బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By DV
Last Modified: మంగళవారం, 29 సెప్టెంబరు 2015 (20:43 IST)

సినీపరిశ్రమ తరలిపోతుందా...? సచివాలయంలో మంత్రులు చర్చ....

సినీ పరిశ్రమ మదరాసు నుంచి హైదరాబాద్‌ తరలిరావడానికి ఎంతకాలం పట్టిందో తెలిసిందే. పరభాషా చిత్రాలు కూడా అక్కడే ఎక్కువగా జరగడం.. ఆతర్వాత జరిగిన రాజకీయ కారణాల వల్ల.. తమిళవారు తెలుగువారిని చిన్నచూపు చూస్తున్నారనే కారణంగా తెలుగు సినిమాలకు తమిళ స్టూడియోల్లో పర్మిషన్‌ ఇవ్వకపోవడం కారణంగా అప్పటి అగ్రహీరోలు, దర్శకులు కలత చెంది.. తెలుగువారికి మనకంటూ మన ప్రాంతం కావాలని అప్పటి ముఖ్యమంత్రులతో సంప్రదించి పెద్ద పెద్ద రాయితీలతో పరిశ్రమను హైదరాబాద్‌కు తరలించడానికి కృషి చేశారు. ఇది గతం.
 
ప్రస్తుతం.. మరోరకంగా మారిపోయే సూచనలు కన్పిస్తున్నాయి. తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోయినప్పుడే.. అన్ని రంగాలు విడిపోయాయి. అందులో చివరిదశలో సినిమాపరిశ్రమ వుందని సినీ ప్రముఖులు చెప్పారు. కానీ.. నేడు పరిస్థితులు త్వరగా మారే సూచనలు కన్పిస్తున్నాయి. తెలుగు సినిమాలు ఎక్కువగా షూటింగ్‌లు కోస్తాంధ్రలోనే జరుపుకోవడం అందుకు సూచన. 
 
సినిమా చివర్లో కొన్నిసీన్లు హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో జరుగుతున్నాయి. ఇది ఇప్పటివరకు జరుగుతున్న చరిత్రే. ఇందుకు తెలంగాణ ప్రభుత్వం కూడా.. మంచి రాయితీలు ఇచ్చి.. పరిశ్రమను కాపాడుకునేందుకు చర్యలు తీసుకుంటుంది. ఇంకోవైపు... తెలంగాణ కార్మికులను ఎక్కువశాతం పనిలో పెట్టుకుని.. మా వారి అభివృద్ధికి తోడ్పడాలని సూచించారు కూడా. ఇదంతా... చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌లో పాలన చేస్తుండగా జరిగిన పరిణామాలు.
 
కానీ, ప్రస్తుతం చంద్రబాబు నవ్యాంధ్రలోనే పరిపాలన సాగిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం ప్రవాసాంధ్రుల పెట్టుబడులు ఆకర్షించి.. అభివృద్ధి చేసేందుకే. అయితే.. సోమవారంనాడు.. హైదరాబాద్‌ సెక్రటేరియట్‌లో ఆసక్తికరమైన చర్చ జరిగింది. కొందరు మంత్రులు, విలేకరులు పిచ్చాపాటీ మాట్లాడుకుంటూ.... చంద్రబాబు నవ్యాంధ్రలో పాలనా సాగిస్తుండంతో అన్ని రంగాలు అక్కడికి వచ్చే సూచనలు కన్పిస్తున్నాయి. అందులో భాగంగా సినీ పరిశ్రమ కూడా త్వరలో వచ్చేవిధంగా.. సి.ఎం. పలు ఆసక్తికరమైన రాయితీలు ఇవ్వన్నుట్లుగా సంభాషించుకున్నారు. ఇది సాధ్యపడటానికి సమయం పట్టినా... త్వరగా మన రాష్ట్రానికి వెళ్ళిపోవాలనేట్లుగా పలువురు నిర్మాతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పరాయి రాష్ట్రంలో వున్నా... పరాయివాళ్ళ గానే చూసే పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఎంత త్వరగా వెళితే అంత మంచిదిగా కొందరు భావిస్తున్నట్లు తెలుస్తోంది. టెక్నాలజీ మారిన నేపథ్యంలో మార్పు అనేది చాలా త్వరితగతిన చేరుకుంటుందని ఓ ప్రముఖ దర్శకుడు వ్యాఖ్యానించడం విశేషం. 
 
అయితే.. హైదరాబాద్‌ అన్ని విధాలా వాతావరణంగా సేఫ్‌ కాబట్టి.. ఇక్కడనుంచి సినిపరిశ్రమ తరలిపోలేదనే వాదన లేకపోలేదు. ఏదిఏమైనా సినీ పరిశ్రమకు సోమవారం నాడు హైదరాబాద్‌ సెక్రటేరియట్‌లో చర్చ జరగడం విశేషంగా చెప్పుకోవచ్చు. ప్రత్యేకంగా చెప్పాల్సివస్తే.. ఈ విషయంలో రాష్ట్రం విడిపోయినప్పుడే.. మూడు, ఐదేళ్ళలోపు.. మన రాష్ట్రంకు వెళ్ళిపోయి అభివృద్ధి చేసుకుందామని.. అక్కినేని నాగార్జున, డి. సురేష్‌బాబు వంటివారు ఓ సందర్భంలో చెప్పడం కూడా బలాన్ని చేకూరుస్తుంది. అందుకు సూచనగా.. ఇప్పటికే విశాఖ పరిసర ప్రాంతాల్లోనూ ప్రముఖ నిర్మాతలు డబ్బింగ్‌, రికార్డింగ్‌ స్టూడియోలు ఏర్పాటు చేసుకోవడం కన్పిస్తుంది. ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది.