గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , సోమవారం, 15 మే 2017 (03:07 IST)

అందచందాల ప్రదర్శనకు వీరు ఆమడ దూరం.. కొత్తదనం కోసం పడరాని పాట్లు

హీరోయిన్ల మేని సొంపులు చూపించి వాటితోనే సొమ్ము చేసుకోవాలనే దుర్మార్గపు ఆలోచనలు ఇప్పుడు విజయాలకు హామీ ఇవ్వడం లేదు. కేవలం కథాబలం, పాత్రల బలం ఉన్న చిత్రాలు అవి ఎంత చిన్నవైనా సరే ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ నేపథ్యంలో దర్శక నిర్మాతల వైఖరి మాత్రమే

టాలీవుడ్, కొలీవుడ్,  మల్లువుడ్, శాండల్ వుడ్, బాలీవుడ్.. ఇలా ఏ చిత్రపరిశ్రమ కేసి చూసినా హీరోయిన్ల మేని సొంపులు చూపించి వాటితోనే సొమ్ము చేసుకోవాలనే దుర్మార్గపు ఆలోచనలు ఇప్పుడు విజయాలకు హామీ ఇవ్వడం లేదు. కేవలం కథాబలం, పాత్రల బలం ఉన్న చిత్రాలు అవి ఎంత చిన్నవైనా సరే ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ నేపథ్యంలో దర్శక నిర్మాతల వైఖరి మాత్రమే కాకుండా ఒంటి అందచందాలు మాత్రమే చూపిస్తూ పోతే అసలుకే మోసం వస్తుందన్న గ్రహింపు, భయం మన హీరోయిన్లకు కూడా కలుగుతున్నట్లుంది. గ్లామర్‌కి భిన్నంగా బరువైన పాత్రలు నటించి కూడా సత్తా చూపించవచ్చని ఇటీవల కాలంలో అనుష్క సోదాహరణ పూర్వకంగా నిరూపించింది. ఇప్పుడీ జబ్బు కమల్ హసన్ కుమార్తె, ప్రముఖ హీరోయిన్ శ్రుతి హసన్‌కి కూడా అంటుకున్నట్లుంది.
 
అనుష్క ఆదిలో కోలీవుడ్, టాలీవుడ్‌ అన్న తేడా లేకుండా అందాలారబోతలో దుమ్మురేపారు. సుందర్‌. సీ దర్శకత్వంలో అనుష్క నటించిన ఈత దుస్తుల దృశ్యాలు ఇప్పటికీ గూగుల్‌లో సందడి చేస్తూనే ఉంటాయి. అంతగా అందాల మోత మోగించిన అనుష్క ఆ తరువాత చారిత్రిక కథా చిత్రాల్లో నటిస్తూ వీరనారి రుద్రమదేవిగా రణభూమిలో కదం తొక్కారు. అందుకు కత్తిసాము, గుర్రపుస్వారీ లాంటి చాలా కసరత్తులు చేశారు. అదే విధంగా కథా పాత్ర డిమాండ్‌ మేరకు సుమారు 80 కిలోల వరకూ బరువు పెరిగా ఇంజి ఇడుప్పళగి చిత్రంలో నటించారు. ఇక బాహుబలి–2లో కత్తి చేత పట్టి సాహస విన్యాసాలు చేశారు. 
 
మరోవైపు క్రేజీ నటి శ్రుతీహాసన్‌ కూడా తొలి చిత్రం లక్‌ (హింది) లోనే గ్లామర్‌ విషయంలో ఎల్లలు దాటారు. అలాంటి నటి ఇప్పుడు గ్లామర్‌ ఇమేజ్‌ను బ్రేక్‌ చేయడానికి సిద్ధం అయ్యారనిపిస్తోంది. అనుష్కతో ఈత దుస్తులు ధరింపజేసిన అదే సుందర్‌.సీ ఇప్పుడు శ్రుతీహాసన్‌ చేత కత్తి పట్టిస్తున్నారు. ఆయన తాజాగా బాహుబలి చిత్రం తరహాలో సంఘమిత్ర పేరుతో చారిత్రక కథా చిత్రాన్ని తెరకెక్కించనున్న విషయం అందులో శ్రుతీహాసన్‌ యువరాణిగా నటించనున్న విషయం తెలిసిందే. జయంరవి, ఆర్య కథానాయకులుగా నటిస్తున్న ఈ చిత్రం కోసం శ్రుతీహాసన్‌ లండన్‌లో కత్తి యుద్ధంలో శిక్షణ పొందారు.
 
అదే విధంగా తను నటిస్తున్న తాజా హిందీ చిత్రం బెహన్‌ హోగి తేరి కోసం నటి అనుష్క అంత కాకపోయినా పాత్ర డిమాండ్‌ మేరకు బరువు పెరిగి నటిస్తున్నారట. ఇందులో తీయని పదార్థం కంట పడితే చాలు లొట్టలేసుకుంటూ తినేసే యువతిగా నటిస్తున్నారట. సినిమా ఆధునిక పుంతలు తొక్కుతున్న తరుణంలో ఇది చాలదు. అంతకు మించి అని ప్రేక్షకులు కోరుకుంటున్నారు. వారిని సంతృప్తి కోసం కథానాయకుడైనా, నాయకి అయినా కొత్తదనం కోసం ఇలా తమ వంతు శ్రమించాల్సిందే. 
 
మొత్తంమీద చూస్తే మేని అందాలు చూపిస్తూ బతుకీడ్చుదామనుకుంటే ఇక చెల్లదని హీరోయిన్లకు స్పష్టమైనట్లే కదా..