మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : ఆదివారం, 9 జులై 2017 (11:52 IST)

తమిళనాడులో పెరిగిన టిక్కెట్ ధరలు.. బోసిపోయిన థియేటర్లు

జీఎస్టీ పన్ను విధానం పుణ్యమాని తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా టిక్కెట్ ధరలు పెరిగాయి. ఫలితంగా సినీ థియేటర్లన్నీ ప్రేక్షకులు లేక బోసిపోయి కనిపిస్తున్నాయి. పైగా, ఈ వారం ఒక్క కొత్త చిత్రం కూడా విడుదల కాకపోవ

జీఎస్టీ పన్ను విధానం పుణ్యమాని తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా టిక్కెట్ ధరలు పెరిగాయి. ఫలితంగా సినీ థియేటర్లన్నీ ప్రేక్షకులు లేక బోసిపోయి కనిపిస్తున్నాయి. పైగా, ఈ వారం ఒక్క కొత్త చిత్రం కూడా విడుదల కాకపోవడంతో వీకెండ్‌ను తమ ఇళ్ళలోనే ఎంజాయ్ చేస్తున్నారు.
 
తమిళనాడు వ్యాప్తంగా మొత్తం 1127 థియేటర్లు ఉన్నాయి. వీటిలో 6.14 లక్షో సీట్లు ఉన్నాయి. ఈ థియేటర్లలో శుక్రవారం నుంచి ఆదివారం వరకు వంద శాతం సీట్లు ఫుల్‌ అవుతుంటాయి. మిగిలిన రోజుల్లో 70 నుంచి 80 శాతం మేరకు ప్రేక్షకులు వస్తుంటారు.
 
అయితే, దేశవ్యాప్తంగా జీఎస్టీ విధానం అమల్లోకి రాకముందు వారాంతాల్లో ఈ థియేటర్ల ముందు హౌస్‌ఫుల్ బోర్డులు దర్శనమిస్తుండేవి. కానీ, గత వారం రోజులుగా ఈ పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు. చివరకు సెలవు రోజులైన శని, ఆదివారాల్లో కూడా ఈ థియేటర్లు ప్రేక్షకులు లేక బోసిపోతున్నాయి. 
 
ఈనేపథ్యంలో జీఎస్టీతో పాటు వినోదపు పన్ను వసూలు చేయడాన్ని వ్యతిరేకిస్తూ థియేటర్‌ యజమానులతో పాటు చలనచిత్ర వాణిజ్య మండలి ఆందోళనకు దిగింది. ఇందులోభాగంగా థియేటర్లను నాలుగు రోజుల పాటు మూసివేశారు. ఆ తర్వాత ప్రభుత్వంతో జరిపిన చర్చల్లో సామరస్యపూర్వక ఫలితం రావడంతో థియేటర్లలో చిత్రాల ప్రదర్శనకు సమ్మతించారు.
 
అదేసమయంలో టిక్కెట్‌ ధరను పెంచారు. రూ.100 టిక్కెట్‌ ధరను రూ.118గానూ, రూ.120 ధరను రూ.153గా పెంచారు. ఈ టిక్కెట్‌ ధరలను చూసిన ప్రేక్షకుడు బెంబేలెత్తిపోయి థియేటర్‌ వైపు వెళ్ళేందుకు భయపడుతున్నారు. ఈ కారణంగా థియేటర్లు బోసిపోయి కనిపించాయి. ముఖ్యంగా వారాంతపు సెలవుల్లో కూడా థియేటర్లు ఫుల్‌ కాకపోవడంతో థియేటర్‌ యజమానులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.