శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By ivr
Last Updated : శుక్రవారం, 12 డిశెంబరు 2014 (15:26 IST)

రజినీకాంత్ బర్త్ డే... ఫుల్ జోష్ నింపే లింగా... డిటైల్డ్ రివ్యూ

లింగ నటీనటులు : రజినీకాంత్‌, అనుష్క, సొనాక్షి సిన్హా, జగపతి బాబు, కె.విశ్వనాథ్‌, సంతానం, దేవ్‌ గిల్‌ తదితరులు. సాంకేతిక వర్గం- సంగీతం: ఎ.ఆర్‌.రెహమాన్‌, ఛాయాగ్రహణం: రత్నవేలు, కథ: పొన్నుకుమార్‌, నిర్మాత: రాక్‌ లైన్‌ వెంకటేష్‌; కథనం-దర్శకత్వం: కె.ఎస్‌.రవికుమార్‌.
 
విడుదల తేది: 12-12-2014
రజనీకాంత్‌ సినిమా యానిమేషన్‌ 'విక్రమ్‌సింహ' తర్వాత నిరాశపర్చిన ఆయన అందులో చేసిన తప్పును తెలుసుకుని.. పూర్తిగా ఆయనే నటించిన చిత్రంతో ముందుకు వస్తానని అప్పట్లో ప్రకటించాడు. ఇందులో నేను నేనుగానే కన్పిస్తానంటూ... ప్రమోషన్‌లో రజనీకాంత్‌ అనడంలో ఆశ్చర్యంలేదు. తమిళంలో రూపొంది తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో అనువాద రూపంలో విడుదలై అఖండ విజయం సొంతం చేసుకొన్న చిత్రం ''రోబో''. 
 
దాదాపు నాలుగున్నరేళ్ల క్రితం విడుదలైన ఈ చిత్రం కలెక్షన్ల పరంగా సునామీ సృష్టించింది. అంతటి ఘన విజయం అనంతరం రజనీకాంత్‌ ఆరోగ్య పరిస్థితుల కారణంగా కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉన్నారు. మొన్నీమధ్య ఆయన తన కూతురు ఐశ్వర్య దర్శకత్వంలో రూపొందిన ''విక్రమసింహా'' ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. అందుకు కారణం ఆ చిత్రం పూర్తిస్థాయి యానిమేషన్‌‌తో తెరకెక్కడం. ఇన్నాళ్ల గ్యాప్‌‌ను ఫిల్‌ చేయడంతోపాటు, తన అభిమానులను అలరించేందుకు ''లింగ''గా వచ్చారు సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌. 
రాక్‌ లైన్‌ వెంకటేష్‌ నిర్మించిన ఈ చిత్రానికి కె.ఎస్‌.రవికుమార్‌ దర్శకుడు. గతంలో రజనీకాంత్‌ కు ''నరసింహా'' వంటి సెన్సేషనల్‌ హిట్‌ ఇచ్చిన రవికుమార్‌ ''లింగా'' చిత్రాన్ని వాయు వేగంతో కేవలం నాలుగున్నర నెలల వ్యవధిలో పూర్తి చేయడం విశేషం. రజనీకాంత్‌ సరసన అందాల భామ అనుష్క, ''దబాంగ్‌'' బ్యూటి సొనాక్షి సిన్హా హీరోయిన్లుగా నటించారు. రజనీకాంత్‌ కెరీర్‌‌లో మొట్టమొదటిసారిగా ఆయన పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ''లింగా'' చిత్రం ఎలా ఉందో తెలుసుకుందాం. 

 
కథ : 
రాజా లింగేశ్వర(రజనీకాంత్‌) గద్వాల్‌ సంస్థానం మహారాజు. బ్రిటిష్‌ ప్రభుత్వంలోని భారతీయ కలెక్టర్‌. తను పుట్టిన గడ్డ కోసం ఏదైనా మంచి పని చేయాలనుకొనే దాతృత్వం కలిగిన వ్యక్తి. సింగానూరు గ్రామంలోని రైతుల కష్టాలు చూసి, వాళ్ల  కోసం ఒక డ్యామ్‌‌ను నిర్మించాలనుకొంటాడు. అయితే బ్రిటిష్‌ ప్రభుత్వం అందుకు అంగీకరించకపోవడంతో, తన స్వంత డబ్బుతో ఆ డ్యామ్‌‌ను పూర్తి చేయాలనుకొంటాడు. అనుకున్నట్లుగానే డ్యామ్‌ నిర్మాణాన్ని పూర్తి చేస్తాడు. అయితే మరో బ్రిటిష్‌ కలెక్టర్‌ పన్నిన పన్నాగం కారణంగా, తాను మంచి చేసిన ఊరి వాళ్ల చేత అవమానింపబడి వేరే గ్రామానికి వెళ్ళిపోతాడు. 
 
ఆ సమయంలో ఆయన నిర్మించిన శివాలయాన్ని ఊరి ప్రజలు మూసేస్తారు. కానీ తర్వాత ఆయన గొప్పతనాన్ని తెలుసుకొన్న ఊరి ప్రజలు ఆయన్ను తిరిగి ఊరికి రప్పించి, ఆయన చేతే గుడిని తెరిపించాలనుకొంటారు. అయితే రాజా లింగేశ్వర అందుకు అంగీకరించరు. కొన్ని సంవత్సరాల తర్వాత ఆ గుడిని ఉన్నపళంగా తెరవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే.. ఆ గుడిని రాజా లింగేశ్వర మనవడు ''లింగ'' (రజనీకాంత్‌) మాత్రమే తెరవాలని ఊరి పెద్ద (కె.విశ్వనాథ్‌) పట్టుబట్టడంతో, ఆయన మనవరాలు లక్ష్మి(అనుష్క) లింగను వెతికి పట్టుకుంటుంది. 
 
గుడిని ఉన్నపళంగా తెరవాల్సిన అవసరం ఏంటి?, మినిస్టర్‌ (జబపతిబాబు) డ్యామ్‌ కూల్చేయాలని ఎందుకు ప్లాన్‌ చేస్తాడు ? రాజా లింగేశ్వర మనవడు లింగ తన తాత కట్టిన డ్యామ్‌ ను కాపాడుకోగలిగాడా? లేదా? అనే ఆసక్తికర అంశాల సమాహారమే ''లింగ'' చిత్రం. 
 
విశ్లేషణ:  
రాజా లింగేశ్వరగా, లింగగా రెండు విభిన్నమైన పాత్రల్లో రజనీకాంత్‌ అద్భుతంగా నటించారు. తనదైన స్టైల్‌ తోపాటు అబ్బురపరిచే మ్యానరిజమ్స్‌ తో అలరించారు. రజనీకాంత్‌ సరసన నటించిన అనుష్క, సొనాక్షి సిన్హా అందంతో పాటు అభినయంతో ఆకట్టుకొన్నారు. సంతానం తనదైన సంభాషణలతో కాసేపు నవ్వించే ప్రయత్నం చేశాడు. దానికి పంచ్‌ డైలాగ్‌లు తోడయ్యాయి. రత్నవేలు ఫొటగ్రఫీ బాగుంది. డ్యామ్‌ బిల్డింగ్‌ సీన్స్‌ మరియు ట్రైన్‌ ఫైట్‌ సీన్‌ పిక్చరైజేషన్‌ సినిమాకి ప్రధాన ఆకర్షణ. రజనీ సినిమాలో కన్పించాలనే తపనతో... రజనీ ఇంట్రడక్షన్‌ సాంగ్‌లో చిత్ర నిర్మాత రాక్‌లైన్‌ వెంకటేష్‌, రత్నవేలు తళుక్కుమని మెరిపించగా, ముగింపులో దర్శకుడు రవికుమార్‌ పోలీసు అధికారిగా కన్పిస్తాడు.

 
 
కె.ఎస్‌.రవికుమార్‌ పరిమిత సమయంలో అద్భుతమైన ఔట్‌‌పుట్‌ తీసుకువచ్చారు. రజనీకాంత్‌ ను స్టైలిష్‌ గా చూపించడంతోపాటు 1939 కాలంనాటి సన్నివేశాలను ఆ కాలానికి  తగ్గట్లుగా ప్రతిబింబించేలా తగిన జాగ్రత్తలు వహించారు. 
 
కాగా, కథలో పట్టు ఉన్నప్పటికీ కథనంలో వేగం లేకపోవడం పెద్ద మైనస్‌. ఎ.ఆర్‌.రెహమాన్‌ పాటల్లో పస లేదు. ఆర్‌.ఆర్‌ కూడా అంతంత మాత్రంగా ఉంది. రజనీకాంత్‌ అభిమానులు ఆనందించే విధంగా ఆయనపై బిల్డప్‌ షాట్స్‌ ను ఎక్కువగా ప్లాన్‌ చేసుకొన్న దర్శకుడు సగటు సినిమా అభిమానులను అలరించేలా మాత్రం జాగ్రత్తలు తీసుకోలేదు. క్లైమాక్స్‌ సీన్‌ లో బెలూన్‌ ఫైట్‌ సినిమాటిక్‌తో కూడిన కృతంగా వుండటం ప్రధాన లోపం.
రేటింగ్: 3/5