బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By మోహన్
Last Updated : సోమవారం, 1 ఏప్రియల్ 2019 (15:45 IST)

ఆసక్తికరంగా మారిన ఎన్టీఆర్ వారసుల రాజకీయం..

తెలుగు చిత్ర సీమలో ఎన్టీఆర్ ఓ వెలుగు వెలిగాడు. ప్రజా సేవ చేయాలని 1982లో తెలుగుదేశం పార్టీని స్థాపించి, కేవలం 9 నెలల వ్యవధిలో ముఖ్యమంత్రి అయ్యారు. అటు సినిమాలతో పాటు రాజకీయాలలో తనకు తానే సాటి అంటూ రుజువు చేసుకున్నాడు. ఎన్టీఆర్ చివరి రోజుల్లో తాను స్థాపించిన పార్టీని కూడా కుటుంబ సభ్యులు తనకు దూరం చేసారు. 
 
అయితే చంద్రబాబు నాయుడు చాణక్యంతో తెలుగుదేశం పార్టీ ఇప్పటికీ ఉనికిలో ఉంటూ, ప్రజలకు ఎన్టీఆర్‌పై ఇంకా అభిమానం ఉందంటూ రుజువు చేస్తోంది. అయితే ఎన్టీఆర్ కుటుంబం నుండి అనేక మంది రాజకీయ వారసులు తెరపైకి వచ్చారు. వాళ్లలో ముందుగా చెప్పాలంటే వారి పెద్ద కుమారుడు హరికృష్ణ, అల్లుళ్లు నారా చంద్రబాబు నాయుడు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఈయన సతీమణి దగ్గుబాటి పురంధేశ్వరి(కుమార్తె), మరో కుమారుడు నందమూరి బాలకృష్ణ. 
 
వీరంతా ప్రస్తుతం రాజకీయాలలో చురుగ్గా ఉన్నవారే. అందులో నందమూరి హరికృష్ణ హఠాన్మరణంతో అతని రాజకీయ వారసురాలుగా నందమూరి సుహాసిని తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసింది. కాగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో మాత్రం నందమూరి కుటుంబానికి చెందిన వారు వేర్వేరు పార్టీలలో పోటీ చేస్తూ ఎవరికి వారేనంటూ ప్రచారంలో దూసుకుపోతున్నారు.
 
* నారా చంద్రబాబు నాయుడు(తెదేపా)- కుప్పం అసెంబ్లీ నియోజకవర్గం తెదేపా అభ్యర్థి.
* నందమూరి బాలకృష్ణ(తెదేపా) - హిందూపూర్ అసెంబ్లీ నియోజకవర్గం తెదేపా అభ్యర్థి.
* దగ్గుబాటి పురంధేశ్వరి(భాజాపా)- వైజాగ్ పార్లమెంటరీ నియోజకవర్గం భాజాపా అభ్యర్థి.
* దగ్గుబాటి వెంకటేశ్వరరావు(వైకాపా)-పర్చూరు అసెంబ్లీ నియోజకవర్గం వైకాపా అభ్యర్థి.
* నారా లోకేశ్‌బాబు(తెదేపా) - మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం తెదేపా అభ్యర్థి.(బాలకృష్ణ పెద్దల్లుడు)
* శ్రీభరత్ (తెదేపా)- వైజాగ్ పార్లమెంటరీ నియోజకవర్గం తెదేపా అభ్యర్థి.(నటుడు బాలకృష్ణ చిన్నల్లుడు)
 
వీరిలో ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే భార్యాభర్తలు వేర్వేరు పార్టీలలో టిక్కెట్‌లు పొంది పోటీలో నిలిచారు. మరొక పక్క వైజాగ్ పార్లమెంట్ నియోజకవర్గంలో కుటుంబసభ్యుల్లో ఇద్దరు పోటీ పడుతున్నారు. వీళ్లలో ఎవరిని విజయం వరిస్తుందో చూడాలంటే మరో 10 రోజులు ఆగాల్సిందే. ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా ఈ కుటుంబసభ్యులు ఎలాగైనా రాజకీయంగా ముందుకుపోతారు.