శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By DV
Last Updated : శుక్రవారం, 2 అక్టోబరు 2015 (07:59 IST)

బ్రూస్ లీ కోసం ఎగబడేవాడిని.... ఇంకా ఇవన్నీ... రాంగోపాల్ వర్మ

నేను బ్రూస్ లీకి అతి పెద్ద అభిమానిని. నా ఈ “బ్రూస్ లీ” అనే చిత్రం బ్రూస్ లీ అభిమాని కధ. అందుకే దీని టైటిల్ “బ్రూస్ లీ”. అంటున్నారు రాంగోపాల్ వర్మ.
 
హైదరాబాద్ లోని పంజాగుట్ట కాలనీలోని మా యువకులమంతా “ఎంటర్ ద డ్రాగన్” అనే ఒక కొత్త సినిమా రిలీజ్ అవుతుందన్న వార్త వినగానే ఉప్పొంగిపోయాము. దానిలో గగుర్పొడిచే యాక్షన్ సన్నివేశాలు ఉంటాయని ట్రైలర్ ద్వారా అర్థమయ్యింది. ఆ సినిమా చూడటానికి ముందు నేను కరాటే గురించిగాని కుంగ్ ఫూ గురించిగాని విననేలేదు. కానీ ఆ సినిమా చూసిన తరువాత అందులోని బ్రూస్ లీ నాకు పిచ్చెక్కించేశాడు.
 
అతను నన్ను మంత్రముగ్దుడిని చేశాడు అని అనటంలో ఎంతమాత్రం అతిశయం లేదు. “ఎంటర్ ద డ్రాగన్” సినిమా నేను 7 కిలోమీటర్లు సైకల్ తొక్కుకుంటూ శ్రీనివాసా 35 mmలో 17 సార్లు చూశాను. ఆ తరువాత  “రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్” 23 సార్లు చూశాను. ఆ తరువాత బ్రూస్ లీకి సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని తెలుసుకోవాలనే ఉత్సుకత నాలో పెరగసాగింది. 
 
బ్రూస్ లీ అందరికీ ఒక స్వప్నంగా మారాడు. పట్టుదలతో కృషి చేస్తే ఎంతటి స్వప్నాన్ని అయినా సాకారం చేసుకోవచ్చు అని బ్రూస్ లీ నిరూపించాడు. అయాన్ రాండ్ రచించిన “ఫౌంటెన్ హెడ్” లోని హోవార్డ్ రోయార్క్ నిజ జీవితంలోకి నడుచుకుంటూ వస్తే అతనే బ్రూస్ లీ అనే అంతగా నేను తనని నమ్మాను. “ఎంటర్ ద డ్రాగన్” సినిమా రిలీజ్ అయిన తరువాత దాని ప్రభావం వల్ల ప్రపంచంలో కొన్ని వేల మార్షల్ ఆర్ట్స్ స్కూల్స్ మొదలయ్యాయి. అలాంటి మార్షల్ ఆర్ట్స్ స్కూల్‌కి వెళ్ళి చేరిన లక్షల్లో నేను కూడా ఒకడిని. ఆ తరువాత కొన్ని రోజులకే బ్రూస్ లీ మాదిరిగా అవ్వాలనే నా స్వప్నాన్ని విడిచిపెట్టి శారీరక బాధ  తక్కువగా ఉండే ఫిల్మ్ మేకింగ్‌లో సెటిల్ అయ్యాను.
 
మార్షల్ ఆర్ట్స్ వదిలేసినప్పటికి, బ్రూస్ లీ గురించి, అతని ఆలోచనా విధానం గురించి తెలుసుకోవడం వదలలేదు. బ్రూస్ లీ స్టైల్ చాలా విధాలుగా నా సినిమాలపైనా, నా వ్యక్తిగత జీవితం పైన తన ప్రభావం చూపించింది. “పోరాటం అనే కళని అర్ధం చేసుకోవటం నిర్ణీతమైన విధానాలని తొలగించి, ఆ విధాన క్రమాలకి అవతల కళలోని భావాన్ని స్వతంత్రంగా వ్యక్తపరచటంలోనే నిగూఢమై ఉంటుంది. చారిత్రక మూలాలని పక్కకి పెట్టి కొత్త పద్ధతులని సృష్టించడం మనిషి బాధ్యత. చారిత్రక మూలాలని ప్రశ్నించకూడని గొప్ప విషయలుగా భావించకూడదు. ఎప్పటి నుంచో అవలభించబడుతున్న విధానాల కన్నా కొత్త పద్ధతులు సృష్టించే మనిషి వాటికన్నా ముఖ్యం” అని బ్రూస్ లీ చెప్పాడు.
 
బ్రూస్ లీ చెప్పిన పైమాటల వల్ల మిగిలిన వారికన్నా భిన్నంగా ఉండటం ఎంతమాత్రం తప్పు కాదు అని భావించసాగాను. భిన్నంగా ఉండటం అంటే వ్యక్తిగతంగా ఉండటమే. వ్యక్తిగతంగా ఒక మార్షల్ ఆర్టిస్ట్‌గా ఉండలేకపోయినప్పటికి నేను వ్యక్తిగతంగా ఒక మనిషిగాను, ఒక ఫిల్మ్ మేకర్‌గాను ఉండటానికి డిసైడ్ అయ్యాను. “నేను ఎలాంటి పద్దతులు లేని ఒక కొత్త పద్దతిని” అని బ్రూస్ లీ చెప్పాడు. అందులో నుంచే వచ్చిందే ఎలాంటి ఇజమ్ లేని రాముయిజం.
 
ఇక విషయానికి వస్తే బ్రూస్ లీ ఎంతో మందికి ప్రేరణగా నిలవటానికి నేను అర్ధం చేసుకున్న కారణాలతో ఒక సినిమా తీయాలనే ధ్యేయంతో ఈ కధని తయారు చేసుకున్నాను. సినిమాగా ఎక్కించేస్తా అని చెప్పారు రాంగోపాల్ వర్మ.