శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : సోమవారం, 28 నవంబరు 2016 (17:52 IST)

నడిగర్ సంఘం వార్.. విశాల్ వర్సెస్ శరత్ కుమార్ వర్గీయులు.. అవన్నీ ప్రేమలేఖలా అంటూ రాధిక ఫైర్

త‌మిళ సినీ ప‌రిశ్ర‌మ‌లో న‌డిగ‌ర్ సంఘానికి సంబంధించిన గొడ‌వ‌లు ఇప్ప‌ట్లో స‌ద్దుమ‌ణిగేలా లేవు. సంఘం మాజీ అధ్య‌క్షుడు శ‌ర‌త్‌కుమార్‌కీ, ప్ర‌స్తుత కార్య‌వ‌ర్గానికీ మ‌ధ్య వార్ ఇప్ప‌టికీ కొన‌సాగుతూనే ఉంది.

త‌మిళ సినీ ప‌రిశ్ర‌మ‌లో న‌డిగ‌ర్ సంఘానికి సంబంధించిన గొడ‌వ‌లు ఇప్ప‌ట్లో స‌ద్దుమ‌ణిగేలా లేవు. సంఘం మాజీ అధ్య‌క్షుడు శ‌ర‌త్‌కుమార్‌కీ, ప్ర‌స్తుత కార్య‌వ‌ర్గానికీ మ‌ధ్య వార్ ఇప్ప‌టికీ కొన‌సాగుతూనే ఉంది. నడిగర్ సంఘం మాజీ అధ్యక్షుడు శరత్ కుమార్, ప్రధాన కార్యదర్శి రాధారవి పేర్లను తొలగించడంపై శరత్ కుమార్ వర్గీయులు ఫైర్ అవుతున్నారు. దీనిపై ట్విట్టర్లో శరత్ కుమార్ భార్య, నటీమణి రాధికా శరత్ కుమార్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
రాధారవి, శరత్ కుమార్‌లను తొలగించడం ఎంతవరకు సబబు అంటూ ప్రశ్నించారు. నడిగర్ సంఘం నిబంధనల ప్రకారం శరత్ కుమార్, రాధారవిల సస్పెన్షన్‌ జరగలేదని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 
 
దక్షిణ భారత నటీనటుల సంఘం సర్వసభ్య సమావేశంలో సంఘం మాజీ అధ్యక్షుడు శరత్‌కుమార్‌, మాజీ ప్రధాన కార్యదర్శి రాధారవిలపై శాశ్వత వేటు పడటంపై రాధికా ఫైర్ అయ్యారు. నడిగర్‌ సంఘంలో నేను శాశ్వత సభ్యురాలిని. కనీసం నాకు సమాచారం కూడా ఇవ్వకుండా పనికానిచ్చేశారని ఫైర్ అయ్యారు. సంఘంలో ఒకరిని తొలగించాలంటే 21 రోజుల నోటీస్‌ ఉండాలి. మీరు దాన్ని ఉల్లఘించారు... ప్రస్తుత కోశాధికారి సూర్య సోదరుడు, నటుడు కార్తీని ఉద్దేశించి ట్విట్టర్లో రాధికా శరత్ కుమార్ ప్రశ్నాస్త్రాలు సంధించారు. 
 
బుల్లి తెర నిర్మాతలు లిస్టెడ్‌ కంపెనీని నడపడం కుదురుతుందా? చెప్పండి. సర్వసభ్య సమావేశం వేదికను మార్చడానికి ఏ కమిషనర్‌ మీకు అనుమతి ఇచ్చారు. ఆ అనుమతి పత్రాన్ని నేను చూడాలి. ఇరు పార్టీల మధ్య చర్చ లేకుండా సంఘం మాజీ అధ్యక్షుడిని ఎలా తొలగిస్తారు. ఇది కోర్టు ధిక్కారం కిందకు రాదా?' అని రాధిక ప్రశ్నించారు. దీనిపై కోర్టును ఆశ్రయించేందుకైనా వెనుకాడనని చెప్పారు. 
 
శరత్ కుమార్ నడిగర్ సంఘం అధ్యక్షుడిగా వ్యవహరించిన సమయంలో తాజ్ హోటల్‌లో నటుడు నాజర్ వద్ద సరైన లెక్కలకు సంబంధించిన వివరాలను సమర్పించింది నిజం కాదా? అవన్నీ ప్రేమ లేఖలా అంటూ రాధికా తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో ఆధారాలు తమవద్ద ఉన్నాయని రాధికా స్పష్టం చేశారు. 
 
శరత్ కుమార్ నడిగర్ సంఘం అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అవినీతికి పాల్పడినట్లు విశాల్ ఆరోపించారు. అందుకు సంబంధించిన ఆధారాలను కూడా సమర్పిస్తామన్నారు. అయితే ఇంతవరకు శరత్ కుమార్‌పై ఆరోపణలకు సంబంధించిన ఆధారాలను విశాల్ విడుదల చేయలేదని రాధిక గుర్తుచేశారు.


నడిగర్ సంఘం శివాజీ గణేశన్‌చే స్థాపించబడిందని.. ఆయన కుటుంబీకులు మాత్రమే నడిగర్ సంఘ బాధ్యతలను నిర్వర్తించాలనే నియమాన్ని నటుడు ఎస్ఎస్ఆర్ అప్పట్లోనే తొలగించారని.. దాని సంగతేంటో అసలు చరిత్రేంటో తెలుసుకోవాలని కార్తీకి రాధికా సూచించారు. 
 
అంతేగాకుండా నడిగర్ సంఘం స్థాపన, విధులు, నియమాలేంటో తండ్రి శివకుమార్‌ను అడిగి తెలుసుకోవాల్సిందిగా కార్తీకి ఆమె హితవు పలికారు. ఇంకా శరత్ కుమార్, రాధారవిల సస్పెన్షన్‌పై వివరణ ఇవ్వాల్సిందేనని.. వారిపై వచ్చిన ఆరోపణలకు తగిన సాక్ష్యాధారాలను బయటపెట్టాలని.. లేని పక్షంలో చట్టపరమైన చర్యలు సిద్ధమని రాధికా సవాల్ విసిరారు. 
 
ఇకపోతే.. నటీనటుల సంఘం 63వ సర్వసభ్య సమావేశాన్ని ఆదివారం లయోలా కళాశాల ప్రాంగణంలో నిర్వహించాలని తొలుత నిర్ణయించారు. కొన్ని కారణాల వల్ల సంఘం కార్యలయ ప్రాంగణంలోనే నిర్వహించనున్నట్లు విశాల్‌ ప్రకటించారు. ఈ నేపథ్యంలో గుర్తింపు కార్డులు ఉన్నవారిని మాత్రమే లోపలకు అనుమతించారు. పాత నిర్వాహకుల మద్దతుదారులు పలువురు లోపలకు వెళ్లేందుకు యత్నించగా వారిని అనుమతించలేదు. దీంతో శరత్ కుమార్, విశాల్ వర్గీయుల మధ్య మధ్య వాగ్వాదం ముదిరి ఘర్షణకు దారి తీసింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది.