మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By ivr
Last Modified: శుక్రవారం, 19 సెప్టెంబరు 2014 (13:26 IST)

మహేష్‌ మాటల దూకుడు 'ఆగడు'... గబ్బర్ సింగ్ లవ్ ట్రాక్‌తో...

ఆగడు నటీనటులు : మహేష్‌ బాబు, తమన్నా, రాజేంద్రప్రసాద్‌, బ్రహ్మానందం, నాజర్‌, తనికెళ్ళ భరణి, సోనూసూద్‌, ఆశిష్‌ విద్యార్థి, ఎం.ఎస్‌. నారాయణ, బ్రహ్మాజీ, అజయ్‌, వెన్నెల కిశోర్‌, పోసాని, ముంతాజ్‌
 
టెక్నికల్‌
కెమెరా: కె.బి. గుహన్‌, సంగీతం: ఎస్‌ఎస్‌ థమన్‌, ఆర్ట్‌: ఎ.ఎస్‌. ప్రకాష్‌, మాటలు: ఉపేంద్ర మాధవ్‌, అనిల్‌ రావిపూడి, రచన సహకారం: ప్రవీణ్‌ వర్మ, ఫైట్స్‌: విజయ్‌, నిర్మాతలు: రామ్‌ ఆచంట, గోపి ఆచంట, అనిల్‌ సుంకర, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: శ్రీనువైట్ల.
 
మహేష్‌ బాబు సినిమా అంటే ప్రేక్షకుల్లో క్రేజ్‌ వుంటుంది. '1' నేనొక్కడినే సినిమా కూడా కొత్తగా వుంటుందని దర్శక నిర్మాతలు చెప్పారు. విడుదలయ్యాక.. ఆ చిత్రం తెలుగు ప్రేక్షకుల అంచనాలకు దొరకలేదు. ఆ తర్వాత అదే నిర్మాతలు నిర్మించిన 'ఆగడు' కూడా మహేష్‌ ఎందులోనూ ఆగడు. పోలీసు పాత్రే చేసినా.. అతనికి ఎదురుండదని అదే టైటిల్‌ అని చెప్పారు. ఏ హీరో సినిమా అయినా పూర్తి ఎంటర్‌టైనర్‌గా తీర్చిదిద్దడం దర్శకుడు పని. దూకుడులో శ్రీనువైట్ల అలానే చేశారు. అయితే మళ్ళీ అటువంటి ప్రయత్నం చేయదలచి మహేష్‌ను కొత్తగా చూపించేట్లు చేశాడు. కానీ ఆ ప్రయత్నాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారో లేదో అని మొదటి నుంచి ఇండస్ట్రీలో అనుమానం వుండేది. మరి అది నిజమైందా? శ్రీను వైట్ల ఏం చేశాడు? అనేది తెలుసుకుందాం.
 
కథ : 
కథ చెప్పేటప్పుడు గబ్బర్‌సింగ్‌ స్టోరీ గుర్తు తెచ్చుకుంటే బెటర్‌. చిన్నతనంలోనే చురుగ్గా వుండేవాడు శంకర్‌. అతనో అనాథ. పోలీసు ఇన్‌స్పెక్టర్‌ అతని చురుకుదనం చూసి తన కొడుకుగా పెంచుకుంటాడు. పెద్దవాడని సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ అయి ఎన్‌కౌంటర్‌ శంకర్‌గా పేరు తెచ్చుకుంటాడు. బొక్కాపట్నం అనే ఊరిలో ప్రాజెక్ట్‌ల పేరుతో సామాన్యుల జీవితాలతో ఆడుకునే సోనూసూద్‌ బ్యాచ్‌ ఆగడాల్ని ఏ పోలీసు అరికట్టలేడు. అక్కడికి వృత్తిరీత్యా శంకర్‌ వస్తాడు. సోనూసూద్‌ అనుచరగణం చేసే అసాంఘిక కార్యక్రమాలను తన చాకచక్యంతో బ్రేక్‌ వేస్తాడు. చివరగా సోనూసూద్‌ ఆగడాల్ని అరికట్టాలంటే ఢిల్లీ సూరి(బ్రహ్మానందం)ను బకరాగా వాడుకుని అడ్డుకట్టవేస్తాడు. అసలు ఢిల్లీ సూరి కథేమిటి? పోలీసుగా శంకర్‌ చేసిన చాకచక్యాలేమిటి? అనేవి మిగిలిన సినిమా.
 
పెర్‌ఫార్మెన్స్‌ 
నటనాపరంగా మహేష్‌బాబు కొత్తలుక్‌తో కన్పిస్తాడు. కాలేజీ కుర్రాడిలా కాస్త వళ్లు తగ్గినట్లు కన్పిస్తుంది. అయితే పోలీసుగా వుండాల్సిన బాడీ పోకిరిలోనే బాగుంటుంది. ఇందులో ఎక్కువగా మాట్లాడే పాత్ర ఏమయినా వుందంటే అది మహేష్‌ బాబే. సోనూసూద్‌ నటనాపరంగా మామూలుగానే చేసేశాడు. బ్రహ్మానందం రొటీన్‌గా అగ్రహీరోల చిత్రాల్లో వేసే ఆటలో అరటిపండులా నటించాడు. రాజేంద్రప్రసాద్‌ మహేష్ తండ్రిగా సెంటిమెంట్‌ పండించాడు. ఊరిలో మిఠాయి దుకాణం నడిపే కుటుంబంగా తనికెళ్ళ భరణిది. ఆయన కుమార్తెగా సరోజ(తమన్నా) నటించింది. పోలీసు అనుచరులుగా బ్రహ్మాజీ, వెన్నెల కిశోర్‌ తదితరులు నటించారు. ఐటం గాళ్‌గా శ్రుతిహాసన్‌ మెరుస్తుంది. 
 
టెక్నికల్‌గా... 
కెమెరా పనితం బాగుంది. సంభాషణల పరంగా ఈ చిత్రం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. పంచ్‌ డైలాగ్‌ల పేరుతో ఒక దశలో బోర్‌ కొట్టించేశాడు. గతంలో శ్రీను వైట్ల చిత్రమంటే కోన వెంకట్‌, గోపీమోహన్‌ బ్యాచ్‌ వుండేది. ఇప్పుడు వారితో వున్న వ్యత్యాసంతో కొత్తవారితో రాయించారు. ఒకటిరెండు సార్లు పంచ్‌డైలాగ్‌లు, విలన్లు చెప్పే కథలు బాగుంటాయి. అదేపనిగా సినిమా అంతా అయ్యేసరికి విసుగు కల్గుతుంది. సెకండాఫ్‌లో దర్శకుడు చేసిన తప్పిదమే అదే. స్క్రీన్‌ప్లే పరంగా మొదటిభాగం చాలా సరదాగా సాగుతుంది. రెండో భాగంలో కథ భారీగా మారి గందరగోళంగా వుంది. ఎడిటింగ్‌కు చాలా పనే వుంది. డాన్స్‌పరంగా సోసోగా వున్నాయి స్టెప్‌లు. సంగీతపరంగా థమన్‌ 50వ చిత్రమైనా.. కొత్తగా ఏమీ అనిపించదు. రెండు పాటలయితే అవి ఏమిటో కూడా చెవులు నిక్కించి విన్నా అందులోని పదాలు అర్థంకావు. 
 
విశ్లేషణ 
మహేష్‌ సినిమాలంటే సింపుల్‌ డైలాగ్‌తో.. సింపుల్‌గా పంచ్‌లతో యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా చూపిస్తే ఫ్యాన్స్‌కు పండుగే. 'డిక్కీ బలిసిన కోడి చికిన్‌ షాప్‌కు వచ్చి తొడకొట్టిందట...' విలన్స్‌నుద్దేశించి మహేష్‌ అనే డైలాగ్‌.. ఇలా సినిమా మొత్తం చాలాసార్లు పంచ్‌ డైలాగ్‌లు వుంటాయి. దానికి తోడు విలన్లు తన గ్రిప్‌లో పెట్టుకునేందుకు పిట్టకథలు చెబుతాడు. అవికూడా తన యాక్ట్‌ చేసిన పలు సినిమా కథలే చెబుతాడు. అయితే ఒకటిరెండుసార్లకు బాగుంటుంది. అదేపనిగా చెప్పడంతో మహేష్‌బాబు స్పీచ్‌ ఇచ్చినట్లుంది. దాంతో అసలుకే ఎసరు వచ్చేసింది.
 
ఇక కథగా చూసుకుంటే.. పోలీసు కథ మామూలే. విలన్‌ అరాచకాలను సిన్సియర్ పోలీసు అధికారి అడ్డుకోవడం. దానికి ఇద్దరిమధ్య వార్‌.. గబ్బర్‌సింగ్‌లోనూ అన్నదమ్ముల కథ. ఇదికూడా డిటోనే. కానీ ఇందులో మహేష్‌ అన్న కలెక్టర్‌ అవుతాడు. అందులో రౌడీల పంచన చేరతాడు. ఫాదర్‌, మదర్‌, సోదరుని సెంటిమెంట్‌ అందులో వర్కవుట్‌ అయింది. కానీ ఆగడులో అన్న, తండ్రి సెంటిమెంట్‌ వున్నాయి. అయితే అవి చెప్పే విధానంలో కొత్తగా చెబుతూ.. ట్రాక్‌ మారాడు శ్రీనువైట్ల. హీరోయిన్‌ పరిచయం, లవ్‌లోకి లాగడం కూడా గబ్బర్‌సింగ్‌ ట్రాక్‌ గుర్తుకువస్తుంది. ఒక సినిమాతో పోల్చడమే ఈ చిత్రానికి మైనస్‌.
 
కాగా, ఎంటర్‌టైన్‌మెంట్‌ కోసం.. గేమ్‌ షోలు ఆడటం చిత్రంలోని ప్రత్యేకత. 'మీలో ఎవరు కోటీశ్వరుడు' తరహా చిన్నపాటి సరదా పారడీ కూడా ఇందులో వుండటం విశేషం. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఎలుక కలుగు లోంచి రావాలంటే ఉల్లిగడ్డ గాలంగా వేస్తాం. హీరో కూడా విలన్లను దారిలోకి తెచ్చేందుకు తనకు తెలిసిన కథల ఫార్మెట్‌ను వినియోగిస్తాడు. దర్శకుడు కూడా ఇళ్ళల్లో వుండే ఆడియన్స్‌ను థియేటర్‌కు తెచ్చేందుకు నానా తంటాలు పడ్డాడు. కానీ అది మోతాదు ఎక్కువై.. వెగటు పుట్టే ప్రమాదమూ వుంది. ఏవరేజ్‌గా సాగే ఈ సినిమాను దసరా వరకు మరే సినిమా లేకపోవడంతో ప్రేక్షకులు చూసినా ఆశ్చర్యంలేదు.