మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By dv
Last Updated : శనివారం, 21 జనవరి 2017 (16:32 IST)

ఆయన నటనతో పోల్చలేను.. దర్శకుడి చెప్పింది చేశాను... సౌరవ్‌ జైన్‌

బాలీవుడ్‌లో మహాభారత్‌ సీరియల్‌లో కృష్ణుడిగా, విష్ణువుగా.. నటించడమేకాకుండా 'సావ్‌ధాన్‌ ఇండియా'కు యాంకర్‌గా పనిచేసిన సౌరవ్‌ జైన్‌... తెలుగులో శ్రీవేంకటేశ్వరస్వామి పాత్రలో కన్పించనున్నాడు. అక్కినేని నాగా

బాలీవుడ్‌లో మహాభారత్‌ సీరియల్‌లో కృష్ణుడిగా, విష్ణువుగా.. నటించడమేకాకుండా 'సావ్‌ధాన్‌ ఇండియా'కు యాంకర్‌గా పనిచేసిన సౌరవ్‌ జైన్‌... తెలుగులో శ్రీవేంకటేశ్వరస్వామి పాత్రలో కన్పించనున్నాడు. అక్కినేని నాగార్జున, కె.రాఘవేంద్రరావు కాంబినేషన్‌లో వస్తోన్న మరో భక్తి కథా చిత్రం 'ఓం నమో వేంకటేశాయ'. సాయికృపా ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై.లి. బ్యానర్‌పై ఎ.మహేష్‌ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఫిబ్రవరి 10న సినిమా విడుదలవుతుంది. ఈ సందర్భంగా ప్రమోషన్‌లో భాగంగాహైదరాబాద్‌లో వున్న ఆయనతో చిట్‌చాట్‌. 
 
* 'ఓం నమో వేంకటేశాయ' చిత్రంలో అవకాశం ఎలా వచ్చింది? 
హిందీ సీరియల్‌ మహాభారత్‌లో కష్ణుడు పాత్ర చేశాను. అది చూసిన డైరెక్టర్‌కి నచ్చడంతో ఫోన్‌లో తన సినిమా గురించి అడిగారు. శ్రీవేంకటేశ్వరస్వామి పాత్రంటే చాలా పవిత్రమైన పాత్ర. దాని గురించి ముఖాముఖి మాట్లాడితేనే అవగాహన వస్తుందని అనడంతో ఆయన హైదరాబాద్‌ పిలిపించారు. దర్శకుడు రాఘవేంద్రరావు, నాగేశ్వరరావు కూడా కథ చెప్పారు. హథీరామ్‌బాబాగా నాగార్జున నటిస్తున్నారు. పాత్ర బాగా నచ్చడంతో నటించడానికి అంగీకరించా.
 
* రాఘవేంద్రరావు, నాగార్జున చిత్రాలు చూశారా?
ఈ చిత్రం అనుకున్నాక.. రాఘవేంద్రరావు చేసిన 'అన్నమయ్య' చూశాను. బాగా తీశారు. నాగార్జున 'శివ' చూశాను.
 
* అన్నమయ్యలో వేంకటేశ్వరునిగా సుమన్‌ నటించారు. ఇందులో మీరు నటించారు. ఇద్దరికి వ్యత్యాసం ఏమైనా కన్పించిందా?
అలా నేను చెప్పలేను. కనీసం కంపేర్‌ కూడా చేయలేను. ఆ పాత్రకు ఆయన సరిపోయారు. ఈ పాత్రకు నన్ను ఎంపిక చేశారు. ఏదైనా దర్శకుడు చెప్పినట్లు చేశానంతే.
 
* మీరు బుద్ధిస్ట్‌ కదా.. వేంకటేశ్వరునిగా చేయడం ఎలా అనిపించింది?
పుట్టుకతోనే మాది జైన్‌ కుటుంబం. అయినా అన్ని మతాలను, దేవుళ్ళను నమ్ముతాను. గౌరవిస్తాను. నటుడిగా దేవునిపాత్ర రావడం అదృష్టమే.
 
* సీరియల్స్‌, సినిమాల్లో మీరు గమనించిన తేడాలేమిటి? 
సీరియల్‌ మేకింగ్‌తో పోల్చితే సినిమా మేకింగ్‌ అనేది డిఫరెంట్‌గా ఉంటుంది. సీరియల్‌ను చాలా ఫాస్ట్‌గా చేస్తారు. నటన పరంగా ఏ మార్పు గమనించలేదు.
 
* తెలుగు మాట్లాడటాన్ని ఎలా మెనేజ్‌ చేశారు? 
రాఘవేంద్రరావు నన్ను కలిసినప్పుడు వెంకటేశ్వరస్వామి రోల్‌కు నేను న్యాయం చేయలేనేమోనని అన్నాను. అయితే డైరెక్టర్‌, సౌరవ్‌.. అంతా నేను చూసుకుంటానని చెప్పారు. ఆయన అన్నట్లుగానే నా రోల్‌కు సంబంధించిన వర్క్‌ అంతా ముందుగానే ఎలా డైలాగ్స్‌ చెప్పాలి. అనే విషయాలపై ఆయన దగ్గరుండి చూసుకున్నారు. దీంతో పాటు తెలుగు, ఇంగ్లీష్‌ తెలిసిన ట్యూటర్‌ను కూడా పెట్టారు. సన్నివేశాలను ఎలా చేయాలో ప్రాక్టీస్‌ చేసేవాడిని. 
 
* మీ కుటుంబంలో ఎవరైనా నటులున్నారా? 
లేరు. మా అమ్మ లాయర్‌. నాన్న బిజినెస్‌ చేసేవారు. నా భార్య ఐటీలో ఉద్యోగి. నేను ఢిల్లీలో పుట్టి పెరిగాను. ఐటీ గ్రాడ్యుయేషన్‌ను ఢిల్లీలో చేశాను. పూణేలో ఎం.బి.ఎ చేశాను. మోడలింగ్‌ చేయడంతో టీవీ రంగం వైపు అడుగులేశాను.
 
* పాత్ర పరంగా ఎలాంటి కేర్‌ తీసుకున్నారు? 
అప్పటికే కృష్ణుడు పాత్ర చేయడంతో రాఘవేంద్రరావు కథ చెప్పగానే వెంకటేశ్వరస్వామి గురించి ఒక అవగాహన కలిగింది. సెట్స్‌లోకి రాగానే రాఘవేంద్రరావు చెప్పిన విధంగా ఫాలో అయిపోయానంతే.
 
* దేవుడిని నమ్ముతారా? 
నమ్ముతాను.. అయితే ఏదో ఒక దేవుడిని నమ్మి ఓ పద్ధతిలో ఫాలో అవను. అందరి దేవుళ్ళను నమ్ముతాను. దేవుడిని మించిన శక్తి ఏదీ లేదని నమ్ముతాను.
 
* రాఘవేంద్రరావు దర్శకత్వంలో పని చేయడం ఎలా అనిపించింది? 
మరచిపోలేని అనుభూతినిచ్చింది. ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించిన లెజెండ్‌ ఆయన. లైఫ్‌ టైమ్‌లో ఒకసారి మాత్రమే వచ్చే అవకాశం. వర్క్‌ పట్ల ప్యాషన్‌ ఉన్న డైరెక్టర్‌. ఈ వయస్సులో కూడా ఆయన కొత్తగా ఆలోచిస్తున్నారు. చాలా క్లారిటీతో ఓ సీన్‌ను ఎలా చేయాలో అలా నటీనటుల నుండి రాబట్టుకుంటారు.
 
* మరి నాగార్జునతో పనిచేయడం ఎలా అనిపించింది? 
నటుడుగానే కాదు, వ్యక్తిగా కూడా ఎలా ఉండాలో ఆయన నుండి నేర్చుకున్నాను. చాలా పెద్ద స్టార్‌ అయినా కలిసిపోయే తనం, ఇతరులను గౌరవించే విధానం ఆకట్టుకున్నాయి.
 
* అనుష్కతో సీన్స్‌ ఏమైనా వున్నాయా?
ఆమె గొప్ప నటి. కానీ ఈ సినిమాలో ఆమెతో కలిసిన సీన్లు లేవు.
 
* దేవుడి పాత్రలే పోషించడంతో వ్యక్తిగతంగా మీపై ప్రభావం కన్పించిందా?
పెద్దగా లేదనే చెప్పాలి. కానీ సెట్లోకి వెళితే వెంటనే ఆ పాత్ర, ఆ వాతావరణం అక్కడ క్రియేట్‌ అవుతుంది. అయితే నేను చాలా సాఫ్ట్‌గా వుంటాను. అందుకే తేడా తెలీలేదు.
 
* ఇలాంటివే చేస్తారా? ఇతర పాత్రలు పోషిస్తారా?
ఇతర పాత్రలు పోషించాను. ఇరానీ సినిమాలో విలన్‌గా కూడా నటించాను.
 
* హైదరాబాద్‌ ఎలా వుంది? 
ఎంతటివారైనా ఇక్కడి వాతావారణానికి అలవాటు పడిపోవాల్సిందే. టాలీవుడ్‌లో చాలా మంచి వాతావరణం కనపడుతుంది. యూనిట్‌లో అందరూ నాకెంతో సపోర్ట్‌ చేసి సెట్‌లో నన్ను కంఫర్ట్‌బుల్‌గా ఉంచారు.
 
* కొత్త చిత్రాలేమైనా కమిట్‌ అయ్యారా?
ఇంకా కాలేదు. ఈ సినిమా విడుదలయ్యాక.. నా నటన చూసి ఎవరైనా అవకాశాలు ఇస్తారేమో చూడాలి.