శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By PNR
Last Updated : శుక్రవారం, 10 జులై 2015 (13:11 IST)

బాహుబలి కథ వీక్... యుద్ధ సన్నివేశాలు అదుర్స్.. నిజంగానే హాలీవుడ్ తరహా చిత్రం...

చిత్రం : బాహుబ‌లి
తారాగణం : ప‌్ర‌భాస్‌, రానా, అనుష్క‌, త‌మ‌న్నా, ర‌మ్య‌కృష్ణ‌, నాజ‌ర్‌, స‌త్య‌రాజ్‌, సుదీప్ త‌దిత‌రులు
బ్యాన‌ర్‌: ఆర్కా మీడియా
స‌మ‌ర్ప‌ణ‌: కె.రాఘ‌వేంద్ర‌రావు
సంగీతం: ఎంఎం.కీర‌వాణి
సినిమాటోగ్ర‌ఫీ: ఎస్‌కె.సెంథిల్ కుమార్‌
క‌థ‌: విజ‌యేంద్ర‌ప్ర‌సాద్‌
నిర్మాత‌లు: దేవినేని ప్ర‌సాద్‌, శోభు యార్ల‌గ‌డ్డ‌
ద‌ర్శ‌క‌త్వం: ఎస్ఎస్‌.రాజ‌మౌళి
 
తెలుగు చిత్రపరిశ్రమ మాత్రమే కాకుండా, భారతీయ చిత్రపరిశ్రమ ఎపుడెపుడా అని ఎదురుచూస్తున్న చిత్రం బాహుబలి. శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. దర్శక ధీరుడు రాజమౌళి రెండేళ్లుగా శ్రమించి తీసిన చిత్రం. సినిమా అంటే నాలుగు ఫైట్లు, ఆరు పాటలు, అందులో ఓ మాస్ సాంగ్ మాత్రమే కాదని నిరూపించేందుకు తీసిన ఓ గొప్ప చిత్రం, దాదాపు 250 కోట్ల వ్యయంతో, భారీ తారాగణంతో తన కలల ప్రాజెక్టుగా నిర్మించారు. కథలే కరువయిన ప్రస్తుత రోజుల్లో ఓ పురాతన కథతో తెలుగు సినిమా అంటే ఏంటో రుచి చూపడానికి రాజమౌళి టీమ్ ఎంతో శ్రమించి రూపొందించిన ఓ అద్భుత దృశ్య కావ్యమే ఈ బాహుబలి.
 
దర్శకుడు రాజమౌళి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. థియేటర్స్‌లో సినిమా చూస్తున్న ప్రతి ప్రేక్షకుడి నాడి ఎలా పట్టుకోవాలో రాజమౌళికి బాగా తెలుసు.. బాహుబలి చిత్రంలో కూడా కొన్ని సీన్స్ చూస్తుంటే రోమాలు నిక్కబొడుచుకునేలా ఉంటాయి. ఈ చిత్రంలో హైలైట్స్ అంటే సెకండాఫ్‌లో వచ్చే యుద్ధ సన్నివేశాలే. ఈ పోరాటాలు చూస్తే రెండు కళ్ళూ చాలవు అనిపిస్తుంది. దాదాపు 1000 మంది సైనికులతో వెండితెరపై యుద్ధం చూస్తుంటే అబ్బ అనే ఫీలింగ్ ప్రతి ప్రేక్షకుడికి కలుగుతుంది. 
 
ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌లో ప్రభాస్, రానాల ఇంట్రడక్షన్, శివగామి పాత్రలోని ఎలివేషన్ సీన్స్ సూపర్బ్. ఇక చివర 30 నిమిషాల పాటు సాగే వార్ ఎపిసోడ్ ఆడియన్స్ మతి పోగొడుతుంది. అలాగే ఇంట‌ర్వెల్ బ్యాంగ్‌ అదిరిపోయింది. రాజమౌళి, సెంథిల్ కుమార్, సాబు సిరిల్, శ్రీనివాస్ మోహన్ కలిసి క్రియేట్ చేసిన మాహిష్మతి రాజ్యం చూస్తుంటే ఇది తెలుగు సినిమా కాదు, ఏదో హాలీవుడ్ మూవీ సెట్ చూస్తున్నాం అనిపిస్తుంది. ప్రభాస్, తమన్నాల మధ్య వచ్చే రొమాంటిక్ సన్నివేశాలు అందరిని ఆకట్టుకుంటాయి. అయితే, ఈ చిత్రం కథలో కొన్నిచోట్ల పట్టు తప్పినట్టనిపిస్తుండటంతో ఒకింత నిరాశకు లోనుచేసే అంశంగా చెప్పుకోవచ్చు.