మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By DV
Last Modified: శనివారం, 9 మే 2015 (13:27 IST)

కిక్‌లేని 'దాగుడుమూత...', మళ్లీ అనుబంధాలు, ఆప్యాయతలంటూ... రివ్యూ రిపోర్ట్

దాగుడుమూత దండోకోర్ చిత్రం నటీనటులు: రాజేంద్రప్రసాద్‌, బేబీ సారా అర్జున్‌, అంతా టీవీ ఆర్టిస్టులే.
 
కథ: తమిళ 'శైవం', సంగీతం: సాయి, నిర్మాతలు: రామోజీరావు, క్రిష్‌, దర్శకత్వం: ఆర్‌కె. మలినేని.
 
పాయింట్‌: మంచి చేస్తే అంతా మంచేజరుగుతుందనేది.
 
తెలుగు సినిమాల్లో సెంటిమెంట్లు పుష్కలంగా వుంటాయి. అవి మన రక్తంలో జీర్ణించుకుపోయి వుంటాయి. విలువైన అనుబంధాలు, ఆప్యాయతలు అనేవి తెలుగువారికి కొత్తేమీకాదు. అమ్మ, నాన్న, పిల్లలు, తాత, అమ్మమ్మలు కలిసి ఉమ్మడి కుంటుంబంగా వుంటే పెద్దలకు ఎంత ఆహ్లాదరకంగా వుంటుందో... కాన్సెప్ట్‌ బ్లాక్‌ అండ్‌ వైట్‌లో ఉమ్మడికుటుంబం వంటి చిత్రాలు చెప్పాయి. రానురాను కాలంతోపాటు అనుబంధాలు మారాయి. మళ్ళీ వాటిని తెలుగువారికి పరిచయం చేయడంకోసం గత కొన్నేళ్ళుగా రకరకాలుగా సినిమాల ద్వారా ప్రయత్నాలు చేస్తూనే వున్నారు. అందులోని ఓ ప్రయత్నమే దాగుడుమూతలు దండాకోర్‌. తీసింది క్రిష్‌, రామోజీరావు అనేసరికి ఏముంటుందో అన్న ఆసక్తి కలగడం సహజమే. మరి ఎలా వుందో చూద్దాం.

 
కథగా చెప్పాలంటే...
రాజుగారు (రాజేంద్రప్రసాద్‌) కోనసీమలోని ఓ ఊరికి పెద్ద. గుడిలో ఉత్సవాలు ఆయనే మొదలుపెట్టాలి. ఢిల్లీ నుంచి, మరో ప్రాంతం నుంచి కూతురు, కొడుకు కుటుంబాలు వస్తున్నాయనగానే ఎక్కడలేని ఉత్సాహంతో వారికి అన్ని ఏర్పాట్లు చేస్తాడు. ఇక్కడికి రాగానే ఒక్కొక్కరికి ఒక్కో కథ. ఎవ్వరూ జీవితంలో ఉత్సాహంగా వుండరు. కొడుకు చేసే కాంట్రాక్ట్‌ వ్యాపారంలో బిల్‌ పాస్‌ కాదు. కూతురు భర్త విధి నిర్వహణలో తప్పు చేయడంతో జైలు వరకు వెళ్ళాల్సి వస్తుంది. ఇలా తలో సమస్యతో వుంటున్నా... పైకి తండ్రి ముందు అంతా బాగున్నట్లే కన్పిస్తారు. రాజుగారి రెండో కొడుకు తనవద్దే వుంటూ వ్యవసాయం చేసుకుంటుంటాడు. ఆయన కూతురు సారా అర్జున్‌. మనవరాలంటే వల్లమాలిన ప్రేమ. పశువులు, పక్షుల్ని పెంచే అలవాటు. కోడిపుంజు అంటే మరీను. 
 
ఇలా సాగుతున్న తరుణంలో.. అపసవ్య సంఘటన జరుగుతాయి. పూజారిని కలిస్తే... అమ్మవారు ఆగ్రహించారు. ఏదైనా మొక్కు నెరవేర్చలేదేమోనని వెల్లడిస్తారు. ఇక ఫ్లాష్‌బ్యాక్‌లో పొరపాటున కాలువలో పడిన మనవడు, మనరాలిని బతికించే ఉద్దేశ్యంతో రాజుగారి భార్య అమ్మవారికి మొక్కుకుంటుంది. అది వారు పెరిగి పెద్దయ్యాక కూడా తీర్చలేదు. దాంతో తీర్చాలని అనుకుంటారు. అందుకే కోడిపుంజును ప్రేమగా పెంచుతారు. ఇక అమ్మవారి కోరిక ప్రకారం పుంజును బలి ఇవ్వాలి. ఆరోజు కోడిపుంజు కన్పించకుండా పోతుంది. దానికోసం వెతికే కథే మిగిలిన సినిమా.
 
పెర్‌ఫార్మెన్స్‌
రాజేంద్రప్రసాద్‌ గురించి చెప్పాల్సింది ఏమీలేదు. అయితే... తాతగా హుందా లాంటి పాత్రను ఆయన నూరుశాతం న్యాయం చేయలేదనిపిస్తుంది. నాజర్‌, విశ్వనాథ్ వంటి పాత్రలు దానికి సరిపోతాయని అనిపిస్తుంది. రాజేంద్రప్రసాద్‌ కొద్దిగా ఓవర్‌గా చేసినట్లుగా కన్పిస్తుంది. సారా అర్జున్‌... చైల్డ్‌ ఆర్టిస్టుగా బాగా నటించింది. చాలా ఈజీగా చేసేసింది. ఇక మిగిలిన వారి గురించి... వారివారి పాత్రలు న్యాయం చేశారనే చెప్పాలి.
 
టెక్నికల్‌గా.. 
సినిమాటోగ్రఫీ.. బాగానే వుంది. సీతారామశాస్త్రి కొడుకు సాయి ఇచ్చిన సంగీతం బాగుంది. సాహిత్యం కూడా తెలుగుదనం ఉట్టిపడేట్లుగా వుంటుంది. వినడానికి వినసొంపుగా వున్నాయి. ఎడిటింగ్‌, ఆర్ట్‌ ఫర్వాలేదు. అయితే కథ ఎలాగూ తమిళ నేటివిటీ కాబట్టి.. చెప్పేదేముంది. తెలుగు కోసం కొద్దిగా మార్పులు చేసినా ఆ వాసన ఎక్కడా పోలేదు అనిపిస్తుంది. స్క్రీన్‌ప్లే ఫర్వాలేదు. 
 
విశ్లేషణ
అనుబంధాలు ఎంత బాగుంటాయో.. అవి లేకపోయినా అంతే బాగుంటాయని చాలా చిత్రాలు చూపించాయి. డిల్లీలో పుట్టిపెరిగిన మనవడు... విలేజ్‌లో వుండే పద్ధతుల్ని అసహ్యించుకోవడం, ఇక్కడివారు మూర్ఖులు అంటూ అనుకోవడం.. ఇప్పటి ట్రెండ్‌ ఆలోచనలకు దర్పణం. అయితే కథలోని పాయింట్‌ చాలా చిన్నది. దాన్ని సాగదీతగా లాగిలాగి చూపించడం విశేషం. తమిళంలో హిట్‌ అయిన ఈ చిత్రంలో పేరులేని నటీనటులు నటించారు. అయితే తెలుగులో పేరున్నవారు చేయడంతోపాటు... ఆ నేటివిటీ మనకు సెట్‌ కాదనిపిస్తుంది. విలేజ్‌లో వుండే అలవాట్లు, వ్యక్తుల ప్రవర్తన చూడ్డానికి బాగానే వున్నా... కోడి కోసం పడే కొట్లాటలు, వెతికే క్రమంలో 'బొబ్బొ..బొబ్బో...' అంటూ అందరూ వెతికే విధానం కాస్త ఓవర్‌గా అనిపిస్తుంది.
 
కథనంలో ఎక్కడా ట్విస్ట్‌లు వుండవు. తర్వాత ఏం జరుగుతుందో పిల్లల్లకు తెలిసిపోతుంది. అమ్మవారికి బలి ఇవ్వడానికి కోడిపుంజును తీసుకువస్తే... అదే అమ్మవారిని క్షమించమని... ప్రాణం తీయలేమని చెప్పడం... విశ్వంలో అన్ని జీవులు ఒక్కటే... అమ్మవారిని ఎవరినీ బలికోరరు. మనలోని కోరికలు అలా వుంటాయనే చిన్నపాటి సందేశం ఓకే. 
 
కానీ దీని గురించి గంటన్నరకు పైగా కూర్చోవాలి. ఇదేదో కొత్త కథకాదు. అనుబంధాలు కూడా పాతవే. ఇలాంటి కథలు చాలా వున్నాయి. ఆ అనుబంధాలు... రామ్‌చరణ్‌ చేసిన సినిమా ఇటీవలే వచ్చింది కూడా. అయితే.. ఇంకా ఈ అనుబంధాలు అప్యాయతలు అంటూ సినిమా తీయాలి. ఇవి తెలియని విషయాలు కావు. ఈ కథను మరోలా తీస్తే బాగుండేది. కోడిపుంజుతో చేసిన ప్రయోగం బాగానే వున్నా.... ప్రేక్షకుడు కోరుకునే ఎంటర్‌టైన్‌మెంట్‌ ఏమీ కన్పించదు. 
 
మరోవైపు... అనుబంధాలు ఆత్మీయతలు అంతా నాటకం, బూటకం.. అంటూ రచయితలు ఏనాడో రాసేశారు. ఇలాంటి కథలు సమాజం ఎదుగుదలకు ఏమాత్రం ఉపయోగపడవు. పెద్దలు ఆప్యాయతలు కావాల్సిందే. దాన్ని అందరూ మర్చిపోతున్నారని అనుకోవడమే భ్రమ. దర్శక నిర్మాతలు ఇంకా భ్రమలోనే వున్నారు. వ్యక్తి ఎదుగుదలకు తెలివితేటలే ప్రధానం. ఆ తెలివితేటలకు అనుబంధాలు మిక్స్‌ చేసి తీస్తే గొప్ప సినిమా అయ్యేది. కేవలం అమ్మవారి మొక్కు కోసం కథ రాసుకుని... దాన్ని తీయడం చిత్రమే మరి.
 
రేటింగ్‌: 2/5