శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : బుధవారం, 26 ఆగస్టు 2015 (14:58 IST)

కన్యాశుల్కంకు 60 ఏళ్లు: మూడుసార్లు రిలీజై 100 రోజులతో రికార్డు!

''కన్యాశుల్కం'' విడుదలై 60 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. వరకట్న సమస్యకు సరైన సమాధానం చెప్పిన ఈ సినిమా.. తొలిసారి రిలీజ్‌లో ఆకట్టుకోలేకపోయినా చాలాసార్లు రిలీజై.. మూడుసార్లు వందరోజులు ఆడి రికార్డు సృష్టించింది. ఇంట్లో ఆడపిల్ల ఉంటే ఎంతకైన అమ్మవచ్చుననే చెడు సంప్రదాయాన్ని కళ్లార చూసిన గురజాడ అప్పారావు కన్యాశుల్కం నాటకంలో ఆ దురాచారంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 
 
వాడుక భాషను సాహిత్యంలో రాసి తెలుగు భాషను జనానికి మరింత దగ్గర చేసిన ఘనత కూడా ఈ నాటకానికే దక్కుతుంది. ఆ నాటకం తెలుగునేల అంతటా జేజేలు అందుకుంది. ఆ నాటకానికే సినిమాకు అనుగుణంగా కొన్ని మార్పులు చేసి వినోదా సంస్థ అధినేత డి.ఎల్ కన్యాశుల్కం చిత్రాన్ని నిర్మించారు‌. ఈ చిత్రానికి పి.పులయ్య దర్శకత్వం వహించారు. 1955 ఆగస్ట్‌26న ఈ చిత్రం రిలీజైంది.
 
ఈ నాటకంలో తొలి డైలాగ్ సాయంత్రమైంది.. క్లైమాక్స్ డామిట్ కథ అడ్డంగా తిరిగింది అనేవి బాగా పాపులర్ అయ్యాయి. డైలాగ్ చెప్పే గిరీశం పాత్ర కూడా అంతే పాపులర్. కన్యాశుల్కం చిత్రంలో గిరీశంగా ఎన్టీఆర్‌, మధురవాణిగా సావిత్రి, బుచ్చమ్మగా జానకి, రామప్పంతులుగా సీఎస్సార్‌, అగ్నిహోత్రవధనులుగా వి.రామన్న పంతులు, పూటకూళ్లమ్మగా ఛాయాదేవి నటించగా, గుమ్మడి, పద్మనాభం, సూర్యకాంతం, హేమలత ఇతర పాత్రధారులుగా అదరగొట్టారు.
 
కన్యాశుల్కం సినిమాకు సదాశివబ్రహ్మం సంభాషణలు రాశారు. సరసుడ దరి చేరరా.. అనే పాటను కూడా ఆయన రాశారు. శ్రీశ్రీ రాసిన ఆనందం అర్ణవమయితే కవితనే పాటగా మలుచుకున్నారు. ఇలా కవులు కలాల నుంచి జాలువారిన గీతాలు కన్యాశుల్కం చిత్రానికి అదనపు ఆకర్షణగా నిలిచాయి. అయితే మొదటి రిలీజ్‌లో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. తర్వాత 28 ఏళ్లకు 1983లో రెండో సారి రిలీజ్ అయి 50 వారాలు ఆడి సంచలనం సృష్టించింది.
 
1986లో 3వ సారి రిలీజ్ అయి విజయవాడ, గుంటూరులో వంద రోజులు అడింది. తర్వాత గురజాడ కన్యాశుల్కం శత వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంలోనూ ఈ చిత్రం 1993లో మరోమారు విడుదలైంది. అప్పుడు హైదరాబాద్‌లో ఇంకోసారి ఈ చిత్రం శతదినోత్సవం జరుపుకోవడం విశేషం. ఇలా రిపీట్‌రన్స్‌లోనూ మూడుసార్లు శతదినోత్సవం జరుపుకున్న చిత్రం భారతదేశం చలనచిత్ర చరిత్రలోనే మరొకటి లేదు. అలా కన్యాశుల్కం జనాన్ని రంజింపచేసింది. అరవై ఏళ్లు పూర్తి చేసుకుంది. ఇందులోని కథాంశం ఈ నాటికీ ఆకట్టుకుంటూనే ఉండడం విశేషం. నెగటివ్ షేడ్స్ గల గిరీశం పాత్రకు ఎన్టీఆర్ ఓకే చెప్పి సాహసం చేసి తెలుగు చిత్ర సీమకు కన్యాశుల్కం సినిమా ద్వారా మంచి పేరు తెచ్చిపెట్టారు.