శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 30 జులై 2020 (08:55 IST)

మీ సైనికుడు 'బాహుబలి'ని పిలిచి కరోనా వైరస్‌ను తన్ని తరమండి : ఆర్జీవీ

తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన దిగ్గజ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళికి కరోనా వైరస్ సోకింది. ఈ విషయాన్ని ఆయన గత రాత్రి స్వయంగా ట్వీట్ చేయడంతో ఫిల్మ్ ఇండస్ట్రీలో కలకలంరేగింది. రెండు రోజుల క్రితం తాను, తన కుటుంబసభ్యులు స్వల్ప జ్వరంతో బాధపడ్డామని, జ్వరం తగ్గిన తర్వాత కొవిడ్ పరీక్షలు చేయగా, అందులో పాజిటివ్ అని వచ్చినట్టు ఆయన తన ట్వీట్‌‌లో పేర్కొన్నారు.
 
అంతేకాకుండా, ప్రస్తుతం వైద్యుల సూచన మేరకు తామంతా హోం క్వారంటైన్‌లో ఉన్నట్టు చెప్పారు. తమలో కరోనా లక్షణాలు లేనప్పటికీ నిబంధనలు పాటిస్తున్నామని, జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. యాంటీబాడీలను వృద్ధి చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నామని, కోలుకున్న తర్వాత ప్లాస్మా దానం చేస్తామని ఆయన ప్రకటించారు. 
 
అయితే, ఈ విషయం తెలిసిన అనేక మంది సినీ ప్రముఖులు రాజమౌళిని పరామర్శిస్తూ, ధైర్యం చెప్పేలా ట్వీట్లు చేశారు. ఇలాంటివారిలో వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ కూడా ఉన్నారు. "మీరు, మీ కుటుంబ సభ్యులు త్వరలోనే కోలుకుంటారని, కాకపోతే అంతకంటే ముందు మీ సైనికుడు బాహుబలిని పిలిచి కరోనా వైరస్‌ను తన్నాలని చెబితే సరిపోతుందని" అంటూ ట్వీట్ చేశారు. ఇది ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. వర్మపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తూ తూర్పారబడుతున్నారు.