బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , మంగళవారం, 10 జనవరి 2017 (02:58 IST)

రికార్డులు బద్దలు కొట్టడం అంటే ఇదీ: చాటి చెబుతున్న దంగల్

చరిత్ర సృష్టిస్తున్న దంగల్

కేవలం మరో రెండు రోజుల్లో భారతీయ చిత్ర పరిశ్రమ చరిత్రలో ఒకే ఒక భాషలో 350 కోట్ల రూపాయల నికరాదాయం సాధిస్తున్న మొట్టమొదటి చిత్రంగా దంగల్ చరిత్ర సృష్టించనుంది. భారతీయ నిరుపమాన నటుడు అమీర్‌ఖాన్ నటించిన దంగల్ సినిమా కేవలం మూడు వారాల్లో స్వదేశంలో 345 కోట్ల రూపాయలను సాధించింది. బాలీవుడ్ చరిత్రలో ఇది ఆల్ టైమ్ రికార్డుగా నమోదు కాగా, అన్ని రకాల రికార్డులను దంగల్ చెరిపివేయడానికి ఉరుకులెత్తుతోంది. 
 
ఒక మల్లయోధుడి జీవిత చరిత్ర ఆధారంగా తీసిన ఈ బయోపిక్ ఇంత ఘనత సాధించడానికి ప్రధాన కారణం అమీర్ ఖాన్ నటనే కావచ్చు. ఎలాంటి అతిశయ నటనకూ తావులేకుండా అమీర్ పలికించిన హావభావాలు ఒక ఎత్తైతే, ఈ సినిమా కథ విషయంలో దర్సకుడు పాటించిన నిజాయితీ, సమస్త మసాలాలకు దూరంగా నిజజీవితానికి అతి సమీపంలో కథను నడిపించిన విధానం దేశవ్యాప్తంగా ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేస్తోంది. 
 
అమీర్ ఆకాశమెంత ఎత్తుకెదగడం ఇది తొలిసారి కాదు. పీకే సినిమాలో అతడి నట విరాట్ రూపం అంతర్జాతీయ ప్రతిష్ట ఆర్ఝించింది. కాసుల గలగలల కన్నా నటుడిగా అమీర్ ప్రదర్శిస్తున్న పరిపూర్ణతే అతడి సినిమాలకు ప్రజలు బ్రహ్మరధం పట్టేలా చేస్తోంది. గతంలో విడుదలైన పీకే సినిమా స్వదేశంలో 300 కోట్ల క్లబ్‌ను చేరితే దంగల్ కేవలం మూడు వారాల్లో 350 కోట్ల క్లబ్‌కు చేరుకుంది. అతి సమీప కాలంలోనే దంగల్ 400 కోట్ల రూపాయల క్లబ్‌లో చేరుతుందని చిత్ర విమర్సకుల అంచనా. 
 
ప్రపంచ వ్యాప్తంగా 700 కోట్ల రూపాయలను ఆర్జించిన తొలిచిత్రంగా అమీర్ నటించిన పీకే చిత్రం రికార్డు సృష్టించింది. ఈ సినిమా దరిదాపుల్లోకి వెళ్లగల స్థాయి దంగల్‌కు ఉందని భావిస్తున్నారు. తొలి దశ విడుదల్లో ఆ స్థాయిని అందుకోకపోయినా రెండో దశ విడుదల సందర్భంగా పీకే సినిమా కలెక్షన్లను దంగల్ అధిగమిస్తుందని అంచనా.