శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 3 ఫిబ్రవరి 2017 (15:55 IST)

మెగా కాంబోలో మూవీ ఇప్పట్లో అసాధ్యం... ఎవరికి వారు బిజీ... టీఎస్సార్ స్టేట్మెంట్ ఉత్తుత్తిదేనా?

మెగా కాంబోలో మూవీ చేయనున్నట్టు ప్రముఖ నిర్మాత, కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు టి. సుబ్బరామిరెడ్డి ప్రకటించారు. ఈ ప్రకటన టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌లు

మెగా కాంబోలో మూవీ చేయనున్నట్టు ప్రముఖ నిర్మాత, కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు టి. సుబ్బరామిరెడ్డి ప్రకటించారు. ఈ ప్రకటన టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌లు కలిసి నటించే ఈ మల్టీస్టారర్ చిత్రానికి మాటలమాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తారని, ఇద్దరు మెగా హీరోల ఇమేజ్‌కు తగినట్టుగా కథను సిద్ధం చేసినట్టు నిర్మాత టీఎస్సార్ గురువారం అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రాన్ని నిర్మాత సి.అశ్వినీదత్‌తో కలిసి నిర్మించనున్నట్టు తెలిపారు. ఇంతవరకు బాగానే ఉంది. అయితే, ఈ మెగా కాంబో ఇప్పట్లో సాధ్యం కాదని ఫిల్మ్ నగర్ వర్గాలు స్పష్టంగా చెపుతున్నాయి. దీనికి కారణం హీరోలతో పాటు దర్శకుడు ఇప్పటికే అంగీకరించిన ప్రాజెక్టులో బిజీగా ఉండటమే ఇందుకు కారణంగా ఉంది. అవేంటే ఓసారి విశ్లేషిస్తే... 
 
మెగాస్టార్ చిరంజీవి నటించిన ప్రతిష్టాత్మక చిత్రం "ఖైదీ నంబర్.150". ఇటీవల విడుదలై బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఈయన తన తదుపరి చిత్రంగా చారిత్రాత్మక నేపథ్యం కలిగిన "ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి"ని తెరకెక్కించనున్నారు. ఈ చిత్రానికి దర్శకుడు సురేందర్ రెడ్డి కాగా, నిర్మాత రామ్ చరణ్. ఆ తదుపరి నిర్మాత అల్లు అరవింద్ నిర్మించే మాస్ చిత్రంలో నటించనున్నారు. ఈ చిత్రానికి బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తారు. వీటికితోడు ప్రముఖ నిర్మాత సి.అశ్వినీదత్ సొంతగా చిరంజీవితో ఓ చిత్రాన్ని తీసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఈ ప్రాజెక్టులన్నీ పూర్తయ్యేసరికి కనీసం ఒక యేడాది లేదా రెండేళ్ళ సమయం పట్టవచ్చు. 
 
ఇక పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే.. ప్రస్తుతం ఈయన డాలీ దర్శకత్వంలో "కాటమరాయుడు" చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం మార్చి 24వ తేదీన విడుదలకానుంది. ఆ తర్వాత చినబాబు నిర్మాతగా త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ నటించనున్నారు. ఈ చిత్రం తర్వాత ఏఎం రత్నం నిర్మాతగా తమిళ దర్శకుడు వీసన్ దర్శకత్వంలో తెరకెక్కే చిత్రంలో నటిస్తారు. ఈ చిత్రం తర్వాత మైత్రీ మూవీస్‌లో ఓ చిత్రంలో నటించేందుకు కమిట్ అయ్యారు. వీటితో పాటు.. కొత్త వారిని ప్రోత్సహించే నిమిత్తం తన సొంత బ్యానర్‌ పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్‌లో కూడా చిత్రాలను నిర్మించనున్నారు. ఇవన్నీ పూర్తయిన తర్వాత పవన్ కళ్యాణ్ పూర్తిగా క్రియాశీలక రాజకీయాలపై దృష్టిసారించే అవకాశాలు ఉన్నాయి. 
 
ఇక దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు అంతే బిజీగా ఉన్నారు. 'కాటమరాయుడు' చిత్రం షూటింగ్ పూర్తయ్యాక పవన్ హీరోగా నిర్మితమయ్యే చిత్రానికి దర్శకత్వం వహిస్తారు. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్‌తో ఓ చిత్రం చేయనున్నారు. అదేవిధంగా నిర్మాత సి. అశ్వినీదత్ విషయానికి వస్తే.. ఈయన ఇతర నిర్మాతలతో, ఇతర హీరోలతో కలిసి చిత్రాలు నిర్మించరు. తన సంస్థ వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై నాడు సీనియర్ ఎన్టీఆర్.. ఆ తర్వాత చిరంజీవితోనే చిత్రాలు నిర్మించారు. అందువల్ల టి.సుబ్బరామిరెడ్డితో కలిసి ఈయన మెగా చిత్రాన్ని నిర్మించే అవకాశమే లేదు. 
 
ఇవన్నీ బేరీజు వేస్తే.. మెగాస్టార్, పవర్ స్టార్ కాంబినేషన్‌లో ఇప్పట్లో చిత్రం వచ్చే అవకాశమే లేదని టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే, ఈ మెగా కాంబోలో చిత్రాన్ని నిర్మించేందుకు నిర్మాత టి.సుబ్బరామిరెడ్డి ముమ్మరంగా ప్రయత్నిస్తూ ఉండవచ్చు. కానీ, మెగా హీరోలతో పాటు నిర్మాత అశ్వినీదత్‌ల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన ఇంతవరకు వెలువడలేదు. సో.. ఈ మెగా ప్రాజెక్టు ఇప్పట్లో అచరణ సాధ్యం కాదని పరిశ్రమ వర్గాలు బల్లగుద్ది వాదిస్తున్నాయి.