గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By ivr
Last Modified: శనివారం, 26 జులై 2014 (16:05 IST)

అల్లుడు శీను... బెల్లంకొండ శ్రీనివాస్‌కి ఎన్ని మార్కులు

ప్రముఖ టాలీవుడ్ నిర్మాత బెల్లంకొండ సురేష్ తన కుమారుడు బెల్లంకొండ శ్రీనివాస్‌ను హీరోగా పరిచయం చేస్తూ సమంత కథానాయికగా వి.వి.వినాయక్ దర్శకత్వంలో రూపొందిన 'అల్లుడు శీను' సినిమా శుక్రవారం విడుదలై పాజిటివ్ టాక్ తో నడుస్తోంది. అల్లుడు శీను చూసిన ప్రేక్షకులు సినిమా బాగుందని అంటున్నారు. ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ చాలా ఈజ్‌గా నటించాడని చెపుతున్నారు. ఇకపోతే ఈ సినిమా రివ్యూ గురించి చూద్దాం.
 
నటీనటులు: బెల్లంకొండ శ్రీనివాస్‌, సమంత, ప్రకాష్‌రాజ్‌, తనికెళ్ళభరణి, బ్రహ్మానందం, రవిబాబు, తమన్నా. రచన: గోపీమోహన్‌, మాటలు: కోనవెంకట్‌, సంగీతం: దేవీశ్రీప్రసాద్‌, ఎడిటింగ్‌: గౌతంరాజు, కెమెరా: ఛాటో కెనాయుడు, సమర్పణ: బెల్లంకొండ సురేష్‌, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వివి వినాయక్‌.
 
కోట్లు పెట్టి వేరే నటుడ్ని హీరోగా నిలబెట్టడం వేరు. ఆ కోట్లేదో తన వారసుడికి పెట్టి సినిమా తీయడం వేరు. బెల్లంకొండ సురేష్‌ తన వారసుడు శ్రీనివాస్‌ను హీరోగా చేయాలని తగిన శిక్షణ ఇచ్చి వెండితెరపై వదిలాడు. తొలి సినిమాకు ఎవర్ని పెట్టుకోవాలనే మరో ఆలోచన లేకుండా తన మనిషిగా వున్న వివి వినాయక్‌కు దర్శకత్వ బాధ్యతలు అప్పగించాడు. అయితే ఎంతో సీనియర్‌ నిర్మాత, సీనియర్‌ దర్శకుడు కలిసి తీస్తున్న ఈ సినిమా కథ విషయంలో బ్రహ్మాండాన్ని బద్దలు కొట్టి వుంటారని ప్రేక్షకులు వూహించి వుంటారు. మరి అలా వుందా? లేదా? అనేది తెలుసుకుందాం.
 
కథగా చెప్పాలంటే..... 
శీనుకు ఊరి నిండా అప్పులే. అతనికి మామయ్య నరసింహం ప్రకాష్‌రాజ్‌) సపోర్ట్‌ వుంటుంది. నరసింహానికి ముందూ వెనుక అన్నీ శీనే. అప్పుల బాధ నుంచి తప్పుకోవడానికి పారిపోయి చెన్నై అనుకుని హైదరాబాద్‌ వచ్చేస్తారు. అక్కడ పేరు మోసిన మాఫియా నాయకుడు భాయ్‌ (ప్రకాష్‌రాజ్‌)ను చూసి తన మామయ్యలాగే ఉన్నాడనే అనుకున్న శీను... భాయ్‌ పేరుతో దందాలు చేసేస్తుంటాడు. ఈ విషయం తెలుసుకున్న భాయ్‌... శీనును పట్టుకునేందుకు తన బ్యాచ్‌ను పంపిస్తే.. అక్కడ అనుకోకుండా నరసింహం వారికి కన్పిస్తాడు. 
 
వీడు బతికే వున్నాడా? అనే క్వశ్చన్‌మార్క్‌తో భాయ్‌... నరసింహాన్ని చంపేసే లోపలే శీను వచ్చి రక్షిస్తాడు. ఈ గొడవ జరుగుతుండగా.... భాయ్‌ తన కుమార్తె అంజలి(సమంత), తన పిఎ. డింపుల్‌(బ్రహ్మానందం)తో షార్జా పారిపోతారు. అక్కడ మరో డాన్‌ కొడుకుతో అంజలికి పెళ్లి నిశ్చయిస్తాడు. ఈ విషయం తెలుసుకున్న శీను తన బ్యాచ్‌తో కలిసి షార్జా వెళ్ళి ఆ పెళ్లిని ఎలా ఆపాడు? అసలు భాయ్‌, నరసింహం కథ ఏమిటి? అనేది మిగిలిన సినిమా.
 
నటీనటులు : 
కథానాయకుడిగా బెల్లంకొండ శీను డాన్స్‌, ఫైట్స్‌ పరంగా బాగానే చేశాడు. నటనపరంగా ఇంకా మెరుగులు దిద్దుకోవాలి. కొత్తవాడయినా సీనియర్‌ నటులతో చేయడం ఈజీగా అయినా.... అతని నేత్రాలు కాస్త మైనస్‌గా అనిపిస్తాయి. వాయిస్‌ ఫర్వాలేదు. ఒడ్డుపొడుగూ ఉన్నా.. ఇంకా రెండుమూడు సినిమాలైతేగానీ ప్రేక్షకులకు ఆనడు. సమంత తన బాణీలో తన చేసేసింది. అయితే ఇద్దరి జోడి వయస్సురీత్యా కొన్నిచోట్ల ఎక్కువ తక్కువలో కన్పిస్తాయి. (ఎలా అంటే తమ్ముడు శీనుగా కామెంట్‌ చేసేలా వుంది) ప్రకాష్‌రాజ్‌ ద్విపాత్రాభినంలోనూ అంతకుముందు తను చేసిన పాత్రలే. హీరోకు సపోర్ట్‌గా వుంటూ.. బకరా పాత్రలో బ్రహ్మానందం, రవిబాబు సరిపోయారు. బ్రహ్మానందం గత చిత్రాల్లో చేసిన కామెడీనే మళ్లీమళ్ళీ చేసినట్లుంది. తమన్నా ఐటంసాంగ్‌కే పరిమితమైంది. రఘుబాబు, భరణి వంటివారు వారి పాత్రలకు వారు న్యాయం చేశారు.
 
టెక్నికల్‌గా.....
ఈ సినిమాలో బాగా చెప్పాల్సింది సినిమాటోగ్రఫీ. ఛోటా కె.నాయుడు కనులవిందుంగా చూపించాడు. లొకేషన్లుకూడా అలాగే వున్నాయి. సంభాషణలు సీనియర్‌ రచయితలు ఇద్దరు వున్నారు కాబట్టి వారి ఫార్మెట్‌లో వారు రాసేశారు. వున్న పాటలన్నీ మాస్‌ తరహా పాటలే. పాటలకు ఎక్కువగా ఖర్చుపెట్టారు. షార్జా, విదేశాల్లో కొన్నిచోట్ల గ్రాండియర్‌గా తీశారు. నిర్మాణపు విలువలు గురించి చెప్పకక్కర్లేదు. చాలా బాగున్నాయి.
 
విశ్లేషణ : 
అల్లుడు శీను సినిమా కథ రొటీన్‌ కథ. పాత సీసాలో కొత్త నీరు. వినాయక్‌ తీసిన చిత్రాలు ఛాయలు కన్పిస్తాయి. అల్లు అర్జున్‌ నటించిన 'బన్నీ', ఓల్డ్‌ నాగభూషణం నటించిన 'భాగస్తులు' చిత్రాలు గుర్తుకువస్తాయి. ఇవి ప్రకాష్‌రాజ్‌ పాత్రను ప్రతిబింబిస్తాయి. తమిళంలో ఈ తరహాలో కథలు చాలా వచ్చాయి. చేసిందల్లా.. కొత్త హీరోతో సీనియర్‌ దర్శకుడు సినిమా తీయడం. వినాయక్‌ చిత్రాలంటే మాస్‌ను ఆకట్టుకునేలా సుమోలు ఎగరడం, యాక్షన్‌ ఎక్కువగా వుండడం మామూలే. ఈ సినిమా కూడా అలాంటివే చాలా వున్నాయి. 
 
కొత్తవాడైన శీను చేత... షార్జాలో వంద అంతస్తుల భవనం నుంచి ఆధారం లేకుండా దూకించడం, కేవలం ఒక్కతాడు ఆసరాగా సమంతను కాపాడడం వంటివి సినిమాటిక్‌గా వున్నాయి. ఇలాంటివి సినిమాలో చాలానే వున్నాయి. తిమ్మినిబమ్మిని చేసి మాస్‌ ప్రేక్షకుల్ని అలరించడమే కాన్సెప్ట్‌ వినాయక్‌ది. అది బ్రహ్మానందం ఎపిసోడ్‌లో కన్పిస్తుంది. ఇప్పుడు వస్తున్న చిత్రాల్లో యూత్‌ కమేడియన్లు వున్నా.. బ్రహ్మానందంతోనే శ్రీనువైట్ల తరహా కామెడీని చేయించేవాడు వినాయక్‌. అది కొంతమేరకు.. ఆ తర్వాత ఎబ్బెట్టుగా అనిపిస్తుంది.
 
అన్ని భాషల్లోనూ ఓ కామెన్‌ సామెత వుంది. తెలియని దానికంటే.. తెలిసింది చేయడమే బెటర్‌ అని. వినాయక్‌ చేసింది అదే. 'ఆది' సినిమా నుంచి తను ఎలా తీస్తాడో అల్లుడు శీను కూడా అలానే తీశాడు. అయితే హీరో మారాడు. ఈ కథకు పేరున్న హీరో అయితే.. మరోలా వుండేది. అందుకే తన కుమారుడే హీరో గనకు దర్శకుడు ఎటువంటి లొకేషన్లు ఏమి కావాలో అన్నీ ఇచ్చేశాడు. గ్రాండియర్‌ అంతా వెండితెరపై కన్పిస్తుంది. దాన్ని చూడ్డానికి ప్రేక్షకుడు వచ్చేరోజులు ఇంకా వుంటే సినిమా ఏవరేజ్‌గా ఆడుతుంది. ఇంత గ్రాండియర్‌ లేకుండా... హైదరాబాద్‌... ఓ పల్లెటూరు బేస్‌ చేసుకుని చక్కటి సినిమా కూడా తీయవచ్చు. ఇలా తీసినా నిర్మాతకు సేఫ్‌ ప్రాజెక్ట్‌ అయ్యేది. ఇక ప్రేక్షకులు ఎలా రీచ్ చేసుకుంటారో చూడాలి.