శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By DV
Last Updated : సోమవారం, 12 అక్టోబరు 2015 (13:53 IST)

''ప్రేమిస్తే''కు పదేళ్ళు: అజరామర ప్రేమకావ్యంగా నిలిచిపోయింది..!

కరెక్ట్‌గా పదేళ్ళ క్రితం అక్టోబర్ పన్నెండున విడుదలైంది ప్రేమిస్తే చిత్రం. తెలుగు సినిమా చరిత్రలో "మరో చరిత్ర, సీతాకోకచిలుక" ఎలా అయితే మైలు రాళ్లుగా నిలిచాయో అలానే ప్రేమిస్తే చిత్రమూ అజరామర ప్రేమ కావ్యంగా మిగిలిపోయింది. ఒక సారి వెనుదిరిగి చూసుకుంటే ఎన్నో మధుర జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి. ఆ విశేషాలను ఓ సారి గమనిద్దాo.
 
ప్రముఖ దర్శకుడు శంకర్ ఫస్ట్ టైమ్ సోలో ప్రొడ్యూసర్‌గా ఎస్ పిక్చర్స్ బ్యానర్‌లో నిర్మించిన మూవీ ‘కాదల్’. మధురైలో జరిగిన ఓ యథార్ధ సంఘటన ఆధారంగా తెరకెక్కిందీ చిత్రం. శంకర్ శిష్యుడు బాలాజీ శక్తివేల్ ఈ కథను తయారు చేసుకునే, తానే దర్శకత్వం వహించారు. ‘బాయ్స్’ మూవీతో శంకర్ పరిచయం చేసిన భరత్ సోలో హీరోగా నటించిన మొదటి సినిమా ఇదే. ఈ మూవీతోనే హీరోయిన్ సంధ్య, విలన్ దండపాణి సిల్వర్ స్క్రీన్‌కు పరిచయం అయ్యారు. మ్యూజిక్ డైరెక్టర్‌గా జోష్వా శ్రీధర్ ఎంట్రీ ఇచ్చిందీ ఈ చిత్రంతోనే. హృదయాన్ని కట్టిపడేసే కథ, కథనమే కాదు… ఇందులోని మానవీయ విలువలూ ‘సంతోషం’ సురేశ్ కొండేటిని ఆకట్టుకున్నాయి. అందుకే తెలుగు వారి ముందుకు ఈ సినిమాతోనే నిర్మాతగా వెళ్ళాలనే నిర్ణయంతో… ఏటికి ఎదురీది అనువాద హక్కులను సొంతం చేసుకున్నారు.

 
సురేశ్ కొండేటి దృఢ సంకల్పంతో శంకర్ ‘కాదల్’ తెలుగులో ‘ప్రేమిస్తే’గా మారిపోయింది. దీనిని డబ్బింగ్ సినిమాలా కాకుండా నూరు శాతం స్ట్రయిట్ మూవీ అనే భావన కలిగేలా అన్ని జాగ్రత్తలూ తీసుకున్నారు. విఖ్యాత గీత రచయిత స్వర్గీయ వేటూరి రాసిన పాటలు, ప్రముఖ రచయిత శ్రీరామకృష్ణ కలం నుండి జాలువారిన సంభాషణలు, గాన కోకిల జానకమ్మ పాడిన పాటలు… ‘ప్రేమిస్తే’కు దివ్యాభరణాలుగా మారాయి. ఇక నటీనటుల నటనకు ఆకాశమే హద్దు అయ్యింది. ప్రతి ఒక్కరూ ఇది తమ చిత్రమని భావించి… ఓ సుందర, సుమధుర దృశ్య కావ్యానికి రూపకల్పన చేశారు. అందువల్లే పదేళ్ళు గడిచినా ఈ చిత్రం తాలుకు జ్ఞాపకాలు యేదలోతుల్లో పచ్చగానే ఉన్నాయి.
 
సరిగ్గా పదేళ్ళ క్రితం అక్టోబర్ 12న ‘ప్రేమిస్తే’ చిత్రం ప్రేక్షకుల ముందుకు వెళ్ళింది. ఇక అక్కడ నుండి జరిగిందంతా చరిత్ర! ‘ప్రేమిస్తే’ లాంటి సెన్సిటివ్ లవ్ స్టోరీ తెలుగువారికి నచ్చదని చెప్పిన వాళ్ళు, ఇలాంటి సినిమాలు మనవారికి ఎక్కవని హెచ్చరించిన వారి అంచనాలను ఈ చిత్రం తలకిందులు చేసింది. తెలుగువారి ఉత్తమాభిరుచిపై సురేశ్ కొండేటి పెట్టుకున్న నమ్మకానికే అంతిమ విజయం దక్కింది. అనేక కేంద్రాలలో ఈ సినిమా శతదినోత్సవం, రజతోత్సవం జరుపుకుంది. ఈ చిత్రాన్ని యాభై సార్లు, వందసార్లు చూసిన మురిసిపోయిన వాళ్ళు ఎందరో ఉన్నారు!
 
ఈ సినిమా విజయం అందించిన స్ఫూర్తితో మరెన్నో మంచి చిత్రాలను తెలుగు వారి ముందుకు తెచ్చారు సురేష్ కొండేటి. గడిచిన పదేళ్ళలో…  ‘షాపింగ్ మాల్’, ‘నాన్న’, ‘జర్నీ’, ‘రేణుగుంట’, ‘ప్రేమలో పడితే’, ‘పిజ్జా’, ‘క్రేజీ’, ‘మహేశ్’, ‘ప్రేమించాలి’, ‘డా. సలీమ్’ చిత్రాలను తెలుగులో విడుదల చేశారు. విభిన్న కథాంశాలున్న, ఈ వైవిధ్యమైన చిత్రాలన్నీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ‘సంతోషం’ వ్యవస్థాపకుడిగా, సినీ నిర్మాతగానే కాకుండా… తెలుగు సినీ రంగంలోని వివిధ శాఖలలో తనవంతు సేవలను అందిస్తున్న సురేశ్ కొండేటి ఎఫ్.ఎన్.సి.సి. కల్చరల్ కమిటీ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. వ్యక్తి నుండి సంస్థగా అక్కడ నుండి వ్యవస్థగా ఎదుగుతున్నారు సురేశ్ కొండేటి. తాజాగా… మలయాళంలో ఘన విజయం సాధించిన ‘ఉస్తాద్ హోటల్’ చిత్రాన్ని ‘జతగా’ పేరుతో తీసుకురాబోతున్నారు. 
 
ప్రేమిస్తే చిత్రానికి సంబంధించిన మరో విశేషం ఏమంటే నేటి ప్రముఖ దర్శకుడు శ్రీ మారుతి కెరీర్ నిర్మాతగా మొదలైంది ప్రేమిస్తే చిత్రం తోనే. ఈ మూవీకి ఆయన ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా విశేష సేవలు అందించారు. ఆ తర్వాత ఏ ఫిల్మ్ బై అరవింద్ చిత్రానికి సహా నిర్మాతగా వున్నారు. ఈ రోజుల్లో చిత్రంతో దర్శకుడిగా మారిన మారుతి... గడిచిన మూడేళ్ళలో మరెన్నో చిత్రాలకు సహ నిర్మాతగా వ్యవహరించారు. తాజాగా భలే భలే మగాడివోయ్ విజయంతో మారుతి టాప్ డైరెక్టర్స్ కేటగిరిలో చోటు సంపాదించు కున్నారు. సురేష్ కొండేటి... మారుతి స్నేహ బంధం మరిన్ని మంచి చిత్రాల రూపకల్పనకు దారి తీయాలని కోరుకుందాం.