గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By ivr
Last Updated : శుక్రవారం, 31 అక్టోబరు 2014 (17:08 IST)

పెర్ఫ్యూమ్ కాదు పెప్పర్... షాక్ కొట్టే 'కరెంట్ తీగ' రివ్యూ రిపోర్ట్

కరెంట్ తీగ నటీనటులు : మంచు మనోజ్‌,  రకుల్‌ప్రీత్‌ సింగ్‌, సన్నీ లియోన్‌, సుప్రీత్‌, జగపతి బాబు, గిరిబాబు, పృథ్వీ, తనికెళ్ళ భరణి తదితరులు
 
తెలుగు సినిమాలకు కథలు దొరక్కపోతే ఈజీ మార్గం పరభాషలో హిట్టయిన చిత్రాలను తీసుకోవడం. అలాంటి ప్రయోగాలు చేసి చాలామటుకు ఇక్కడా విజయాలు సాధించినా కొన్ని ఫెయిల్‌ అయిన సందర్భాలున్నాయి. అలాంటి చిత్రాల్లో 'కరెంట్‌ తీగ'ను చెప్పుకోవచ్చు. తమిళంలో 2013లో విజయవంతమైన 'వరుతప్ప దత్త వలిబర్‌ సంఘం'ను తీసుకున్నారు. అయితే ఈ కథలోని పాయింట్‌ బాగున్నా... అది మన నేటివిటీకి తగినట్లుగా తీసుకోవడం పాత్రలను ఎంచుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. మరి ఈ కరెంట్‌ తీగలో అటువంటివి వున్నాయా? అసలు కరెంట్‌ తీగ అంటే ఏమిటి? అనేది తెలుసుకోవాలంటే కథలోకి వెళ్ళాల్సిందే.
 
కథగా చెప్పాలంటే... 
ఓ ఊరిలో పెద్ద శివరామరాజు(జగపతిబాబు). ఇంటాబయట తన చెప్పిందే వేదం. తన కుటుంబంలోని వారు తన మాట కాదని ప్రేమించినవాడితో పెండ్లి చేసుకుంటే... తన చెవి కోసుకుంటానని ప్రత్యర్థి రామరాజు(సుప్రీత్‌)తో పందెం వేస్తాడు. ఆ ఊరిలో చిన్న కుటుంబానికి చెందిన రాజు(మనోజ్‌) చదువుసంధ్యా లేకుండా స్నేహితులతో ఎంజాయ్‌ చేస్తుంటాడు. ఊరిలో స్కూల్‌ లాంటి కాలేజీలో కవిత (రకుల్‌ప్రీత్‌సింగ్‌) బైపీసీ చదువుకుంటుంది. ఆంగ్ల టీచర్‌గా సన్నీ పనిచేస్తుంది. ఆమెకు రాజు ప్రేమలేఖలు రాస్తాడు. అవి కూడా కవిత ద్వారా పంపిస్తాడు. ఆఖరికి సంపూర్ణేష్‌ బాబును పెండ్లి చేసుకుని వెళ్ళిపోతుంది. ఆ తర్వాత కవితను తన మనస్సుతో చూసి ప్రేమించేస్తాడు. మరి ఊరిని భయపెట్టే శివరామరాజు ఊరుకుంటాడా? పందెం కోసం తన చెవిని కోసుకుంటాడా? మరి మనోజ్‌ ఆయన్ను మార్చాడా? కవితను పెండ్లి చేసుకున్నాడా? అనేది మిగిలిన కథ.

 
పెర్‌ఫార్మెన్స్‌ 
సినిమా అనగానే నటీనటుల పెర్‌ఫార్మెన్స్‌ ముఖ్యం. హీరోగా మనోజ్‌ ఇంకా పరిణితి చెందాల్సివుంది. ఎప్పుడూ ఒకే ఫీలింగ్‌తో డైలాగ్‌లు అప్పజెపితే ఈనాటి ట్రెండ్‌కు సూటవ్వదు. అసలు నటుడిగా ఇంకా నేర్చుకోవాల్సింది చాలా వుంది. క్లైమాక్స్‌లో జగపతిబాబుతో పలికే డైలాగ్‌లు చాలా ఎక్కువతక్కువల్లో చెపాల్సినవి మామూలుగానే చెప్పేస్తాడు. ఇంతకంటే అతని గురించి చెప్పాల్సింది ఏమీలేదు. 
 
నటిగా రకుల్‌ప్రీత్‌ సింగ్‌ ఫర్వాలేదు. పెద్దగా నటించే ఛాన్స్‌ లేకపోయినా కొద్దిలోకొద్దిగా హావభావాలు పలికించింది. టీచర్‌గా సన్నీ పాత్ర అయినా... డ్రీమ్‌సాంగ్‌లో ఆమె కవ్వించే వలపులు మాస్‌ను ఆకట్టుకుంటాయి. జగపతిబాబు ఊరిపెద్దగా సరిపోయాడు. కానీ ఆ పాత్రను చివర్లో తేల్చేశాడు దర్శకుడు. తనికెళ్ళ భరణి, రఘుబాబు, గిరిబాబు, సుప్రీత్‌ పాత్రలు ఓకే. 
 
హీరో స్నేహితులుగా తాగుబోతు రమేష్‌, వెన్నెల కిషోర్‌ కాస్త నవ్విస్తారు. అందరికంటే పీటల దాకా వచ్చి పెటాకులయ్యే పెండ్లికొడుకుగా పృధ్వీ పాత్ర బాగా వచ్చింది. ఒరిజినల్‌ను అదేవిధంగా దింపేశారు. కన్పించిన ఒక్క సెకనైనా సంపూర్ణేష్‌ బాబు రాగానే ప్రేక్షకులు ఎంజాయ్‌ చేశారు.
 
టెక్నికల్‌గా...  
చెప్పాల్సింది... అచ్చు సంగీతం. తమిళంలో మ్యూజిక్‌ను యాజ్‌టీజ్‌గా ఇచ్చేశాడు. సాహిత్య పరంగా ఒక మాదిరిగా వున్నట్లు సంగీతం కూడా వుంది. సతీష్‌ ముత్యాల సంభాషణలు మాస్‌ను ఆకట్టుకునేలా వున్నాయి మినహా ప్రత్యేకత ఏమీలేదు. విజయకుమార్‌ సినిమాటోగ్రఫీ ఏవరేజ్‌గా వుంది. ఎడిటింగ్‌ సోసోగా వుంది.

రేటింగ్ : 2.5/5                                                                           విశ్లేషణ రెండో పేజీలో చూడండి...
 
విశ్లేషణ : 
ఊరిపెద్ద కూతురు ఆవారాగా తిరిగేవాడ్ని ప్రేమించడం, పెండ్లి చేసుకోనేక్రమంలో వచ్చే ట్విస్టులే ఈ సినిమా కథ. ఇటువంటి కథలు తెలుగులో చాలా వచ్చాయి. తమిళంలో విజయవంతమైన సినిమాను తీసుకోవడం ఎందుకో అర్థంకాలేదు. తీసుకున్నా ఇక్కడి నేటివిటీని చూపించడంలో దర్శకుడు ఫెయిలయ్యాడు. ఏ సన్నివేశంలోనూ ఫీల్‌ కన్పించదు. ఎప్పుడో '6టీన్స్‌' అనే సినిమాతో వెలుగులోకి వచ్చిన దర్శకుడు జి. నాగేశ్వరరెడ్డి. ఆ తర్వాత ఆయనకు అంత హిట్‌ రాలేదు. 
 
కిందామీద పడుతూ సినిమాలు తీస్తున్నా సక్సెస్‌ కాలేదు. చాలా గ్యాప్‌ తర్వాత కరెంట్‌ తీగ తీశాడు. అదికూడా మక్కికిమక్కి తీసినా బాగుండేదని తమిళ చిత్రాన్ని చూసిన వారు చెబుతుంటే ఆశ్చర్యమేస్తుంది. అంటే అంత బాగా తెలుగులో తీశాడన్నమాట. ఎక్కడ ఫీల్‌ కన్పించదు.
 
సంభాషణల పరంగా సన్నీ చేత సూక్తులు చెప్పిస్తాడు. ఆడది పెర్‌ఫ్యూమ్‌ కాదు. పెప్పర్‌ లాంటిది. ఐ లవ్‌ యు చెబితే.. పెప్పర్‌ పోయి అంటూ హీరోయిన్‌కు సూక్తి చెబుతుంది. దర్శకుడు మాత్రం ఆమెను డ్రీమ్‌సాంగ్‌లో బాగా యూజ్‌ చేసుకున్నాడు. కేవలం మార్కెట్‌ కోసం ఆమెను పెట్టినట్లుంది మినహా ఆ పాత్రలో ప్రత్యేకత ఏమీలేదు. జగపతిబాబు పాత్ర ఆయన గెటప్‌కు ఈ చిత్రం చేయాల్సింది కాదు. 
చివర్లో బఫూన్‌గా తీసేశారు. సుప్రీత్‌ చేసినా సరిపోయేది. ఇది కూడా కేవలం బిజినెస్‌ కోసమే... చాలాచోట్ల లాజిక్కులు అందవు.. స్కూల్‌డ్రెస్‌లో కవిత వెళుతూ.. కాలేజీ అని తర్వాత మాట్లాడటం. చివర్లో స్కూల్‌డ్రెస్‌లో వుంటే అందాన్ని చూడలేదని హీరో చెప్పడం.. వంటివి కన్‌ఫ్యూజ్‌గా వుంటాయి.  విలన్‌గా ఓ టీవీ నటుడ్ని, మరో బాలీవుడ్‌ నటుడ్ని పెట్టారు. అది కూడా కథకు ఏమాత్రం ఉపయోగపడవు.
 
ఒక సినిమా హిట్‌ కావాలంటే ప్రేమకథతోపాటు కాస్త మాస్‌ అంశాలు, కామెడీ వుంటే చాలు. ఈ పాలసీనే మంచు మనోజ్‌ తీసుకున్నాడు. ఓ సందర్భంలో ఇదే విషయాన్ని చెబుతాడు కూడా. హీరో అంటే నాలుగు ఫైట్లు, సాంగ్స్‌, బాడీని చూపించడం కాదు. కాస్త నటన కూడా వుండాలి. అది ఈ సినిమాలో మనోజ్‌కు మైనసే. టైటిల్‌ కూడా ఏమాత్రం సింక్‌ కాలేదు. ఏతావాతా ఈ సినిమా వుపయోగపడింది పృథ్వీ, వెన్నెలకిషోర్‌ వంటి నటులకే. కరెంట్‌ తీగను ముట్టుకుంటే మటాషే అంటాడు. నిజంగానే ప్రేక్షకుడికి విసుగుపుట్టిస్తుంది. ముట్టుకుంటే షాక్‌ కొడుతుంది.

రేటింగ్ : 2.5/5