బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By DV
Last Updated : బుధవారం, 10 ఫిబ్రవరి 2016 (12:31 IST)

''లజ్జ'' రొటీన్ కాదు.. అమ్మాయి కథే.. అవార్డుల కోసం కాదు: నరసింహ నంది

1940లో ఒక గ్రామం అనే మొదటి సినిమాతో కెరీర్ ప్రారంబించి తోలి సినిమాతోనే  నేషనల్ అవార్డు సొంతం చేసుకున్న దర్శకుడు నరసింహ నంది. ఆ తరువాత 'హై స్కూల్','కమలతో నా ప్రయాణం' లాంటి చిత్రాలను తెరకెక్కించిన ఈ దర్శకుడు తాజాగా 'లజ్జ' అనే సినిమాను రూపొందించాడు. ఈ సినిమా ఇటివలే విడుదలై మంచి టాక్‌తో రన్ అవుతుంది. ఈ సందర్బంగా దర్శకుడు నరసింహ నంది  చెప్పిన విశేషాలు..  
 
రొటీన్ కోరుకునే వారికి నచ్చదు... 
నేను కొన్ని వర్గాల ప్రేక్షకులను మాత్రమే  టార్గెట్ చేసి సినిమా చేస్తాను. మనుషుల్లో రెండు రకాలుంటారు. ఆలోచించే వాళ్ళు, ఆలోచించని వాళ్ళు. నా సినిమా ఎక్కువగా చదువుకున్న వాళ్లకి, ఇంగ్లీష్ సినిమాలు బాగా చూసేవారికి, ఎక్కువ ఆలోచించే వాళ్లకి మాత్రమే నచ్చుతాయి. రొటీన్‌గా నాలుగు పాటలు, ఫైట్స్ ఉండే సినిమాలు చేయడం నాకు నచ్చదు. కొత్త కథలు అసలు రావట్లేదు. డిఫరెంట్‌గా ఆలోచించి 'లజ్జ' అనే సినిమాను తెరకెక్కించాను. 
 
నా దృష్టిలో కమర్షియల్ హిట్ అంటే పెట్టుబడి తిరిగి వస్తే చాలు. సినిమా సక్సెస్ అయినట్లే. ఈ సినిమా కోసం చాలా తక్కువ పెట్టుబడి అనుకునే నిర్మించాం. మేము, సినిమా కొనుక్కున్న వారు సంతోషంగానే ఉన్నారు. ఇది వరకు బాలచందర్, బాపు, భారతీరాజా తక్కువ బడ్జెట్‌లో కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలు చేసేవారు. అలానే మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమాను తక్కువ బడ్జెట్‌లో సినిమా చేయాలని బాగా ప్రెజంట్ చేయడానికి ట్రై చేశాం. 
 
ఎవరైనా ప్రేక్షకులు చూడడానికే సినిమాలు చేస్తారు. నేను అలాగే .. అంతే కాని అవార్డు కోసం సినిమాలు చేయను. మంచి కథను ప్రేక్షకులకు అర్ధమయ్యేలా సినిమా చేయాలని ప్లాన్ చేస్తా. కాని థియేటర్ల దగ్గరకు వచ్చేసరికి అసలు సమస్య మొదలవుతుంది.  
 
ఓ అమ్మాయి జీవితమే .. 
ఈ లజ్జ సినిమా గురించి చెప్పాలంటే .. పెళ్ళికి ముందు అమ్మాయి తప్పు చేసిందంటే అది తండ్రి పొరపాటు. పెళ్ళైన తరువాత తప్పు చేస్తే అది భర్తే తప్పనే చెప్పాలి. భార్యభర్తల మధ్య వచ్చే చిన్న చిన్న గొడవల వలన జీవితాలు నాశనమైపోతున్నాయి. ఆ సమయంలో అమ్మాయికి నచ్చిన వారితో తన జీవితాన్ని గడపాలని నిర్ణయించుకోవడం. అక్కడ కూడా సంతోషంగా ఉండలేకపోవడం. చివరకు తన జీవితం ఏం అయిందో అనేదే ఈ 'లజ్జ' సినిమా. 
 
ఈ సినిమా చేస్తున్నానని తెలిసిన ఓ హిందీ చిత్ర నిర్మాత బాలీవుడ్‌లో ఈ సినిమా చేయమని అడిగారు. ఇలాంటి కంటెంట్ ఉన్న సినిమాలు మరోసారి చేయలేను. రిస్క్‌తో కూడుకున్న పని. నా నెక్స్ట్ సినిమా 'బుడ్డారెడ్డి పల్లి బ్రేకింగ్ న్యూస్' అనే సినిమా ఉంటుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తయింది. పూర్తి స్థాయిలో ఎంటర్టైన్మెంట్ ఉండే సినిమా. అని చెప్పుకొచ్చారు.