శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ttdj
Last Modified: శుక్రవారం, 27 జనవరి 2017 (14:35 IST)

ఓం నమో వేంకటేశాయ సినిమాపై వివాదం ఎందుకు?

ఆధ్మాత్మిక కథలను ప్రజారంజకంగా చిత్రీకరించడంతో దిట్టగా పేరొందిన ప్రముఖ సినీ దర్శకుడు, తితిదే పాలకమండలి సభ్యులు రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఓం నమో వేంకటేశాయ చిత్రం షూటింగ్ పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది. ఆడియో విడుదల కార్యక్రమం కూడా విజయవంతంగా నిర

ఆధ్మాత్మిక కథలను ప్రజారంజకంగా చిత్రీకరించడంతో దిట్టగా పేరొందిన ప్రముఖ సినీ దర్శకుడు, తితిదే పాలకమండలి సభ్యులు రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఓం నమో వేంకటేశాయ చిత్రం షూటింగ్ పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది. ఆడియో విడుదల కార్యక్రమం కూడా విజయవంతంగా నిర్వహించుకుని ఇటీవలే రాఘవేంద్రరావుతో పాటు ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న నాగార్జున, నిర్మాత తదితరులు శ్రీవారిని దర్శించుకున్నారు. సినిమాను ఫిబ్రవరిలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.
 
శ్రీవారితో పాచికలు ఆడారని చెబుతున్న ఆయన పరమభక్తుడైన హథీరాం బావాజీ కథను ఇతివృత్తంగా తీసుకుని నిర్మించిన ఈ చిత్రం ప్రేక్షకుల మన్ననలు అందుకోవడంపై ఎవరికీ పెద్ద సందేహాలు లేవు. ఎందుకంటే రాఘవేంద్రరావు దర్శకత్వంలో నాగార్జునతో నిర్మించిన అన్నమయ్య, షిరిడిసాయి చిత్రాలు ఘనవిజయాన్ని సాధించాయి. అదే తరహాలో నమో వేంకటేశాయ చిత్రం కూడా ప్రేక్షకులకు విశేషంగా ఆకట్టుకుంటుందని అందరూ భావిస్తున్న తరుణంలో ఓ వివాదం తెరపైకి వచ్చింది.
 
ఈ సినిమా పేరును హథీరాం బావాజీగా మార్చాలని కొందరు గిరిజన సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు ఆందోళనలు కూడా చేపట్టారు. ఉత్తరాదికి చెందిన హథీరాంజీ బావాజీ తిరుమలకు వచ్చి, స్వామిసేవలో తరించారు. అందుకే చాలా యేళ్ళు బావాజీ శిష్య పరంపరలో మహంతుల పాలనలో తితిదే ఉండేది. తితిదేలో మహంతుల పాత్ర కాదనలేనిది. ఇప్పటికీ తిరుమలలో హథీరాంజీ మఠం ఉంది. ఈ మఠానికి తగిన ప్రాధాన్యత కూడా ఉంది. తిరుమల తూర్పు మాఢా వీధిలో నిలబడి దక్షిణంవైపు తలెత్తి చూస్తే హథీరాంజీ బావాజీ వెంటేశ్వరస్వామితో పాచికలు ఆడుతున్నట్లు వేయించిన చిత్రం కనిపిస్తుంది.
 
బంజారా అనే గిరిజన తెగకు చెందిన హథీరాం బావాజీ జీవిత నేపథ్యం ఆధారంగా ఓ చిత్రాన్ని నిర్మిస్తారని ఎవరూ ఊహించలేదు. ఇప్పటిదాకా హథీరాం బావాజీ పేరు ఎందరికీ పరిచయోగానీ ఈ చిత్రం విడుదల తరువాత కోట్ల మందికి బావాజీ పేరు చేరువవుతుందనడంలో సందేహం లేదు. అయితే అన్నమయ్య, రామదాసు, తరిగొండ వెంగమాంబ వంటి భక్తుల కథను ఆధారంగా చేసుకుని నిర్మించిన చిత్రాలకు వారి పేర్లే పెట్టినప్పుడు హథీరాం బావాజీ కథకు వచ్చేసరికి ఆయన పేరు పెట్టకుండా ఓం నమో వేంకటేశాయ అని పేరు పెట్టడం ఏమిటని గిరిజన సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. దీనివల్ల గిరిజనుల మనోభావాలు దెబ్బతింటాయని వాదిస్తున్నాయి. 
 
చిత్రం పేరును హథీరాం బావాజీ మహరాజ్‌గా మార్పు చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. లేకుంటే చిత్ర విడుదలను అడ్డుకుంటామని ప్రకటించారు. తిరుపతి అలిపిరి శ్రీవారి పాదాల వద్ద గిరిజన విద్యార్థి సమాఖ్య నాయకులు పడిత్యా శంకర్ నాయక్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు.
 
ఓం నమో వేంకటేశాయ చిత్రంపై నిరసన తెలియజేయాల్సిన అవసరం ఉందా? అనేది ఇప్పుడు ప్రశ్న. ఈ చిత్రానికి నమో వేంకటేశాయ అని పేరు పెట్టుకున్నంత మాత్రాన గిరిజనుల మనోభావాలకు భంగం వాటిల్లుతుందా..? చిత్రం విడుదలైన తరువాత అందులో హథీరాంజీకి సంబంధించి అవాస్తవాలు చూపించి ఉన్నా, గిరిజనుల పట్ల వివక్ష ప్రదర్సించి ఉన్నా అప్పుడు అభ్యంతరం చెప్పవచ్చు. అలాంటిదేమీ లేకుండా సినిమాకు బావాజీ పేరు పెట్టాలనడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తమవుతోంది. ఇది భగవంతుడు భక్తునికి సంబంధించిన కథ. భగవంతుని పేరు పెట్టడాన్ని ఏ భక్తుడు వ్యతిరేకించడు.
 
అన్నమయ్య, రామదాసు విషయానికోస్తే సినిమాలు రాకమునుపే వీరి పేర్లు ఊరూరా పరిచయం ఉంది. సినిమాల వల్ల చరిత్ర ఇంకా ఎక్కువ మందికి తెలిసిందనేది వేరే సంగతి. ఉత్తరాదికి చెందిన హథీరాంజీ బావాజీ గురించి తెలుగువారికి అంతగా తెలియదు. తిరుపతి ప్రాంత వాసులకు కొంత తెలుసుగానీ బయటవారికి తెలిసే అవకాశం లేదు. అందుకే ఆ పేరును ఎంచుకుని ఉండవకపోవచ్చు. వేంకటేశ్వరస్వామి పేరు పెట్టినా ఈ చిత్రం వల్ల ఖ్యాతి లభించబోయేది హథీరాం బావాజీ పరమ భక్తునికే. ఆ విధంగా అందరూ సంతోషించవచ్చు. ఈ కోణంలో గిరిజన నాయకులు ఆలోచించాల్సిన అవసరం ఉందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.