బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By selvi
Last Updated : శుక్రవారం, 26 జనవరి 2018 (18:46 IST)

#Bhaagamathie రివ్యూ రిపోర్ట్: హారర్‌తో ఆకట్టుకునే పొలిటికల్ థ్రిల్లర్.. కత్తి పాజిటివ్ రిపోర్ట్

లేడి సూపర్ స్టార్ అనుష్క నటించిన తాజా చిత్రం భాగమతి. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ సందర్భంగా విడుదలైంది. బాహుబలి సినిమాకు తర్వాత అనుష్క నటించిన భాగమతి సినిమా ప్రేక్షకుల్లో అంచనాలను భారీగ

లేడి సూపర్ స్టార్ అనుష్క నటించిన తాజా చిత్రం భాగమతి. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ సందర్భంగా విడుదలైంది. బాహుబలి సినిమాకు తర్వాత అనుష్క నటించిన భాగమతి సినిమా ప్రేక్షకుల్లో అంచనాలను భారీగా పెంచింది. దేవసేనగా అనుష్క అబ్బురపరిచే నటనతో ఆకట్టుకోవడంతో ఆమె నటించే తదుపరి సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రానికి పిల్ల జమీందార్ ఫేమ్ అశోక్ దర్శకుడు. యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మించిన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తోంది. భాగమతిగా అనుష్క ప్రేక్షకులకు దగ్గరైందనే చెప్పాలి.  
 
కథలోకి వెళితే.. 
సివిల్స్ టాపర్ చెంచల (అనుష్క) నిజాయితీగల ఐఏఎస్ ఆఫీసర్. భారీ నీటిపారుదల శాఖా మంత్రి ఈశ్వరప్రసాద్ (జయరామ్) వద్ద సెక్రటరీ పనిచేసే చెంచల ప్రాణధార ప్రాజెక్టు నిర్వాసితుల పక్షాన నిలిచిన శక్తి (ఉన్ని ముకుందన్) మంచితనానికి ఫిదా అవుతుంది. అతనిని ప్రేమిస్తుంది. అతని కోసం ప్రాజెక్టు పనుల విషయంలో జోక్యం చేసుకుంటుంది. అయితే ఓ సందర్భంలో తను ప్రేమించిన శక్తిని చెంచల హత్య చేసి జైలుకు వెళ్తుంది. చెంచలను సీక్రెట్ ఎంక్వైరీ పేరుతో భాగమతి బంగ్లాకు తరలిస్తారు. అక్కడ ఏం జరిగింది? తాను ప్రేమించిన వ్యక్తినే చెంచెల ఎందుకు చంపింది అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.  
 
విశ్లేషణ: 
హారర్ సినిమా అని ట్రైలర్ చూసినవారంతా అనుకుంటారు. భాగమతి కథ అంతకన్నా కానేకాదు. చెంచల కథనే ప్రధానంగా నడిపించాడు దర్శకుడు. మంచి తనం ముసుగుతో కోట్లానుకోట్లు కొల్లగొట్టి ముఖ్యమంత్రి పీఠాన్ని అదిష్టించాలనుకునే ఓ కుటిల రాజకీయ నాయుడి నేర సామ్రాజ్యం చుట్టూ దర్శకుడు కథను అళ్లుకుని దానికి చారిత్రక నేపథ్యం వున్న భాగమతి బంగ్లా నేపథ్యాన్ని జోడించాడు. తద్వారా హారర్ సినిమా భ్రమను కలిగించాడు.  భాగమతిని పొలిటికల్ థ్రిల్లర్‌లా చెప్పుకోవచ్చు. 
 
అయితే నిజమైన హారర్ సినిమా చూసే భావన కలుగుతుంది. ఆ విషయంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. భాగమతి డైలాగులు, వణుకు పుట్టే సన్నివేశాలు అదుర్స్ అనిపించాడు. కానీ దర్శకుడు ఎక్కువ భాగం ఆ బంగ్లాను చూపించడానికే సమయం తీసుకోవడం కొంత సాగదీతగా అనిపిస్తుంది. ఇంటర్వెల్ బ్యాంగ్‌లో చెంచల కాస్త భాగమతిగా మారిపోయిందని చూపించడంతో కథ ఆసక్తికరమైన మలుపు తీసుకుంటుంది. పతాక ఘట్టాలు బాగున్నాయి. 
 
నటీనటులు:
చెంచలగా, భాగమతిగా అనుష్క అద్భుతంగా నటించింది. రెండు పాత్రల్లోనూ వైవిద్యాన్ని చూపించింది. టైటిల్‌లో జీవించింది.  సినిమాను నడిపించిన తీరు అందరికి నచ్చుతుంది. నీటిపారుదల శాఖ మంత్రిగా జయరామ్, ప్రేమికుడిగా ఉన్నిముకుందన్, సీబీఐ అధికారిని వైష్ణవీ నటరాజన్‌గా మలయాళ నటి ఆశాశరత్, సీఐ సంపత్‌గా మురళీశర్మ తమ తమ పాత్రలకు తగిన న్యాయం చేశారు. తమన్ సంగీతం, ఫోటోగ్రఫీ, యూవీ క్రియేషన్స్ నిర్మాణ విలువలు అదుర్స్ అనిపించాయి.
 
కత్తి మహేష్ పాజిటివ్ రివ్యూ 
భాగమతి సినిమాపై ప్రముఖ సినీ విశ్లేషకుడు కత్తి మహేశ్ కూడా రివ్యూ ఇచ్చాడు. భాగమతి సినిమా హారర్‌తో ఆకట్టుకునే పొలిటికల్ థ్రిల్లర్ అని ట్వీట్ చేశాడు. అనుష్క తన పాత్రలకు న్యాయం చేసిందన్నాడు. జయరామ్, ఆషాశరత్ నటన బాగుందని, మాధీ సినిమాటోగ్రఫీ, రవీందర్ ఆర్ట్, తమన్ సంగీతం, అశోక్ దర్శకత్వంతో సినిమా బాగా వచ్చిందన్నాడు.