గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 15 ఫిబ్రవరి 2017 (16:49 IST)

పళని వద్దు.. పన్నీరే ముద్దు.. చిన్నమ్మకు జైలులో కంపెనీ ఇస్తున్న పళని బంధువు..?

తమిళనాడు సీఎం అభ్యర్థిగా శశికళ వర్గంలో ఉన్న ఎడప్పాడి పళనిసామి బంధువులు తక్కువేం తినలేదు. పళనిసామి దగ్గరి బంధువు చంద్రకాంత్ రామలింగం బ్లాక్ మనీని కొత్త రెండువేల నోట్లుగా మార్చి ఐటీ శాఖకు చిక్కాడు. బ్లా

తమిళనాడు సీఎం అభ్యర్థిగా శశికళ వర్గంలో ఉన్న ఎడప్పాడి పళనిసామి బంధువులు తక్కువేం తినలేదు. పళనిసామి దగ్గరి బంధువు చంద్రకాంత్ రామలింగం బ్లాక్ మనీని కొత్త రెండువేల నోట్లుగా మార్చి ఐటీ శాఖకు చిక్కాడు. బ్లాక్ మనీ కేసులో అరెస్టు అయిన చంద్రకాంత్ రామలింగం ప్రస్తుతం బెంగళూరులోని పరప్పన అగ్రహార జైల్లో కాలం గడుపుతున్నారు. ప్రస్తుతం అదే జైలుకు చిన్నమ్మ కూడా వెళ్ళింది. 
 
అక్రమాస్తుల కేసులో సుప్రీం కోర్టు నాలుగేళ్ల జైలు శిక్ష విధించడంతో శశికళ కోర్టుకు లొంగిపోయేందుకు రోడ్డు మార్గాన బెంగళూరుకు వెళ్ళిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చిన్నమ్మే కాదు.. శశికళ ప్రతిపాదించిన పళని సామి బంధువులు కూడా అన్నాడీఎంకేలో పార్టీ పుణ్యంతో బాగానే తింటున్నారని వార్తలు వస్తున్నాయి. దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఆదరణతో శశికళ తన కుటుంబీకులను, బంధువులను ఎలా పైస్థాయికి తెచ్చిందో.. పళనిసామి కూడా  ఆమె బాటలోనే నడుస్తారేమోనని రాజకీయ పండితులు జోస్యం చెప్తున్నారు. 
 
తమిళనాడు సీఎం అభ్యర్థి (శశికళ వర్గం) ఎడప్పాడి పళనిసామి, ఈరోడ్‌కు చెందిన ప్రముఖ కాంట్రాక్టర్ రామలింగం కుమారుడు చంద్రకాంత్ రామలింగం ఒకే ఇంటిలో అక్కా, చెల్లిని వివాహం చేసుకున్నారు. పెద్ద నోట్లు రద్దు అయిన తరువాత ఈ రోడ్డులోని రామలింగం ఇంటిపై ఆదాయ పన్ను శాఖ అధికారులు దాడులు చేశారు. అదే సమయంలో బెంగళూరులో నివాసం ఉంటున్న రామలింగం కుమారుడు చంద్రకాంత్ రామలింగం ఇంటిలో ఐటీ అధికారులు సోదాలు చేశారు. 
 
ఆ సమయంలో అప్పుడే చలామణిలోకి వచ్చిన రూ.6 కోట్ల విలువైన రూ. 2,000 నోట్లను ఐటీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో అరెస్టు అయిన చంద్రకాంత్ రామలింగం ప్రస్తుతం పరప్పన అగ్రహార జైల్లో విచారణ ఖైదీగా శిక్ష అనుభవిస్తున్నాడు. ఇక పళనిసామి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కుటుంబంతో సన్నిహిత సంబంధాలుండటంతో అలాంటి వ్యక్తిని సీఎం చేయకూడదని పన్నీర్ వర్గం ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. దీనిపై ఫిర్యాదు చేసేందుకు పన్నీరు వర్గీయులు గవర్నర్ అపాయింట్‌మెంట్ కూడా కోరారని తెలుస్తోంది. 
 
ఇంకా అన్నాడీఎంకే పార్టీ పగ్గాలు చిన్నమ్మ తన మేనల్లుడు దినకరన్‌కు ఇవ్వడంపై పార్టీలో తిరుగుబాటు మొదలైంది. అమ్మ వెలివేసిన వారిని చిన్నమ్మ చేరదీయడం ఎంతవరకు సబబు అంటూ వారు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే దినకరన్‌కు నిరసనగా శశివర్గం ఎమ్మెల్యేలు పన్నీర్ చెంత చేరిపోవాలని భావిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఇంకా పళనిసామిని పక్కనబెట్టి మిస్టర్ ఫర్‌ఫెక్ట్ పన్నీరును బలపరీక్షలో గెలిపించాలని సెల్వం వర్గీయులు విజ్ఞప్తి చేస్తున్నారు.