శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , శనివారం, 22 ఏప్రియల్ 2017 (06:06 IST)

కర్ణాటకలో ‘బాహుబలి 2’ సినిమాపై అడ్డంకులకు ఇదా కారణం?

కర్నాటకలో బాహుబలి2 సినిమా విడుదలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కన్నడ సంఘాల వైనం నిశితంగా చూస్తుంటే కట్టప్ప కన్నడ ప్రజలకు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్య కారణం అంటే నమ్మశక్యం కావడం లేదు. కావేరీ జలాల వివాదానికి సంబంధించి తొమ్మిదేళ్ల క్రితం తమిళులకు మద్దతు పలుక

కర్నాటకలో బాహుబలి2 సినిమా విడుదలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కన్నడ సంఘాల వైనం నిశితంగా చూస్తుంటే కట్టప్ప కన్నడ ప్రజలకు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్య కారణం అంటే నమ్మశక్యం కావడం లేదు. కావేరీ జలాల వివాదానికి సంబంధించి తొమ్మిదేళ్ల క్రితం తమిళులకు మద్దతు పలుకుతూ సత్యరాజ్ కన్నడిగులకు వ్యతిరేకంగా వ్యాఖ్యానించిన ఘటన ఇప్పుడు వివాదాస్పదం కావడం ఏమిటి? సత్యరాజ్ బెంగళూరు వచ్చి బేషరతుగా కన్నడిగులకు క్షమాపణ చెప్పేంతవరకూ ఆ చిత్రాన్ని కర్ణాటకలో విడుదలకు ఆమోదించమని ‘కన్నడ ఒకూట’ సంస్థ అధ్యక్షుడు వటల్‌ నాగరాజ్‌ బెదిరించడం ఏమిటి? దాదాపు ఆ సమయంలోనే కన్నడిగులకు వ్యతిరేకంగా వ్యాఖ్యానించిన తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ క్షమించండి అని ఒక మాట చెప్పగానే తన సినిమాకు ఏ అడ్డంకులు కల్పించకుండా అదే కన్నడిగులు పక్కకు తప్పుకోవడం ఏమిటి? కట్టప్పను  తొమ్మిదేళ్ల తర్వాత ఇప్పుడు సాకుగా పెట్టుకుని అడ్డు చెప్పడం ఏమిటి?
 
సగటు ప్రేక్షకుడికి ఇవన్నీ ప్రశ్నలుగానే మిగులుతున్నాయి. ఈ నేపథ్యంలో బాహుబలి 2కి కర్నాటకలో ఇంత వ్యతిరేకత ఎందుకు వస్తోందనడానికి ఆర్థిక కారణమే ప్రబలంగా ఉందా అనే అనుమానం కలుగుతోంది. దీనికి ప్రధానంగా బాహుబలి చిత్రం పంపిణీలో కన్నడ డిస్ట్రిబ్యూటర్లకు ఎలాంటి వాటాను నిర్మాతలు ఇవ్వకపోవడమే ఇంత వివాదానికి కారణమైందన్న వార్త సంచలనం కలిగిస్తోంది.  ‘బాహుబలి 2’ నిర్మాతలకు సంబంధించినంత వరకూ బెంగళూరు మల్టీప్లెక్స్‌లు, కర్ణాటక - ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతాలు చాలా కీలకమైన మార్కెట్లు. కర్ణాటకలో ఇప్పటి వరకూ అత్యధిక వసూళ్లు సాధించిన పర భాషా (తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, ఇంగ్లీష్‌ భాషలకు సంబంధించి) చిత్రం ‘బాహుబలి 1’ కావడం ప్రస్తావనార్హం. ఒక్క కర్ణాటక నుంచే ఆ సినిమాకు రూ. 35 కోట్ల డిస్ట్రి‌బ్యూటర్‌ షేర్‌ వచ్చిందని వినికిడి. 
 
ఇప్పుడు తెలుగు, తమిళ, హిందీ భాషలు మూడింటిలోనూ ‘బాహుబలి 2’ విడుదల కానున్న రాష్ట్రం కర్ణాటకే. ఈ నేపథ్యంలో కర్ణాటక ఫిల్మ్‌ ట్రేడ్‌లో ‘బాహుబలి 2’ హాటెస్ట్‌ ఫిల్మ్‌గా మారింది. దాని ప్రదర్శన హక్కులు చేజిక్కించుకొనేందుకు అనేకమంది డిస్ట్రి‌బ్యూటర్లు ప్రయత్నించారు. అయితే నిర్మాతలు ఎవరికీ ఆ హక్కులు ఇవ్వకుండా ఎన్.ఎం. ఎంటర్‌టైన్‌మెంట్‌ ద్వారా సొంతంగా విడుదల చేస్తున్నారు. ఇది అక్కడి బయ్యర్లకు ఆగ్రహాన్ని తెప్పించిందనీ, అందుకే తొమ్మిదేళ్ల క్రితం నాటి వ్యవహారాన్ని ఇప్పుడు తిరగతోడుతున్నారనీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
 
ఈ సమస్యను పరిష్కరించుకొని, కర్ణాటకలో చిత్రాన్ని యథావిధిగా విడుదల చేయించడానికి రాజమౌళి, నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. ఈ లోగా శుక్రవారం నాడు సత్యరాజ్‌ వీడియో ద్వారా కన్నడిగులకు క్షమాపణ చెప్పారు. కానీ ఈ వార్త రాసే సమయానికి కన్నడ సంఘాలేవీ దీనిపై స్పందించలేదు. ఈ వేడి వాతావరణంలో కర్ణాటకలో ‘బాహుబలి 2’ రిలీజ్‌పై ఉత్కంఠ నెలకొంది.