శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , గురువారం, 6 జులై 2017 (09:22 IST)

ఆసుపత్రి తీసిన ప్రాణం... దాసరి అన్యాయమైపోయారా

మనిషి చనిపోయాక ఎందుకు, ఎలా పోయాడు, కారణం ఎవరు వంటి ప్రశ్నలు సంధించడం నిష్ప్రయోజనమే కావచ్చు. కానీ నిక్షేపంగా ఉన్న పెద్దమనిషి.. మరో పదేళ్లు హాయిగా బతకాల్సిన వ్యక్తి ఆసుపత్రి నిర్వాకానికో లేక తన అవగాహనా లోపానికో బలైపోతే, ఒక చిత్ర పరిశ్రమ హక్కుల సంరక్షకు

మనిషి చనిపోయాక ఎందుకు, ఎలా పోయాడు, కారణం ఎవరు వంటి ప్రశ్నలు సంధించడం నిష్ప్రయోజనమే కావచ్చు. కానీ నిక్షేపంగా ఉన్న పెద్దమనిషి.. మరో పదేళ్లు హాయిగా బతకాల్సిన వ్యక్తి ఆసుపత్రి నిర్వాకానికో లేక తన అవగాహనా లోపానికో బలైపోతే, ఒక చిత్ర పరిశ్రమ హక్కుల సంరక్షకుడు నేల రాలిపోతే, అభిమానులు, ఆప్తులు ఎంత విలవిల్లాడిపోయి ఉంటారు. మనిషి పోయిన ఇన్నాళ్ల తర్వాత వారు ఆ పెద్దాయన అనూహ్య మరణానికి కారణం ఏదో బయటపెట్టారు.
 
బరువు తగ్గడానికి తీసుకున్న చికిత్సే దర్శకరత్న దాసరి నారాయణరావు మరణానికి కారణమైందని సీనియర్ డైరెక్టర్ రేలంగి నరసింహారావు అన్నారు. దాసరి మరణంపై అయన సన్నిహితులు చాలా మంది ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం గమనార్హం. ఆయన మరణంపై ఆయనకు సన్నిహితుడైన రేలంగి నర్సింహారావు స్పందించారు. 
 
యూట్యూబ్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దర్శకరత్న మరణానికి గల కారణాలను రేలంగి వివరించారు. చికిత్సలో భాగంగా దాసరిగారు తొలుత జీర్ణాశయంలో బెలూన్ వేయించుకున్నారని, ఆ తర్వాత ఆరేడు కిలోల వరకు బరువు తగ్గారని తెలిపారు. దీనిపై నమ్మకంతోనే రెండోసారి కూడా సర్జరీకి వెళ్లి, బెలూన్ వేయించుకోవడమే ఆయన ప్రాణం తీసిందని చెప్పారు.
 
రెండోసారి సర్జరీకి వెళ్లడమే దాసరి చేసిన తప్పు అని రేలంగి పేర్కొన్నారు. దాసరికి రెండోసారి పొట్టలో బెలూన్ వేసేటప్పుడే లోపం తలెత్తితే వైద్యులు దానిని సవరించి ఇంటికి పంపించారని అన్నారు. మొదటిసారి చికిత్స తీసుకున్నప్పుడు ఆయన ఎక్కువ ద్రవాహారన్నే తీసుకున్నారని తెలిపారు. కానీ, రెండోసారి బెలూన్ వేయించుకునేందుకు వెళ్లినప్పుడు మాత్రం నోటి ద్వారా సాధారణ ఆహారాన్ని తీసుకునేందుకు చికిత్స చేయించుకున్నారని తెలియజేశారు. అదే ఆయన ప్రాణం తీసిందన్నారు. 
సర్జరీకి వెళ్లకుండా ద్రవాహారాన్నే ఆయన తీసుకుని ఉంటే మరో పదేళ్లు బతికేవారని రేలంగి వివరించారు. కానీ, అంతా విధి రాతని, అది ఎలా తలిస్తే అలా జరుగుతుందని అన్నారు. దాసరి జీవించి ఉంటే సినీ పరిశ్రమకు అండగా ఉండి, మరింత మేలు జరిగేదని రేలంగి నరసింహారావు అభిప్రాయపడ్డారు.