శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: సోమవారం, 20 నవంబరు 2017 (15:07 IST)

నన్ను చంపేస్తారా? దేశంలో ఏం జరుగుతోంది? 'పద్మావతి' దీపిక ప్రశ్న

పద్మావతి చిత్రంలో నటించినందుకు నన్ను చంపేస్తారా... అసలీ దేశంలో ఏం జరుగుతోంది అంటూ పద్మావతి చిత్రంలో నటించిన దీపికా పదుకునె ప్రశ్నించింది. ఒక సినిమాలో నటించినంత మాత్రాన చంపేస్తారా అంటూ ప్రశ్నించింది. ఆమె తలను తెస్తే రూ. 5 కోట్లు ఇస్తామని చిత్రానికి వ్

పద్మావతి చిత్రంలో నటించినందుకు నన్ను చంపేస్తారా... అసలీ దేశంలో ఏం జరుగుతోంది అంటూ పద్మావతి చిత్రంలో నటించిన దీపికా పదుకునె ప్రశ్నించింది. ఒక సినిమాలో నటించినంత మాత్రాన చంపేస్తారా అంటూ ప్రశ్నించింది. ఆమె తలను తెస్తే రూ. 5 కోట్లు ఇస్తామని చిత్రానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నవారు బహిరంగంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా ఈ విషయాన్ని దీపికా పదుకునె స్నేహితురాలు, హాలీవుడ్ నటి రూబీరోస్ తెలుసుకుని షాక్ తిన్నారు. సినిమా నటులకు ఇలాంటి బెదిరింపులు కూడా వస్తాయా అంటూ ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.
 
మరోవైపు "పద్మావతి" చిత్రాన్ని విడుదల చేసేందుకు ఆ చిత్ర టీమ్ వెనుకడుగు వేసింది. బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సంజయ్‌లీలా బన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో దీపిక పదుకొనే, షాహిద్ కపూర్, రణ్‌వీర్ సింగ్‌లు ముఖ్యపాత్రలు పోషించారు. ఈ సినిమాలో రాణి పద్మావతి పాత్రను వక్రీకరించారని ఆరోపిస్తూ రాజ్‌పుత్ కర్ణిసేన తొలి నుంచి ఆందోళన చేస్తోంది.
 
ఈ ఆందోళనలు మరింత ఉధృతం కావడంతో సినిమా రిలీజ్‌ను వాయిదా వేసుకుంది. ఈ చిత్రాన్ని విడుదల చేస్తే థియేటర్లకు నిప్పు అంటిస్తామని హెచ్చరికలు చేస్తున్నారు. అంతేకాకుండా, డిసెంబర్ 1న సినిమా విడుదల కానుండటంతో ఆ రోజు భారత్ బంద్‌కు కూడా పిలుపునిచ్చింది. దీంతో సినిమాను ఆ రోజు విడుదల చేయకూడదని ఆ మూవీ టీమ్ నిర్ణయించింది. తమంతట తాము ఈ నిర్ణయం తీసుకున్నామని సినిమా యూనిట్ వెల్లడించింది. 
 
కొత్త రిలీజ్ డేట్‌ను తర్వాత ప్రకటిస్తామని తెలిపింది. సినిమాకు ఇంకా సీబీఎఫ్‌సీ క్లియరెన్స్ ఇవ్వాల్సి ఉంది. దీనికోసం పద్మావతి టీమ్ దరఖాస్తు చేసుకున్నా.. అది అసంపూర్తిగా ఉందంటూ సీబీఎఫ్‌సీ తిరిగి పంపించేసింది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఇక వాయిదా వేయక తప్పలేదు. 
 
మరోవైపు, ‘పద్మావతి’ రిలీజ్ కాకుండా చూడాలని రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే కేంద్ర సమాచార, ప్రసారశాఖామంత్రి స్మృతీ ఇరానీకి లేఖ రాశారు. సినిమాలో అవసరమైన మార్పులు చేర్పులు చేసేంతవరకు విడుదలకాకుండా అడ్డుకోవాలని అందులో కోరారు.
 
‘పద్మావతి’ సినిమాకు సర్టిఫికెట్ ఇచ్చేముందు సెన్సార్ బోర్డు అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. సెన్సార్ సర్టిఫికెట్ కోసం నిర్మాత పెట్టుకున్న దరఖాస్తు అసంపూర్తిగా ఉందని పేర్కొంటూ సెన్సార్ బోర్డు సినిమాను వెనక్కి పంపిన మరుసటి రోజే వసుంధర ఈ లేఖ రాయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
 
చరిత్రకారులు, సినీ నిపుణులు, రాజ్‌పుట్ కమ్యూనిటీ సభ్యులతో ఓ కమిటీ ఏర్పాటు చేసి వారు సినిమా చూసిన తర్వాత అవసరమైన మార్పులు చేర్పులు చేసేలా చర్యలు తీసుకోవాలని మంత్రికి రాసిన లేఖలో ముఖ్యమంత్రి పేర్కొన్నారు.