా తర్వాత వచ్చిన మంత్రి గారి వియ్యంకుడు, సంఘర్షణ, ఛాలెంజ్, హీరో, దొంగ, జ్వాల, అడవి దొంగ, కొండవీటి రాజా, రాక్షసుడు, గ్యాంగ్ లీడర్, రౌడీ అల్లుడు, యముడికి మొగుడు, దొంగ మొగుడు వంటి వరుస విజయాలతో సుప్రీమ్ స్టార్ నుండి మెగాస్టార్ అయ్యాడు. విజేత, స్వయంకృషి, రుద్రవీణ వంటి సందేశాత్మక చిత్రాలతో సైతం నటించి మెప్పించాడు. అందులో రుద్రవీణ చిత్రానికి గానూ జాతీయ ఉత్తమ సమగ్రతా చిత్రం అవార్డు కూడా వచ్చింది. 
 
నటనతో పాటు డ్యాన్స్‌లతో మాస్ ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. కె.విశ్వనాథ్ తీసిన శుభలేఖ, స్వయంకృషి, ఆపద్భాందవుడు చిత్రాలు తనకు నటుడిగా మంచి పేరు సంపాదించి పెట్టాయి. కె.రాఘవేంద్రరావు తీసిన జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రం ఇప్పటికీ మాస్టర్‌పీస్‌లా ఉండిపోయింది. కొదమసింహం మరియు గ్యాంగ్ లీడర్ చిత్రాలు అతడిని బాస్ ఆఫ్ తెలుగు సినిమాగా నిలబెట్టాయి. అలాగే తమిళం, కన్నడ, హిందీ చిత్రాలలో కూడా నటించాడు. అప్పుడప్పుడు గెస్ట్ రోల్స్ కూడా వేసాడు. ముగ్గురు మొనగాళ్లు, అల్లుడా మజాకా చిత్రాలు యావరేజ్‌గా నిలిచినా, హిట్లర్, మాస్టర్, బావగారు బాగున్నారా, చూడాలని వుంది మరియు స్నేహం కోసం చిత్రాలతో మళ్లీ ఫామ్‌లో కొచ్చాడు. సినిమాలలో బిజీగా ఉంటూనే 1998లో మదర్ థెరిస్సా స్పూర్తితో చిరంజీవి బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ ప్రారంభించి, కొన్ని వేల కుటుంబాలలో వెలుగులు నింపాడు.
 
2000లో అన్నయ్య, 2002లో ఇంద్ర సినిమాలు సైతం భారీ హిట్‌లుగా నిలిచాయి. అంజి వంటి భారీ బడ్జెట్ చిత్రంలో నటించినప్పటికీ ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద నిరాశే మిగిల్చింది. మృగరాజు సినిమా కూడా పెద్దగా ప్రభావం చూపలేక పోయింది. 2003లో వచ్చిన ఠాగూర్ సినిమా హిట్‌గా నిలిచింది, ఆ తర్వాత శంకర్‌దాదాMBBS, జైచిరంజీవ వంటి చిత్రాలు సైతం యావరేజ్‌గా మిగిలాయి. 2006లో పద్మభూషణ్ అవార్డు, అలాగే అదే సంవత్సరంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ పట్టా అందుకున్నాడు. అతని ఫిల్మ్ కెరీర్‌లో 10 సార్లు ఫిల్మ్‌ఫేర్ సౌత్ అవార్డులు, మూడుసార్లు నంది అవార్డులు, అలాగే 2016లో రఘుపతి వెంకయ్య అవార్డు కూడా గెలుపొందాడు. 
 
2007లో శంకర్‌దాదా జిందాబాద్ చిత్రంతో వెండితెరకు దూరమై 2008లో రాజకీయ తెరంగ్రేటం చేసాడు. 2008లో ప్రజారాజ్యం పార్టీ ప్రారంభించి, ఎక్కువ కాలం పాటు దానిని నడపలేక 2011లో కాంగ్రెస్‌లోకి విలీనం చేసారు. రాజ్యసభ సభ్యుడుగా ఎన్నికై, భారత టూరిజం శాఖామాత్యులుగా కూడా పనిచేసాడు. రాజకీయాలలో అంతగా క్రియాశీలంగా లేనప్పటికీ, దాదాపు 10 సంవత్సరాల విరామం తర్వాత ఖైదీ నెం.150 చిత్రంతో మళ్లీ టాలీవుడ్‌కి రీఎంట్రీ ఇచ్చాడు. ఈ చిత్రం 2017 సంక్రాంతి కానుకగా విడుదలై, రికార్డ్ కలెక్షన్‌లతో మరోసారి మెగాస్టార్ స్టామినాకు ఎదురులేదని రుజువు చేసింది. 
 
తాజాగా రేపు 63వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న చిరు ఈ సారి సైరా నరసింహారెడ్డిగా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ని చిత్రబృందం విడుదల చేసింది. ఇప్పటికే సోషల్ మీడియాలలో వైరల్‌గా మారింది. చిరంజీవి ఒకప్పటి హీరోలైన ఎన్టీయార్, ఏఎన్నార్, కృష్ణలతోనే కాకుండా వారి తరువాతి తరాలకు, అలాగే వారి మూడవ తరానికి కూడా పోటీగా నటిస్తూ నేను ఎవర్‌యూత్ అంటూ సాగిపోతున్నారు.