గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By DV
Last Modified: శుక్రవారం, 4 సెప్టెంబరు 2015 (16:26 IST)

'భలే భలే మగాడివోయ్' సరదాగా చూసేయచ్చు.. 'భలేభలే' రివ్యూ రిపోర్ట్...

భలేభలే మగాడివోయ్ నటీనటులు: నాని, లావణ్య త్రిపాఠి, మురళీశర్మ, అజయ్‌, సీనియర్‌ నరేష్‌, సితార, మధుమిత, వెన్నెల కిశోర్‌, శ్రీనివాసరెడ్డి, ప్రవీణ్‌ తదితరులు; కెమెరా: నిజార్‌ షఫి, సంగీతం: గోపిసుందర్‌, నిర్మాతలు: బన్నీవాసు, వంశీ, రచన, దర్శకత్వం: మారుతి
 
పాయింట్‌: మతిమరుపు వ్యక్తి ప్రేమలో పడితే..
 
నాని హీరోగా కొంతకాలం బ్రేక్‌ ఇచ్చాడు. బ్రేక్‌ కంటే.. అవకాశాలు రాలేదనే చెప్పాలి. వచ్చిన అవకాశాలు సక్సెస్‌ పొందలేకపోయాయి. అలాంటి ఆయన.. ఈరోజుల్లో.. వంటి ద్వందార్థాలు సినిమాలు తీసే దర్శకుడు మారుతీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తీర్చిదిద్దే ప్రయత్నం చేశాడు. అదే భలేభలేమగాడివోయ్‌.. మరి అది ఎలా తీశాడు? ఏమిటో చూద్దాం.
 
కథ:
లక్కీ (నాని) పరిశోధన చేసే స్టూటెంట్‌. కానీ మతిమరుపు జాస్తి. తల్లిదండ్రులు ఇలాంటి మతిమరుపు వాడికి పెండ్లిచేయలేక సతమతమవుతుంటారు. అలాంటివాడు మొదటిచూపులోనే లావణ్యను ప్రేమించేస్తాడు. అందుకోసం తనేం చేస్తున్నాడో తెలీకుండా మంచి పనులు చేసేస్తాడు. ఇదంతా కేవలం మతిమరుపు వల్లే. అదెలా వుంటుందంటే... మామగారు పిల్లనివ్వాలని వస్తే.. ఫోన్‌ రాగానే ఇది మర్చిపోయి ఫోన్లలో సోది మొదలుపెడతాడు. ఇలాంటివాడిని తన కూతురు ఇవ్వనని తేల్చిచెబుతాడు. 
 
పోతేపోయిందనుకుని.. తను ప్రేమించిన లావణ్యతో ప్రేమ కొనసాగిస్తాడు. అక్కడ కూడా మతిమరుపును కవర్‌ చేసేందుకు రకరకాల కథలు అల్లుతాడు. ఫైనల్‌గా.. తను ప్రేమించిన లావణ్య.. ఒకప్పుడు తనకు పిల్లనివ్వనని అసహ్యించుకున్న వ్యక్తేనని తెలిసి.. ఎలాగైనా... లావణ్యను దక్కించుకునేందుకు తన ఫ్రెండ్‌ వెన్నెల కిశోర్‌తో డ్రామ ఆడతాడు. కిశోర్‌ను లక్కీగా పరిచయం చేసి ఆయన వద్దే అసిస్టెంట్‌గా చేరతాడు. ఆ తర్వాత కథ ఎటువైపు మళ్లింది అనేది సినిమా.
 
పెర్‌ఫార్మెన్స్‌
నటుడిగా నాని అన్ని షేడ్స్‌ పలికించేశాడు. స్వతహాగా అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా అనుభవమున్నవాడు కనుక ఏ సీన్‌ ఎలా చేయాలో నాచురల్‌గా చేసేశాడు. కామెడీ టైమింగ్‌.. అంతా బాగుంది. అందాల రాక్షసి తర్వాత లావణ్య నటించిన సినిమా.. కాస్త పాత్ర ఎక్కువే. ఆమె తండ్రిగా మురళీశర్మ బాగా చేశాడు. నాని స్నేహితుడి ప్రవీణ్‌ ఒకరకంగా అలరిస్తే.. వెన్నెల కిశోర్‌ మరోరకంగా ఎంటర్‌టైన్‌ చేస్తాడు. అజయ్‌ పోలీసు అధికారిగా నెగెటివ్‌ రోల్‌ ప్లేచేశాడు. ఇలా ప్రతి పాత్ర తమ మేరకు నటించేశారు.
 
సాంకేతికంగా...
ముఖ్యంగా ఇందులో చెప్పుకోవాల్సింది సంగీతం. గోపీసుందర్‌ బాణీలు ఆకట్టుకునేలా వున్నాయి. నేపథ్య సంగీతం ఫర్వాలేదు. సఫి ఫొటోగ్రఫీ కొన్ని సీన్లలో పేలవంగా సాగింది. గీతా ఆర్ట్స్‌ కాంపౌండ్‌ మనిషి గనుక బన్నీవాసు బాగా నిర్మించాడు. దర్శకుడిగా మారుతీ.. తన పాత ముద్ర నుంచి బయటపడేందుకు ట్రై చేశాడు. అందుకే ఎక్కడా అతి అనిపించకుండా జాగ్రత్తపడ్డాడు. ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌. పర్వాలేదు. లైటింగ్‌ కొన్ని చోట్ల డల్‌గా వుంది. యాక్షన్‌ సన్నివేశాలు పతాక సన్నివేశంలో వస్తాయి. అవికూడా కథపరంగానే వున్నాయి.
 
విశ్లేషణ
ఈ చిత్రం గురించి చెప్పాల్సివస్తే.. ముందుగా నాని నటన... కథను డీల్‌ చేసే విధానంలో మారుతీ గురించే.. చిన్న చిన్నవిషయాలు ఎంటర్‌టైనింగ్‌ చూపించాడు. చాలా సింపుల్‌గా డీల్‌ చేస్తూ మతిమరుపు అనే కాన్సెప్ట్‌ను నవ్వుపుట్టేలా చేశాడు. అందుకు శంకర్‌ దాదా జిందాబాద్‌లోని క్యారమ్‌ సీన్‌ కూడా వాడేసుకున్నాడు. మతిమరుపు అనే కాన్సెస్ట్‌.. గజనీలో చూశాం. కానీ అది వేరే కాన్సెప్ట్‌. ఇందులో ఒక విషయంపై శ్రద్ధ పెట్టినప్పుడు మరో విషయంలోకి వెళితే.. అంతకుముందుది మర్చిపోతాడు. ఇది చిన్నపిల్లల్లో ఎక్కువగా వుంటుంది. కానీ పెద్దయ్యాక.. ఇలాంటి కేసులు తక్కువగానే వుంటాయి. కానీ మరి అంత టూమచ్‌గా ఎక్కడా కన్పించవు. ఇందులో నాని మతిమరుపులు ఆశ్చర్యంగానూ, వింతగానూ వుంటుంది.
 
జీవితంలో మనిషికి ఏదో లోపం వుంటుంది. అలాగనీ తను ప్రేమకు అనర్హుడు కాదని చెప్పిన చిత్రమిది. పెద్ద సందేశాలు లేకుండా డైలాగ్‌తో మారుతీ చెప్పాడు. మొదటిభాగం హీరోహీరోయిన్ల ప్రేమతో చాలా స్పీడ్‌గా సాగిపోతుంది. అజయ్‌ పాత్ర లావణ్యను పెండ్లి చేసుకోవాలని.. ఆమెను ఎలా ట్రాప్‌ చేశాడనేది సెకండాఫ్‌లో చూపించినా.... నాని గురించి లావణ్య తండ్రికి తెలిసినంతగా.. లావణ్యకు తెలియకపోవడం... చంచలమనస్సుకు నిదర్శనంగా ఓ సన్నివేశంలో చూపిస్తాడు. ఇలా తనను వద్దనుకున్న మామ చేతనే అల్లుడు అనిపించుకున్న కథ.. ఇది. అక్కడక్కడ కొన్ని లాజిక్‌లు లేని విషయాలు వున్నా... నాని తరహాలో సాగే ఎంటర్‌టైనర్‌.. కాసేపు సరదాగా చూడవచ్చు.
 
రేటింగ్‌: 2.5/5