శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By DV
Last Modified: బుధవారం, 16 మార్చి 2016 (15:07 IST)

బ్రహ్మానందాన్ని మళ్లీమళ్లీ కొడితే హాస్యమా...? కామెడీ స్టోరీ...

నవరసాల్లో హాస్యరసం ప్రధానమైంది. అది టానిక్‌ లాంటిది. మనస్సును ఆహ్లాదపరుస్తుంది. అటువంటి హాస్యం నేడు పక్కదారి పడుతోంది. హాయిగా నవ్వుకునే ఎన్నిరోజులయిందో... అంటూ.. ఇప్పటి ప్రేక్షకులు అనుకునేలా చిత్రంలోని పాత్రలుంటాయి. సినిమాకూ హాస్యమే కాసుల వర్షం కురిప

నవరసాల్లో హాస్యరసం ప్రధానమైంది. అది టానిక్‌ లాంటిది. మనస్సును ఆహ్లాదపరుస్తుంది. అటువంటి హాస్యం నేడు పక్కదారి పడుతోంది. హాయిగా నవ్వుకునే ఎన్నిరోజులయిందో... అంటూ.. ఇప్పటి ప్రేక్షకులు అనుకునేలా చిత్రంలోని పాత్రలుంటాయి. సినిమాకూ హాస్యమే కాసుల వర్షం కురిపిస్తుంది. ఒకప్పుడు హాస్యం నలుగురు చూస్తూ కల్మషం లేని పదాలతో కడుపుబ్బ నవ్వించేట్లుగా వుండేవి. రానురాను వాటిలో పదాలు తగ్గాయి. సెటైర్‌లు, పేరడీ, వెటకారాలు రాజ్యమేలుతున్నాయి. ఇందుకు కారకులు ఎవరు? రచయితా? దర్శకుడా? నిర్మాతా? చేసే నటుడా? అందరూ బాధ్యులే.
 
హాస్య నటుడంటే!
హాస్యనటుడిని గాగ్‌మేన్‌ అంటారు. చిత్రాల్లో హాస్య రసానికుండే స్థానం ఆయా దేశాలలోని ప్రజల అభిరుచి, ఆర్థికస్థితి మీద ఆధారపడతాయి. సహజ జీవితంలో ఆర్థిక దుస్థితి వల్ల కష్ట పరంపరలతో కాలం వెళ్లబుచ్చే ప్రజలకు కనీసం చిత్రాల్లో అయినా కాస్త నవ్వడానికి అవకాశం వుండాలనే వాదం వుంది. అందువల్లే చిత్రాల్లో హాస్యం తప్పనిసరిగా ఉంటుంది.
 
దక్షిణాది నటులు...
తమిళ చిత్రాల్లో కృష్ణన్‌, మధురం, సారంగపాణి, కాశీ ఎన్‌.రత్నం అనే వాళ్ళల్లో ఎవరో తప్పకుండా సాక్షాత్కరిస్తారు. తెలుగు చిత్రాల్లో రేలంగో, శివరావో, రమణారెడ్డి వంటి కొందరు ప్రత్యక్షమై తీరుతారు. కేవలం హాస్యం కోసం ఓ రూపకథను సృష్టించి, దానికో వెయ్యి అడుగులు సెల్యులాయిండ్‌ కూడా ధారాదత్తం చేయడం దర్శకులకు అలవాటైపోయింది.
 
హాలీవుడ్‌లో...
హాలీవుడ్‌లో చార్లీచాప్లిన్‌, హెరాల్డు లాయడ్‌, స్టాన్‌ లారెత్‌, అవిర్‌ హార్టీ, బడ్‌ అబాట్‌, లేకాస్టెల్లో మొదలైన హాస్యబృందం కన్పిస్తుంది. బ్రిటీష్‌ చిత్రాల్లో సిడ్ని గ్రీన్‌స్ట్రెట్‌ అనే 280 పౌనుల బరువుగల 6 అడుగుల 10 అంగుళాల మహాకాయుడు కనబడతారు. హిందీ రంగంలో దీక్షిత్‌, నీమో, రమన్న మల్వంకర్‌, విహెచ్‌ దేశాయి, డేవిడ్‌, కన్నెయలాల్‌ కనబడతారు.
 
క్షుద్రమైన హాస్యం
హాస్యానికి సముచిత స్థానం ఈనాటిది కాదు. ఒక్కొక్క హాస్యనటునిలో ఒక్కో ప్రత్యేకత వుంది. కాళిదాసు నాటకంలో విదూషకుడు, షేక్స్‌పియర్‌ నాటకాల్లో ఫూల్‌ అనే హాస్యగాడు ప్రసిద్ధి. అసభ్యంగా ప్రవర్తించి ప్రేక్షకులను నవ్వించడం క్షుద్రమైన హాస్య నటన కిందకు వస్తుంది. అంగుష్టమాత్రుడవటంవల్ల, బుర్ర తక్కువగా ప్రవర్తించడం వలనో అంగముల అమరిక వికృత వలనో నవ్వు కల్గించడం ఒక హాస్యం.
 
జంట హాస్యనటులు
హాస్యనటులు జంటగా వుంటూ భార్యభర్తలు/ స్నేహితులు గానో.. కథ నౌకను తెడ్డేసి అప్పుడప్పుడూ ముందుకు నెట్టబడుతూనే ఓ విధమైన టెంపో కల్గిస్తూ తమ హాస్యాభినయం, సందర్భ శుద్ధికల్గి మాటల్లో బాగానే వుంటుంది. హాస్యాన్ని మధురమై, శ్లేషార్ణపూర్తియైన మాటలు ఉపయోగించాలి. తెలుగులో రేలంగి- సూర్యకాంతం, రమణారెడ్డి- సూర్యకాంతం.. రాజబాబు- రమాప్రభ.. ఇలా జంటలుగా చేసి మెప్పించారు.
 
కొన్ని చిత్రాలు కేవలం హాస్య చిత్రాలుగా తయారుచేయబడుతున్నాయి. కేవలం వూకదంపుడు హాస్యంతో ప్రజలకు చక్కలిగింతలు పెట్టి జేబుల్లోని డబ్బు గుంజుకోవడం పరిపాటి అయింది. 
 
అపహాస్యానికి కారకులు?
నేడు హాస్యం అపహాస్యంగా మారింది. 'తోడికోడళ్లు' సినిమాలో.. రేలంగి, జగ్గయ్య కాంబినేషన్‌లో.. జగ్గయ్య మాట్లాడేముందు కొడుతూ మాట్లాడి పెదాల్లో చిరునవ్వు తెపిస్తాడు. ఆ తర్వాత రివర్స్‌లో రేలంగి.. దానికి కౌంటర్‌ ఇస్తాడు. అయితే.. నేడు హాస్యం పేరుతో.. ప్రేక్షకుల్ని నెత్తి మీద కొట్టి.. నవ్వించే ప్రయత్నం చేస్తున్నాయి. తెరపై హాస్య నటులు పలికే సంభాషణలు, నటన ఏమాత్రం నవ్వు తెప్పించకపోగా.. విసుగు పుట్టిస్తున్నాయి. దానికి కారణం.. నటీనటుల్ని ఆడించేవాడే. ఆయనే డైరెక్టర్‌. డైరెక్టర్‌ సరిగ్గా విషయం లేనివాడైతే.. నటుడే కొంతమంది రచయితల్ని పెట్టుకుని.. సన్నివేశాలు పుట్టించుకుని.. ప్రదర్శిస్తాడు. 
 
ఇలా పలువురు హాస్యనటులు చేసేవారు. ఎల్‌బి శ్రీరామ్‌, వేణుమాధవ్‌, తనికెళ్ళ భరణి.. ఇలా ఎందరో ఆ కోవలోని వారే.. నటుడు బ్రహ్మానందం కూడా స్వతహాగా.. తను లెక్చరర్‌ కావడంతో.. తెలుగు భాషపై పట్టు వుండడంతో.. దర్శకులు, రచయితలు రాసి ఇచ్చిన స్క్రిప్ట్‌ను తమకు అనుకూలంగా మార్చేసుకుని.. కొత్తగా ప్రెజెంట్‌ చేస్తుంటారు. ఇది కొన్నిసార్లు మంచి ఫలితాన్ని ఇస్తాయి. ఎక్కువసార్లు బెడిసికొడుతుంది. దాంతో రొటీన్‌ కామెడీ వచ్చేస్తుంది. అదే కామెడీ.. బ్రహ్మానందంలో గత ఆరేళ్లుగా చూస్తున్నానని.. సీనియర్‌ నటుడు కోట శ్రీనివాసరావు వ్యాఖ్యానించడంలో తప్పులేదు.
 
సహజంగా బ్రహ్మానందాన్ని విమర్శించడం అంటే.. కాస్త ధైర్యం చేయాల్సిందే. అది తోటి నటీనటుల్లో ఎవ్వరికీ లేదు. ఒక్క అలీకి తప్ప.. అలీ సీనియర్‌.. అందుకే బ్రహ్మానందంపై పబ్లిక్‌గానే సెటైర్లు వేస్తుంటారు. ఇప్పుడు కోట వేశాడు. గత ఆరేళ్ళుగా ఒకే వేషం వేస్తూ బ్రహ్మానందం బతికేస్తున్నాడు. తనకు కోపమొచ్చినా ఫర్వాలేదు. అతను అద్భుతమైన నటుడు. ఎటువంటి పాత్రనైనా చేయగలడు. కానీ రొటీన్‌ పాత్రలే అతనికిస్తున్నారు. ప్రతివాడూ బ్రహ్మానందాన్ని కొట్టడం.. అది చూసి జనాలు నవ్వడం.. అనేది పెద్ద హాస్యంగా దర్శకులు ఫీలవుతున్నారు. దాంతో.. ఏళ్ళ పాటు బ్రహ్మానందానికి బ్రహ్మరథం పట్టిన ప్రేక్షకులు ఒక్కసారిగా మొనాటిగా మారిపోయి... 'వీడు మళ్ళీ ఈ సినిమాలో ఉన్నాడ్రా!' అంటూ విసుగుపుట్టేలా చేసుకున్నాడు.
 
కొసమెరుపు..
కెరీర్‌ ఆరంభంలో.. చిత్రం భళారే విచిత్రం... సినిమాలో నీ యంకమ్మ... అంటూ బ్రహ్మానందం పలికిన డైలాగ్‌, అప్పట్లో కొందరు బూతు పదం అనేవారు. కానీ అది అచ్చమైన తెలుగు అని.. తర్వాత బ్రహ్మానందం వివరణ ఇచ్చాడు. ఆ చిత్రంలో ఆయన హాస్యంలో చేయని కోణాలు లేవు. దాదాపు అన్ని షేడ్స్‌ పలికించేశాడు. అదే షేడ్స్‌.. ఆ తర్వాత చిత్రంలో ఒక్కోటి చేస్తూ.. ఒక్కో సినిమాకు నిమిషాల చొప్పున చేసే ఆర్టిస్టుగా మారాడు. ఇన్నేళ్ళయినా, అదే షేడ్‌ పలికించడంతో బోర్‌ కొట్టిందని.. అందుకే యూత్‌ ఆర్టిస్టులు వస్తున్నారని సినీ విశ్లేషకులు తెలియజేస్తున్నారు.