శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By CVR
Last Updated : శుక్రవారం, 3 జులై 2015 (14:54 IST)

రకుల్ ఫిట్‌నెస్ ఫార్ములా.. ఆకు కూర, పుట్టగొడుగుల ఆమ్లెట్ చాలా హెల్తీ...

టాలీవుడ్‌లో క్రేజీ బ్యూటీగా వెలుగుతున్న సుందరి రకుల్ ప్రీత్ సింగ్. సన్నజాజి తీగలాంటి నడుముతో, ఆకట్టుకునే పరువాలతో చక్కని చుక్కలా మెరిసే ఈ స్లిమ్ బ్యూటీ తన ఫిట్‌నెస్ సీక్రెట్ గురించి చెబుతూ.. తాను ప్రతి రోజూ వ్యయామం తప్పనిసరిగా చేస్తానంటోంది. అదే విధంగా తాను తీసుకునే ఆహారంలో కూడా కొన్ని నియమాలను పాటిస్తున్నట్టు తెలుపుతోంది. ఆమె తీసుకునే డైట్ వివరాలు...
 
ప్రతి రోజూ ఉదయం పూట ఏడు గంటలకే బ్రేక్ ఫాస్ట్ చేస్తాను. అయితే ఆ సమయంలో ఆయిల్‌తో చేసిన టిఫిన్‌‌ల జోలికి వెళ్లను. స్కిమ్‌డ్ మిల్క్‌తో ఓట్స్ తీసుకుంటాను. అలాగే, గుడ్డులోని తెల్ల సొనతో చేసిన మూడు ఆమ్లెట్‌‌లు తింటాను. బ్రేక్ ఫాస్ట్ చేశాక మూడు గంటల తర్వాత అంటే సుమారు పది గంటల సమయంలో ఏదైనా ఫ్రూట్స్ తీసుకుంటాను. అయితే అరటిపండు మాత్రం వారానికి రెండు సార్లే తింటాను. ఆ తర్వాత మళ్లీ ఆకలి అనిపిస్తే 12 గంటలకు గుప్పెడు డ్రై ఫ్రూట్స్ తింటాను. 
 
ఇక మధ్యాహ్నం భోజన సమయానికి అంటే సరిగ్గా ఒంటి గంటకు కిన్వా అనే బియ్యంతో వండిన అన్నం, పప్పు, స్టీమ్డ్ చికెన్ లేక ఫిష్ తింటాను. వారం మొత్తం మధ్యాహ్నం పూట దాదాపు ఇదే మెనూనే ఉంటుంది. ఎప్పుడైనా పండుగ రోజుల్లోనో కాస్త మారుతుంది. భోజనం తర్వాత రెండు గంటలకు కొన్ని ఫ్రూట్స్ తింటాను. కొన్ని సమయాల్లో స్ట్రా బెర్రీలను ముక్కలుగా చేసి వాటిని ఫ్రిజ్‌లో పెట్టుకుని సాయంత్రం నాలుగు గంటలకు స్నాక్స్‌లా తింటాను. ఆ తర్వాత పొద్దుగూసే సమయంలో ఆరు గంటలకు వేరేమైనా పండ్లు తింటాను. 
 
ఇక రాత్రి భోజనం విషయానికి వస్తే, నిద్రపోవడానికి మూడు, నాలుగు గంటలకు ముందే డిన్నర్ తినేస్తాను. గ్రిల్డ్ ఫిష్ ఒకటి లేదా రెండు రోటీలు, పాలక్, పప్పు, ఇవన్నీ తీసుకుంటాను. ఒక వేళ ఇవేవీ దొరకని పరిస్థితిలో ఒక ఆమ్లెట్ తయారు చేయించి, రోటీలో రోల్ చేసి తింటాను. ఆమ్లెట్‌ను ఆకు కూర, పుట్టగొడుగులు కలిపి తయారు చేయిస్తాను. ఇది చాలా హెల్దీగా ఉంటుందని రకుల్ చెప్పుకొచ్చింది.