శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By DV
Last Modified: శుక్రవారం, 12 ఆగస్టు 2016 (14:51 IST)

'బాబు బంగారం'... అన్నీ ఉన్నాయ్, అదొక్కటే లేదు... అక్రమ సంబంధమూ...(డిటైల్డ్ రివ్యూ రిపోర్ట్)

వెంకటేష్‌ అనగానే.. విక్టరీ ముందుగా తగిలించి పిలుస్తారు. తను చేసిన గత చిత్రాలు అంతగా ఆదరణ పొందాయని అర్థం. అలాంటి వెంకటేష్‌.. వయస్సుకు తగ్గ పాత్రలు పోషిస్తూ వచ్చారు. గత ఏడాది.. పవన్‌తో కలిసి 'గోపాల గోపాల' చేశాడు. మళ్ళీ ఏడాదికి.. హోంగార్డ్‌ బ్యాక్‌డ్రాప

బాబు బంగారం నటీనటులు : వెంకటేష్‌, నయనతార, మురళీశర్మ, పోసాని, సంపత్‌, షావుకారు జానకి, ప్రణతి, వెన్నెల కిశోర్‌, బ్రహ్మాజీ తదితరులు. సాంకేతిక సిబ్బంది : సినిమాటోగ్రఫీ: రిచర్డ్‌ ప్రసాద్‌, మాటలు: డార్లింగ్‌ స్వామి, నిర్మాత: పిడివి ప్రసాద్‌, ఎస్‌. నాగవంశీ, బేనర్‌: సితార ఎంటర్‌టైన్‌మెంట్‌, సంగీతం: జిబ్రాన్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: మారుతి.
 
వెంకటేష్‌ అనగానే.. విక్టరీ ముందుగా తగిలించి పిలుస్తారు. తను చేసిన గత చిత్రాలు అంతగా ఆదరణ పొందాయని అర్థం. అలాంటి వెంకటేష్‌.. వయస్సుకు తగ్గ పాత్రలు పోషిస్తూ వచ్చారు. గత ఏడాది.. పవన్‌తో కలిసి 'గోపాల గోపాల' చేశాడు. మళ్ళీ ఏడాదికి.. హోంగార్డ్‌ బ్యాక్‌డ్రాప్‌తో ఓ సినిమా చేస్తున్నాడనీ.. అదీ మారుతీ దర్శకత్వంలో అని ప్రకటించి.. ఆ తర్వాత వద్దనుకున్నారు. ఏమి జరిగిందో ఏమోకానీ మరలా అదే దర్శకుడితో... పోలీస్‌ అధికారి పాత్రలో వెంకటేష్ నటించాడు. నయనతారతో కలిసి 'తులసి'లో చేశాడు. వీరిద్దరి కాంబినేషన్‌ ఇన్నాళ్ళకు వచ్చింది. నిజానికి వెంకటేష్‌ది జాలిగుండె అన్నమాట. కథకు మూలం అదే. దాన్ని దర్శకుడు సరిగ్గా  వుపయోగించుకున్నాడా? లేదా? అనేది 'బాబు బంగారం'లో చూద్దాం.
 
కథ :
జమిందార్‌ రాయులు(వెంకటేష్‌)ది జాలిగుండె. ప్రజలకు ఏదో చేయాలనే తత్త్వం. అదే మనవడు కృష్ణ(వెంకటేష్‌)కు వస్తుంది. చేసే వృత్తి అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ పోలీసు. పోలీసుకుండాల్సిన కటువు వుందు. అందుకే అందరి దృష్టిలో బంగారం లాంటి మనస్సువున్నవాడుగా పిలవబడతాడు. అలాంటి వ్యక్తికి పైఅధికారి మురళీశర్మ.. ఓ కేసు అప్పగిస్తాడు. ఐటీ అధికారితో పాటు మరో వ్యక్తిని హత్యచేసి పరారైన శాస్త్రిని పట్టుకుని అరెస్ట్‌ చేయడమే. అందులో భాగంగా.. శాస్త్రి పెద్ద కుమార్తె శైలజ(నయనతార)ను లవ్‌ చేస్తున్నట్లు నటించి ఆమె తండ్రి జాడ కనిపెడతాడు. విషయం తెలీక.. శైలజ కృష్ణను గాఢంగా ప్రేమించేస్తుంది. కానీ.. ఆ తర్వాత కృష్ణ ఎవరో.. ఎందుకు తనకు దగ్గరయ్యాడో తెలుసుకుని షాక్‌ అవుతుంది. నువ్వు బంగారం కాదు.. మోసకాడివని తిడుతుంది. అసహ్యించుకుంటుంది. అలాంటి పరిస్థితి నుంచి కృష్ణ.. తను ఆమె దృష్టిలో బంగారం అని ఎలానిరూపించుకున్నాడు. అన్నది మిగిలిన సినిమా.
 
పెర్‌ఫార్మెన్స్‌ :
వెంకటేష్‌ నటన గురించి చెప్పాల్సిన పనిలేదు. చంటిలో అమాయకత్వం, కొండపల్లి రాజాలోని చురుకుదనం, సూపర్‌ పోలీస్‌లోని పవర్‌ కన్పిస్తాయి. వయస్సుకు తగ్గ పాత్రను పోషించాడు. తను బాగా ఆకట్టుకునేలా వున్నాడు. నయనతార పాత్ర షరా మామూలే.. తులసిలో వీరిద్దరి కలిసి నటించారు. పాత్రకు తగినట్లు డైలాగ్‌లు చెప్పినా.. నటించడానికి పెద్దగా ఏమీలేదు. తను ఏదో పోగొట్టుకున్న ఫేస్‌లా పలు చిత్రాల్లో కన్పించినట్లే వుంది. ఆమె బావగా థర్టీ ఇయర్స్‌ ఇండస్ట్రీ పృధ్వీ.. ఎంటర్‌టైన్‌ చేశాడు. 30 ఇయర్స్‌ ఫ్రూట్‌ మార్కెట్‌.. బత్తాయి బాబ్జీగా అలరించాడు. పోసాని కృష్ణమురళి ఎంఎల్‌ఎగా కన్పిస్తాడు. చాలాకాలం తర్వాత షావుకారు జానకి ఇందులో బామ్మగా నటించింది. ఇక మిగిలిన పాత్రలన్నీ ఓకే.
 
సాంకేతికత:
ముఖ్యంగా ఫొటోగ్రఫీ గురించి చెప్పుకోవాలి. వెంకటేష్‌ను ఎంత అందంగా చూపించాడో ప్రసాద్‌.. అంతే అందంగా సన్నివేశాలను చిత్రించాడు. ఇక సంభాషణల పరంగా డార్లింగ్‌ స్వామి ప్రయోగాలు చేయకపోయినా.. పరిమితంగా మాట్లాడే విధానాన్ని వుపయోగించాడు.  దానిమ్మ పండును.. 'దానియమ్మ..'పండు అంటూ ఎంటర్‌టైన్‌ చేసే సంభాషణలు లాంటివి పెట్టాడు. పాటల పరంగా బాణీలను జిబ్రాన్‌ ఇచ్చాడు. సాహిత్యం కూడా బాగుంది. 'మల్లెల వానలా మంచు తుఫానులా..' అనే మెలోడిసాంగ్‌, 'బాబు బంగారం' అనే మాస్‌ సాంగ్‌ బాగున్నాయి. యాక్షన్‌ సన్నివేశాలు కూడా ఎంటర్‌టైన్‌ చేశాయి.
 
విశ్లేషణ:
వెంకటేష్‌ ఎంటర్‌టైన్‌ చేయడం, మిగిలిన పాత్రలూ చేయడం, సాంకేతిక బాగుంది. అన్నీ బాగున్నాయి.. అయితే ఒక్కటే లేదు. అదే కథ. సరైన కథ లేకుండా దర్శకుడు మారుతీకి దర్శకత్వం ఇవ్వడం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. కథంతా.. నయనతార తండ్రి చుట్టూ తిరుగుతుంది. నలుగురు కుమార్తెలు, తల్లికి దూరంగా.. అజ్ఞాతంలోకి వెళతాడు. కారణం.. ఆయనపై రెండు హత్య కేసులు మోపడతాయి. ఆ హత్య కేసులకు కారణమైన పాయింట్‌ కూడా చెత్తగా వుంటుంది. ఎం.ఎల్‌.ఎ పోసానికి.. తన ఆజ్ఞలు పాటించే రౌడీ భార్యకు లింక్‌ వుంటుంది. దాన్ని సెల్‌ఫోన్‌లో సరదాగా సెల్ఫీ తీసుకుని భద్రపరుస్తాడు. ఐటీ దాడుల్లో ఈ విషయం బయటపడుతుంది. రౌడీ మల్లేష్‌కు తెలిస్తే.. తనుండడు కనుక వాడ్ని రాజీ పేరుతో పిలిచి.. రౌడీ మల్లేష్‌ చేత హత్య చేయిస్తాడు పోసాని. ఈ హత్యను తన ఫోన్‌లో బంధించిన విషయం తెలుసుకున్న మల్లేష్‌, పోసాని.. శాస్త్రిని హత్య చేసేందుకు ప్రయత్నిస్తారు. అలా తప్పించుకుని అజ్ఞాతంలోకి వెళ్ళిపోతాడు శాస్త్రి.. ఇదీ అసలుకథ. 
 
శాస్త్రి ఎక్కడున్నాడో తెలుసుకోవాలంటే.. ఆయన కుమార్తెను ప్రేమిస్తున్నట్లు నటించాలి ఎసీపీ.. ఇలాంటి కథలు తెలుగులో చాలానే వచ్చాయి. ఇందులో ట్విస్ట్‌ లేదు. కథలో పట్టులేదు. కేవలం రవితేజ, సునీల్‌ వంటివారు చేయాల్సిన సినిమాను ఆరు అడుగుల పోలీసు ఆఫీసర్‌ గెటప్‌లో.. వెంకటేష్‌ చేయడం వృధా ప్రయాసే. సినిమాను రెండు గంటలు నడపాలి కాబట్టి.. మధ్యమధ్యలో పృథ్వీ, పోసాని కామెడీతో పాటు, సెకండాఫ్‌లో మ్యాజిక్‌ మల్లమ్మగా బ్రహ్మానందం లాంటి వారిని పెట్టి.. లాంగించేశాడు. బ్రహ్మానందం పాత్ర పెద్దగా పండలేదు. తను ఈ వయస్సులో కూడా ఇంకా అమ్మాయిల్ని ముద్దుపెట్టుకోవాలనుకోవడం.. వంటి సీన్లు ఇక చేయకపోవడమే బెటర్‌. 
 
ఈరోజుల్లో.. బస్టాప్‌ వంటి.. బూతు చిత్రాలు తీసి సక్సెస్‌ అయిన మారుతీ.. ఆ తర్వాత అందరు తిడుతుంటే... 'భలేభలే మగాడివోయ్‌' వంటి షార్ట్‌టైమ్‌ మైండ్‌ లాస్‌ కథతో నానితో చేసి సక్సెస్‌ చేశాడు. ఆ తర్వాత నుంచి తన పేరు ముందు దాసరి అని వేసుకుని.. దాసరి మారుతీగా స్లైడ్‌లో వేస్తున్నాడు. నాని చిత్రం తర్వాత మంచి కథతో వస్తాడని ఆశించిన.. ప్రేక్షకులకు బాబు బంగారం లాంటి కథతో రావడం విచిత్రమే. హీరోను సరిగ్గా వుపయోగించుకోకుండా.. కేవలం ఫిజిక్‌ను, అందాన్ని చూపించేసి.. వెంకటేష్‌ ఎంటర్‌టైన్‌ కూడా చేయగలడు అని నిరూపించాలనుకున్నాడు. సహజంగా వెంకటేష్‌ సినిమాలు ఫ్యామిలీ ఆడియన్స్‌ను బాగా ఆకట్టుకుంటాయి. అలాంటి హీరోను పెట్టుకుని.. అక్రమ సంబంధం అనే ఒకే ఒక్క పాయింట్‌ను ఛేదించడం అనే కాన్సెప్ట్‌తో వెంకటేష్‌ చేయడం మరీ విడ్డూరం. ఇది ఫ్యామిలీ ఆడియన్స్‌పై ప్రభావాన్ని చూపుతుంది. అందుకే.. సినిమా చూశాక..  ''అయ్యో.. అయ్యో.. అయ్యయ్యో...' అంటూ సెటైర్లు వేస్తున్నారు. 
 
రేటింగ్‌: 2.5/5