శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By DV
Last Modified: శుక్రవారం, 31 జులై 2015 (18:35 IST)

సాయి అచ్యుత్ 'ధనలక్ష్మీ తలుపు తడితే'... కామెడీ థ్రిల్లర్ రివ్యూ రిపోర్ట్

ధనలక్ష్మి తలుపు తడితే చిత్రం నటీనటులు : ధనరాజ్‌, మనోజ్‌, శ్రీముఖి, సింధు తులాని, అనిల్‌, తనీష్‌ తదితరులు; సంగీతం : భోలే శావలి, కథ-స్క్రీన్ ప్లే- దర్శకత్వం : సాయి అచ్యుత్‌, నిర్మాత : తుమ్మలపల్లి రామసత్యనారాయణ.
 
పాయింట్‌: అనుకోకుండా కోటి రూపాయలు చేతికి వస్తే ఎలా వుంటుందనేది పాయింట్‌.
 
'పరుగు' సినిమాలో బక్కపలచగా వుంటూ అల్లు అర్జున్‌ గ్రూప్‌తో కలిసి కామెడీ చేసిన ధనరాజ్‌.. ఒక్కో మెట్టు ఎక్కుతూ.. బుల్లితెరలో వచ్చే 'జబర్‌దస్త్‌'తో ఇంటి ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. పలు చిత్రాల్లో నటిస్తున్న ఆయన తనే హీరోగా చేస్తే ఎలా వుంటుందనే ఆలోచనతో కొంతమంది పార్టనర్స్‌తో సినిమా చేశాడు. అదే 'ధనలక్ష్మీ తలుపు తడితే'. టైటిల్‌కు తగినట్లే కథను తీసుకుని దాన్ని ఏవిధంగా తీర్చిదిద్దాడనేది చూడాలంటే కథలోకి వెళ్ళాల్సిందే. ఈ చిత్రం ద్వారా సాయి అచ్యుత్‌ దర్శకుడిగా పరిచయమయ్యాడు.
 
కథగా చెప్పాలంటే..
ప్రభుత్వం దృష్టిలో మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినల్స్‌ రణధీర్‌(రణధీర్‌), శ్రీముఖిలు. వీరు పార్లమెంట్‌ సభ్యురాలు వసుంధర (సింధు తులాని) మేనల్లుడైన బాలుడ్ని కిడ్నాప్‌ చేసి కోటి రూపాయలు డిమాండ్‌ చేస్తారు. అందుకు ఆమె ఇవ్వడానికి సిద్ధమవుతుంది. ఆనందంతో ఆ డబ్బు కోసం బయలుదేరుతారు. దారిలో అనుకోని యాక్సిడెంట్‌కు గురవుతారు. ఇంకోవైపు.. ఐదుగురు స్నేహితులు పుట్టినరోజు పార్టీ కోసం బయలుదేరతారు. తనీష్‌ (తనీష్‌), కోడి(ధనరాజ్‌), పండు(మనోజ్‌ నందం), చిట్టి(అనిల్‌ కళ్యాణ్‌), విజయ్‌ సాయి(సత్తి) ప్రయాణిస్తుండగా మార్గం మధ్యలో వారికి చిన్నపిల్లాడు కన్పిస్తాడు. 
 
వారు కారు దిగి ఎవరీ పిల్లాడు అంటూ దగ్గరికి వస్తుండగా.. అప్పుడే అక్కడికి వచ్చిన వసుంధర వారికి కోటి రూపాయిల బ్యాగ్‌ ఇచ్చి వెళ్ళిపోతుంది. ఇదంతా వారికి అయోమయంగా వుంటుంది. డబ్బు చూసి కళ్ళు బైర్లు కమ్ముతాయి వారికి. కానీ  కొద్దిసేపటికే వారి జీవితాల్లో పెద్ద మార్పు వస్తుంది. స్నేహితులు విడిపోతారు. ఇద్దరు అడవిలోని ఆదివాసుల చేతిలో చిక్కుకుంటారు. వారి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఉండగా రణధీర్‌ ఎంట్రీ ఇస్తాడు. ఆ తర్వాత ఏమయింది? కోటి రూపాయలు ఏమయ్యాయి? అనేది సినిమా. 
 
పెర్‌ఫార్మెన్స్‌
ధనరాజ్‌ అన్ని ఎమోషన్స్‌ పండించాడు. కొన్ని కామెడీ సీన్స్‌లో 'జగడం' సినిమాని గుర్తు చేసాడు. అడవిలోకి వెళ్ళాక ఆంగ్ల సినిమా పైరేట్స్‌ ఆఫ్‌ ది కరేబియన్‌కి స్పూఫ్‌గా కొన్ని సీన్స్‌ లాగించేసినట్లు కనబడుతుంది. తన ఆహార్యంపై తనే సెటైర్లు వేసుకున్నాడు ధనరాజ్‌. రణధీర్‌ నెగటివ్‌ పాత్ర మెప్పించాడు. శ్రీముఖి ఓ లేడీ థీఫ్‌‌గా చేసింది. మనోజ్‌ నందం, అనిల్‌ కళ్యాణ్‌, విజయ్‌ సాయిలు తమ పాత్రల పరిధి మేర నటించి మెప్పించారు. ఇక పోలీస్‌ ఆఫీసర్‌గా నాగబాబు తన సోదరుడు పవన్‌ కళ్యాణ్‌ని ఇమిటేట్‌ చేస్తూ ప్రేక్షకుల్ని నవ్విస్తాడు. సింధు తులాని చిన్న పాత్రలో బాగానే చేసింది. ఇక అతిథి పాత్రలో కనిపించిన తనీష్‌ మొదట్లో పాటతో, చివర్లో రెండు కామెడీ సీన్స్‌‌తో ఆకట్టుకున్నాడు.
 
సాంకేతికవర్గం:
శివకుమార్‌ సినిమాటోగ్రఫీ ఆకర్షణీయంగా వుంది. కొన్నికొన్ని లాంగ్‌ షాట్స్‌ సరిగా అనిపించకపోయినా మిగతా అంతా బాగానే ఉంది. బోలే శావలి మ్యూజిక్‌ చాలాకాలం తర్వాత ఆకట్టుకునేట్లుగా చేశాడు. బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ బాగా డీల్‌ చేశాడు. ఒక్కోచోట అదే మ్యూజిక్‌ని బ్యాక్‌ గ్రౌండ్‌‌లో రిపీట్‌ చేసారు. కంపోజ్‌ చేసిన రెండు పాటలు బాగున్నాయి. శివ వై ప్రసాద్‌ ఎడిటింగ్‌ జస్ట్‌ ఓకే. మొదట్లో చివర్లో అంత బాగా ఎడిట్‌ చేసిన శివ మధ్యలో ఎందుకు అంత సాగదీసాడు అనేది ఆయనకే తెలియాలి. 
 
దర్శకుడిగా సాయి అచ్యుత్‌ మొదటి సినిమా ఇది. కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వాన్ని ఎంటర్‌టైన్‌గా తీసుకెళ్ళడంలో సఫలం అయ్యాడు. కమెడియన్స్‌తో కిడ్నాప్‌ కథతో చేయడం ఒకరకంగా కత్తిమీద సామే. దాన్ని బాగా డీల్‌ చేయడంలో అనుభవం వుండాలి. అందరి సహాయంతో తను ఎంచుకున్న నేపధ్యాన్ని ఆసక్తికరంగా తెరకెక్కించాడు. సంభాషణలు ఫర్వాలేదు. 
 
విశ్లేషణ:
మొదటిపార్ట్‌లో 40 నిమిషాలు చాలా ఆసక్తికరంగా ఉంటుంది. క్లైమాక్స్‌లో వచ్చే 20 నిమిషాలు మరింత నవ్విస్తుంది. టీవీ రిపోర్టర్‌ గంట పాత్రలో తాగుబోతు రమేష్‌ కాసేపు అలరిస్తాడు. కామెడీ ఎంత పడించినా దర్శకుడు కొన్నిచోట్ల మరింత శ్రద్ధ తీసుకుంటే బావుండేది. సెకండాఫ్‌లో సాగదీస్తున్నారేమో అనే ఫీలింగ్‌ కలుగుతుంది. అలాగే సినిమా టైటిల్‌ కార్డ్‌ లోనే అడవి జాతి ఆదివాసుల గురించి సీరియస్‌గా చూపిస్తారు, కానీ దాన్ని సినిమాలో లైట్‌‌గా తీసుకొని ఓ కామెడీ ఎపిసోడ్‌‌గా మార్చాలని ట్రై చేసినట్లు తెలుస్తుంది. కొన్ని లాజిక్కులు మిస్‌ అయ్యాయి. 
 
విలన్‌గా రణధీర్‌ పాత్రని మొదట్లో చాలా పవర్ఫుల్‌‌గా చూపిస్తాడు. కానీ చివరికి వచ్చేసరికి ఆ పాత్రని చాలా సిల్లీగా లాగించేసినట్లు కనబడుతుంది. కామెడీ చిత్రాల ఫార్మెట్‌ ఇందులోనూ చూపించాడు. చూసిన ప్రేక్షకుడు వెంటనే సినిమాల్లో లీనమయిపోవడం ఈ చిత్రంలోని ప్రత్యేకత. ప్రతి సీన్‌, ప్రతి థ్రిల్‌ ఆడియన్స్‌‌ని అమితంగా ఆకట్టుకుంటాయి. డబ్బు అనేది ఎంత గొప్ప స్నేహితులనైనా విడగొడుతుంది అనే విషయాన్ని చాలా బాగా చూపించాడు. కామెడీ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ సినిమాలో థ్రిల్స్‌ మాత్రం ఆడియన్స్‌ని అమితంగా ఆకట్టుకుంటాయి. సెకండాఫ్‌లో కొన్ని సీన్స్‌ సాగదీసినా... మొత్తంగా ఎంటర్‌టైన్‌ చేయడమనేది కాన్సెప్ట్‌ను ప్రేక్షకులకు అందించాడు దర్శకుడు. 
 
రేటింగ్‌: 3/5